పారిపోయిన బోరుగడ్డ.. అసలు ఎవరీ రాఘవ శర్మ…?
వైసిపి హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇప్పుడు హైకోర్టుకు అలాగే పోలీసులకు సవాల్ విసిరాడు. తన తల్లికి అనారోగ్యం పేరుతో హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన బోరుగడ్డ అనిల్ కుమార్..

వైసిపి హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇప్పుడు హైకోర్టుకు అలాగే పోలీసులకు సవాల్ విసిరాడు. తన తల్లికి అనారోగ్యం పేరుతో హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన బోరుగడ్డ అనిల్ కుమార్.. బెయిల్ వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా విడుదల అయి… ఎటు వెళ్ళాడో కూడా కనబడకుండా పోయాడు. గత నెల 15వ తేదీన బోరుగడ్డ అనిల్ కుమార్ కు బెయిల్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అధికారులు అతనిని గుట్టుగా విడుదల చేశారు అధికారులు.
ఇక బెయిల్ పొడిగింపు కోసం అనిల్ మళ్లీ హైకోర్టుకు వెళ్ళగా.. ఈనెల 11వ తేదీ వరకు అతనికి బెయిల్ పొడిగించారు. ఇక ఆ తర్వాత అతను తీసుకున్న సర్టిఫికెట్ ఫేక్ అని నిర్ధారణ కావడంతో.. బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు అనే దానిపై ఇప్పటివరకు అసలు స్పష్టత లేదు. 11వ తేదీ జైలుకు వస్తాడా లేదా అనే దానిపై అధికారులు టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తనపై అధికారులకు తెలియజేయాలి. కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాత్రం ఎక్కడా పై అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అలాగే అతనిపై కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారం పంపించాల్సి ఉంటుంది. కానీ హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే అలా బయటకు పంపించడం పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు రెండుసార్లు బెయిల్ ఇచ్చిన సరే ఇప్పటివరకు ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రాకపోవడం గమనార్హం.
ఇక బోరుగడ్డ బయటికి వచ్చిన సంగతి మీడియాకు కూడా తెలియకపోవడం మరో ఆశ్చర్యం కలిగించే అంశం. ఒక నకిలీ సర్టిఫికెట్ సృష్టించి హైకోర్టును కూడా మోసం చేసి జైలు నుంచి బయటకు వచ్చాడు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండెజబ్బుతో బాధపడుతున్నారని, ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గత నెల 14న హైకోర్టును ఆశ్రయించాడు.
లంచ్ మోషన్ గా స్వీకరించి విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి.. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28 వరకు అతనికి మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ అతను జైలుకు వచ్చేసాడు. అయితే తన తల్లి ఆరోగ్యం క్షీణించింది అని చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని.. మద్యంతర బెయిల్ పొడిగించాలని.. ఈనెల 1వ తేదీ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.
ఈ అనుబంధ పిటిషన్ నను న్యాయమూర్తి విచారణకు స్వీకరించి.. మరోసారి బెయిల్ ను పొడిగించారు. తన తల్లికి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవ శర్మ.. మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారని బోరుగడ్డ హైకోర్టులో ఒక ఫేక్ సర్టిఫికెట్ సమర్పించాడు. ఆ సర్టిఫికెట్ ను ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ఆమెకు బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కడే కొడుకుని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు కుమారుడు సహాయం ఎంత అవసరమని కోర్టు ముందు వాదనలు వినిపించారు.
అయితే ఈ వ్యవహారంలో పోలీసులకు ముందు అనుమానం రాలేదు. కానీ కార్డియాలజిస్ట్ గా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే ఆయన చికిత్స అందిస్తారు. అలాంటిది బోరుగడ్డ అనీల్.. తల్లిని.. చెన్నై అపోలో ఆసుపత్రికి రిఫర్ చేయడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. దీనితో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల రంగంలోకి దిగి ఆరా తీశారు. అసలు గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ కుమార్ తల్లి పద్మావతి చేరలేదని.. ఆమెను చెన్నై అపోలోకి రిఫర్ చేస్తే డాక్టర్ రాఘవ శర్మ.. ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని తేల్చారు.
ఆయన పేరుతో ఉన్న లెటర్ హెడ్ పై ఉన్న సంతకం ఫోర్జరీ అని స్పష్టమైంది. దీనితో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అసలు విషయం బయటకు రావడంతో బారుగడ్డ అనిల్ కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అనంతపురంలో అనిల్ కుమార్ పై కేసు నమోదయింది. ఆ కేసులో ఇప్పటివరకు బెయిల్ రాలేదు. దీనితో ఇప్పుడు అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ కోసం చెన్నైలో అలాగే వివిధ ప్రాంతాల్లో గాలించేందుకు సిద్ధమవుతున్నారు. అతను 11వ తేదీ తిరిగి జైలుకు రాకపోతే మాత్రం కచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు.