Top story మహారాష్ట్ర మహారాజెవరు…? ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు….!

మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి. మహారాష్ట్రలో పార్టీల్ని చీల్చి అధికారం వెలగబెట్టిన మహాయుతి గెలుస్తుందా...? సానుభూతి మహావికాస్ అఘాడీని అధికారపీఠంపై కూర్చోబెడుతుందా...? గిరిజన కోట జార్ఖండ్ పై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి..? ఎగ్జిట్ పల్స్ రియల్ పీపుల్స్ పల్స్ ను పట్టుకోగలిగాయా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 08:59 AMLast Updated on: Nov 21, 2024 | 9:00 AM

The Election Process Has Ended In Maharashtra And Jharkhand

మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి. మహారాష్ట్రలో పార్టీల్ని చీల్చి అధికారం వెలగబెట్టిన మహాయుతి గెలుస్తుందా…? సానుభూతి మహావికాస్ అఘాడీని అధికారపీఠంపై కూర్చోబెడుతుందా…? గిరిజన కోట జార్ఖండ్ పై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి..? ఎగ్జిట్ పల్స్ రియల్ పీపుల్స్ పల్స్ ను పట్టుకోగలిగాయా…?

దేశానికి ఆయువుపట్టు మహారాష్ట్రలో గెలుపు అధికార మహాయుతిదేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతివైపే మొగ్గు చూపగా…. మరికొన్ని మాత్రం టఫ్ ఫైట్ అంటున్నాయి. మహావికాస్ అఘాడీవైపు మొగ్గు చూపిన సర్వేలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. దీన్ని ముందే ఊహించిన కాంగ్రెస్…. ఎగ్టిట్ పోల్ సర్వేల చర్చల్లో పాల్గొనేది లేదని చెప్పేసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 145. పీమార్క్ సర్వే ప్రకారం అధికార మహాయుతికి 137 నుంచి 157 సీట్లు రావచ్చు. ఇక మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లు దక్కొచ్చు. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఇక పీపుల్స్ పల్స్ అయితే ఏకంగా బీజేపీ కూటమికి 175 నుంచి 195 సీట్లొస్తాయి. అంటే మెజారిటీ మార్క్ ను అవలీలగా దాటేస్తుంది. ఇక కాంగ్రెస్ కూటమి 85-112 సీట్లతో సరిపెట్టుకోవచ్చు. మాట్రిజ్ కూడా మహాయుతివైపే మొగ్గు చూపింది. 150 నుంచి 170 సీట్లు వస్తాయంటోంది. ఇక మహా వికాస్ అఘాడీకి 110 నుంచి 130 సట్ల వరకు రావచ్చు. లోక్ శాహి-మరాఠీ రుద్ర మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెబుతోంది. బీజేపీ కూటమికి 128-142 సీట్లు రావొచ్చు. అదే కాంగ్రెస్ కూటమికి 125-140 సీట్లు వస్తాయి. ఇక 18-23 సీట్లతో ఇండిపెండెంట్లు కీలకంగా మారతారన్నది దాని అంచనా. ఇక CNN-న్యూస్ 18 ప్రకారం మహాయుతికి 154, కాంగ్రెస్ కు 128 సీట్లు వస్తాయి. చాణక్య కూడా అధికారం మహాయుతిదే అంటోంది. బీజేపీ కూటమికి 152-160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 130-138వరకు సీట్లు దక్కొచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి గెలిచి అధికారాన్ని చేపట్టాయి. తర్వాతి పరిణామాల్లో శివసేన, ఎన్సీపీ చీలిపోయాయి. ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ ల రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పే ఈ ఎన్నికల్లో వారికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి.

జార్ఘండ్ లో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 41. ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఎవరిది అధికారం అన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ జేఎంఎం-కాంగ్రెస్ కూటమిదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం బీజేపీదే పవర్ అని బల్లగుద్ది చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమికి 46-58, ఇండియా కూటమికి 24-37 సీట్లు వస్తాయి. ఇక ఇతరులకు 6నుంచి 10సీట్లు దక్కొచ్చు. మాట్రిజ్ ప్రకారం ఎన్డీయే కూటమికి 42-47 స్థానాలు, ఇండియా కూటమికి 25-30, ఇతరులకు 1-4 సీట్లు రావచ్చు. టైమ్స్ నౌ-జేవీసీ కూడా అధికారం బీజేపీదే అంటోంది. ఎన్డీయేకు 40-44, ఇండియా కూటమికి 20-40 సీట్లు వస్తాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం గెలుపు ఇండియా కూటమిదేనని స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ ఇండియా కూటమికి 53, ఎన్డీయేకి 25 సీట్లు దక్కుతాయి. దైనిక్ భాస్కర్ లెక్కల ప్రకారం గట్టిపోటీ తప్పదు. ఇండియా కూటమికి 36-39 సీట్లు, ఎన్డీయే కూటమికి 37-40 సీట్లు వస్తాయి. 2స్థానాల్లో గెలిచే ఇండిపెండెంట్లే డిసైడర్లు అవుతారు,

మొత్తంగా చూస్తే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు ఎన్డీయేదే అంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కావాలని లేదు. ఇటీవలి ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. కశ్మీర్ లోనూ బీజేపీకి వస్తాయన్న సీట్లు రాలేదు. కాబట్టి అసలు ఫలితాల కోసం 23వరకు వెయిట్ చేయాల్సిందే.