TOP STORY: పిఠాపురంలో నాగబాబు రచ్చ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో కూటమిలోని టీడీపీ, జనసేన వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటకు దిగు తున్నాయి.

పిఠాపురంలో ఇక టీడీపీ జనసేన కలిసి నడవడం కష్టమేనా. కూటమిలో కలిసే ఉన్నా.. గ్రౌండ్‌లో గొడవ తప్పదా. నాగబాబు చేసిన ఖర్మ కామెంట్స్.. నియోజకవర్గంలో జనసేన కొంపముంచబోతున్నాయా. ఈ ప్రశ్నలకు పిఠాపురం ప్రజల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో టీడీపీ, జనసేన వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటకు దిగు తున్నాయి. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య వర్గపోరు భగ్గుమంది.
గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయం, యూపీహెచ్సీ, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాలకు వచ్చిన నాగబాబుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు తమ పార్టీ జెండాలతో మాజీ ఎమ్మెల్యే వర్మకు జై కొడుతూ నినాదాలు చేశారు. దీంతో, నాగబాబు వెంట ఉన్న జనసేన నేతలు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. టీడీపీకి జైకొట్టాల్సిన శ్రేణులు ఆ పార్టీని వదిలేసి వర్మకు జైకొట్టడం గమనార్హం. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మనుద్దేశించి జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ గెలుపులో కీలక పాత్ర వహించిన వర్మను పక్కన పెడుతూండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు.. నాగబాబు పిఠాపురానికి రాగానే నిరసన తెలిపాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్ర మాలకు కూటమి నేత అయిన వర్మకు జనసేన నుంచి ఎటువంటి ఆహ్వానం లేకపోగా, అధికారుల ద్వారా మొక్కుబడిగా ఆహ్వానం పలకడంపై టీడీపీ వర్గాలు భగ్గు మంటున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆ పార్టీ నేత లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ నిలదీశాయి.
ఈ కారణంగానే వర్మ నాగబాబు టూర్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారికంగా తొలి కార్యక్రమం కావడంతో నాగబాబుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ కూడా పాల్గొన్నారు. నాగబాబు కారు ఎక్కుతుండగా జైవర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు తమ్ముళ్లు. దానికి కౌంటర్ గా జై జనసేన అంటూ జనసైనికులు కూడా రిప్లై ఇచ్చారు. కొద్దిసేపు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుందేమోనని పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎవరి జెండాలు తో వాళ్ళు హడావుడి చేశారు. వర్మపై నాగబాబు చేసిన కామెంట్స్ తోనే టిడిపి కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా కామెంట్ చేశారనే చర్చ జరుగుతుంది అందుకే తొలి పర్యటనలోనే నాగబాబుకు తాము ఏమి చెప్పాలనుకుంటున్నామో క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు మాత్రం ఎవరిని పట్టించుకోలేదు వచ్చి తన కార్యక్రమాలు తాను చూసుకుని వెళ్ళిపోయారు. టిడిపి జనసేన కార్యకర్తల మధ్య నాగబాబు పర్యటనతో దూరం మరింత పెరిగింది. పేరుకి పొత్తు అయినప్పటికీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ నాగబాబు తొలి అధికారిక టూర్‌లో టిడిపి సెగ తగిలింది. ఆయన అనుచరులు హడావిడి తోచెప్పాల్సింది చెప్పేశారు.. మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అనేది చూడాలి.