బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. వీళ్ళకు మూడిందా..? అందరూ జైలుకు వెళ్లాల్సిందేనా..?

మాకు క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది.. వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు.. మేమేం చెబితే అదే వేదం..మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 01:15 PMLast Updated on: Mar 19, 2025 | 1:15 PM

The Effect Of Betting Apps Is It Closed To Them Should Everyone Go To Jail

మాకు క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది.. వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు.. మేమేం చెబితే అదే వేదం..మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది..! ఇదిగో నిన్న మొన్నటి వరకు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కొందరు చోట మోట సెలబ్రిటీస్ తీరు తెన్నూ ఇలాగే ఉండేది. బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని దేనికి ప్రమోట్ చేస్తున్నాము.. ఎందుకు ప్రమోట్ చేస్తున్నామో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంతమంది సెలబ్రిటీలు. బెట్టింగ్ యాప్స్ ను చాలా వరకు ప్రభుత్వం నిషేధించినా కూడా వాటిని ప్రమోట్ చేయడమే కాకుండా.. వాటి నుంచి లక్షలు, కోట్లు సంపాదించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మూడినట్టే కనిపిస్తుంది. టైం బాగున్నప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అదే టైం ఒక్కసారి రివర్స్ అయ్యిందంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన రాజాలు, రాణిలు పరిస్థితి ఇదే. బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే వీటి వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

తమకు తెలిసిన సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నమ్మి.. తెలిసి తెలియకుండా బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి.. వాటికి అలవాటు పడి ఎంతో మంది తమ డబ్బు పోగొట్టుకుంటున్నారు. చిలికి చిలికి గాలి వానలా మారినట్టు ఈ బెట్టింగ్ మాఫియా రోజురోజుకు ఇంకా పెరుగుతూనే ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఉక్కు పాదం మోపుతుంది. ఇందులో భాగంగానే సజ్జనార్ అందరికీ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో వైసీపీ నేత, ప్రముఖ యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెతో పాటు విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. గతంలో వీళ్ళు కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టు తెలిపారు పోలీసులు.

ఈ రోజుల్లో సోషల్‌ మీడియా వాడకం ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఆసరాగా చేసుకుని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని బెట్టింగ్ రాయుళ్ల ప్లాన్. తమ యాప్స్ ప్రమోట్ చేయించడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు డబ్బులు ఎరగా వేస్తున్నారు. వాళ్లు కూడా ముందు వెనక చూడకుండా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఓవైపు బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వాలు ఎంత చెప్పినా.. కొందరు ఇంకా వాటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పాపులారిటీ ఉన్న యూ ట్యూబర్ లోకల్‌బాయ్ నానిపై.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మండి పడ్డారు. ఈ మధ్యే లోకల్‌బాయ్ నాని జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇలాంటివి వెంటనే మానుకోకపోతే.. చట్టప్రకారం శిక్షలు తప్పవని మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. అందుకే ఇంతకాలం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు.