దేశాన్ని ఏకం చేసిన మహాకుంభ్..45 రోజులు, 65 కోట్ల మంది |
ప్రయోగరాజులో త్రివేణి సంగమంలో మహా కుంభమేళ ముగిసింది. గడిచిన 50 ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళా చరిత్ర సృష్టించింది.

ప్రయోగరాజులో త్రివేణి సంగమంలో మహా కుంభమేళ ముగిసింది. గడిచిన 50 ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళా చరిత్ర సృష్టించింది. ప్రతి హిందువులోనూ కుంభమేళాకు వెళ్లాలనే తాపత్రయం కనిపించింది. కుంభమేళా హిందువుల్ని ఏకం చేసిన తీరు నభూతో నభవిష్యతి .సనాతన సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేలా త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళా.. దేశ, విదేశాల ప్రజల్ని ఆకర్షించింది. ఈసారి విదేశాల నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు. దేశంలో మెజార్టీగా హిందువులున్నా.. వీరిలో ఐకమత్యం తక్కువగా ఉండేది. పేరుకు హిందువులైనా నిష్ఠగా పూజలు చేస్తూ.. ఆచారవ్యవహారాలు పాటించే వారి సంఖ్య దేశంలో తక్కువే. కానీ ఇప్పుడు కుంభమేళాతో పరిస్థితి మారిపోయింది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి కుంభమేళాలో పాల్గొనాలని ఉవ్విళ్లూరారు. ఇది గతంలో ఎప్పుడూ చూడని పరిణామం. నిజానికి హిందువులు పాటించే ఆచార వ్యవహారాల్లోనూ రాష్ట్రాలను బట్టి కాస్త తేడాలున్నాయి. కానీ కుంభమేళా రాష్ట్రాలు, ప్రాంతాలు, కులాలకు అతీతంగా హిందువులందర్నీ సంఘటిత పరిచింది. అయోధ్య కంటే కుంభమేళా దేశంలో ప్రజలందరినీ ఎక్కువగా ఆకర్షించింది.
ఈసారి కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. చాలా రికార్డుల సృష్టికి కారణమయ్యారు. ఒకటి, రెండు దురదృష్టకర ఘటనలు జరిగినా.. భక్తుల్లో అచంచల విశ్వాసం కనిపించింది. కుంభమేళా కారణంగా ప్రయాగ్ రాజ్ లోనే కాదు.. దాదాపు 150 కి.మీ పరిధిలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. కోట్ల మంది భక్తులు క్రమశిక్షణతో పుణ్యస్నానాలు చేయడం.. ఓవైపు స్నానాలు జరుగుతుండగానే.. మరోవైపు పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు జరగడంతో.. త్రివేణి సంగమం దగ్గర కిలోమీటర్ల మేర సనాతన సంస్కృతి తొణికిసలాడింది.
నాగసాధువులు, అఘోరాలు, అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది. పుణ్యస్నానాలకు సమాంతరంగా పూజలు, యాగాలు, హోమాలు, ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభ నిచ్చాయి. భారత్ లో కుంభమేళాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో.. ప్రపంచమంతా కళ్లారా చూసింది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
హిందూ పురణాల ప్రకారం, కుంభమేళా పెద్ద పండుగ. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క కదలికల పై ఆధారపడి ఉంటుంది. కుంభమేళా అనేది ఒక వేడుక మాత్రమే కాదు. ఇది, మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక సమాజం. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులూ.. ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు.
కుంభమేళా జరిగే 45 రోజులు.. ప్రజల దృష్టంతా దానిపైనే ఉంది. కుంభమేళాకు వెళ్లకపోయినా.. కనీసం కుంభమేళా గురించి మాట్లాడుకోవాలని ఎవరికి వారే స్వీయ నిమయం పెట్టుకున్నారు ఇలా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చాలా అరుదు. కానీ కుంభమేళా మాత్రం శతాబ్దాలుగా ఈ పనిని చాలా సులభంగా చేస్తోంది. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరలు, కులాల తేడాలు, భాష, సంస్కృతులనే అడ్డుగోడలు ఏమీ లేకుండా అందర్నీ ఒక్కతాటిపైకి తెస్తున్న కుంభమేళా.. భారత్ కే సొంతమైన సంప్రదాయాల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతోంది.
కుంభమేళా వస్తోందంటే చాలు.. భక్తులు ముందే సిద్ధమౌతారు. సౌకర్యాలు కల్పించినా.. లేకున్నా ఎవరూ ఫిర్యాదు చేయరు. ఎలాగోలా త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానం చేయాలనే బలమైన కోరికే వారిని ముందుకు నడిపిస్తుంది. తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నామనే గర్వం.. వారికి కొత్త శక్తిని ఇస్తుంది. నా సంస్కృతి నా గర్వం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో ఉప్పొంగి పోయారు.
140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం ఏకం కావాలంటే బలమైన భావోద్వేగం కావాలి. కుంభమేళా కావాల్సినంత ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని అందిస్తోంది. ఎవరికి వారే ఈ భావోద్వేగాన్ని ఆవాహన చేసుకుంటున్నారు. మొదట స్నానం చేసి వచ్చేద్దామని త్రివేణి సంగమానికి వెళ్లిన వారు కూడా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితులై 2,3 రోజులు ఉండి పోయారు. ఆ తర్వాత కూడా రాలేకే వస్తున్నారు. అంతగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాతో కనెక్ట్ అయ్యారు. సరే మన దేశంలో అంటే కుంభమేళాకు ఘన చరిత్ర ఉందని తెలుసు. సంగమంలో మునిగితే ఏం జరుగుతుందో ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ జీవితంలో కుంభమేళా గురించి వినడమే కానీ.. ప్రత్యక్షంగా చూసి ఎరుగని విదేశీయులు కూడా ఎంతో భక్తి భావంతో, తన్మయత్వంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం కచ్చితంగా ఆధ్యాత్మిక అద్భుతమే.
ఇప్పటివరకు నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు ఉంటారని తెలియని విదేశీయులు.. వారిని చూడగానే తమను తాము నిగ్రహించుకోలేకపోతున్నారు. నిజంగానే దైవదర్శనం కలిగినంత భావన కలుగుతోందని ఉక్కిరిబిక్కిరౌతున్నారు. కేవలం కుంభమేళాకు మాత్రమే హిమాలయాల నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చే నాగసాధువుల కోసం కోట్ల మంది భక్తులు ఓపికగా ఎదురుచూసి.. వారి ఆశీర్వాదాలు తీసుకునే త్రివేణి సంగమం నుంచి అడుగు బయటపెడుతున్నారు. ఎంతో కోలాహలంగా సాగుతున్న కుంభమేళాలో.. సాధువుల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులే జాగ్రత్తలు తీసుకుంటున్న అరుదైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
మన ఆధ్యాత్మిక వేడుకల్ని మనం నెత్తికెత్తుకోకపోతే మరెవరు చేస్తారనే ఆలోచన జనంలో లో కనిపిస్తోంది
కుంభమేళాకు శతాబ్దాల చరిత్ర ఉంది. కుంభమేళా జరిగినట్టుగా చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు క్రీస్తుపూర్వమే కుంభమేళా వైభవంగా జరిగిందని కూడా చెబుతారు. కానీ ఈ విశేషాలన్నీ వినటమే కానీ.. ఎవ్వరూ కళ్లారా చూసింది లేదు. కానీ ఇప్పుడు ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా.. చరిత్రలో చెప్పినవన్నీ నిజమేనని చాటిచెప్పేలా జరిగింది. కోట్ల మంది హిందువులు సంఘటితమై చేసే వేడుక ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తోంది. ఆధ్యాత్మికతకు ఎంతటి శక్తి ఉందో నిరూపిస్తోంది. దేశంలోని రాష్ట్రాలే కాదు.. ప్రపంచంలోని దేశాలే ఏకమయ్యే స్థాయిలో కనీవినీ ఎరుగని విధంగా జరిగింది.
ముఖ్యంగా కుంభమేళా దేశం మొత్తానికీ కనెక్ట్ అయిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనడంలో సందేహం లేదు. ఇదేదో ముందుగానే అనుకున్నది కాదు. ఎవరో ప్లాన్ చేస్తే జరిగేది కాదు. దైవ సంకల్పంతో జరగాల్సిన ప్రక్రియ. ఒక భావనతో కుంభమేళాకు బయల్దేరుతున్నారు. పవిత్రస్నానం తర్వాత మరో భావన కలుగుతోంది. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నాక కలిగే భావన వేరు. చివరకు తిరుగు ప్రయాణం సమయానికి కలిగే భావన ఇంకోటి. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ఆధ్యాత్మిక భావనలు, సనాతన అనుభూతులు భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కుంభమేళా ఘనతను దశదిశలా చాటిచెపుతున్నాయి. భారత్ లో ఉన్న ఆధ్యాత్మిక భావనల బలమేంటో ఎలుగెత్తి
చాటుతున్నాయి. హిందువులంతా ఒక్కతాటిపైకి వస్తే.. కచ్చితంగా ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతమౌతుందని నిరూపిస్తున్నాయి.
మొత్తం మీద కుంభమేళాతో దేశం కనెక్ట్ అయింది. కుంభమేళాను చూసి ప్రపంచం ఆబ్బురపడుతోంది. ప్రత్యక్ష అనుభూతులు, పరోక్ష ఉద్వేగాల కలయిక కనిపిస్తోంది. 45 రోజుల్లోనే 60 కోట్ల మంది పుణ్య స్నానాలు.. తరతరాల సనాతన సంస్కృతి వైభవం సాక్షాత్కరించింది. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి నేటివరకు వచ్చిన ఆధ్యాత్మిక శోభను పరిచయం చేసింది. ఇలా ఒకటేమిటి ఒక్క కుంభమేళా.. ఎన్నోప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కోట్ల మందిలో తెలియని సరికొత్త సంకల్పాన్ని పాదుకొల్పింది. ఈ కుంభమేళా స్ఫూర్తితో మరికొన్నేళ్ల పాటు సనాతన ధర్మం తలెత్తుకుని నిలబడే గర్వాన్నిచ్చింది.