సుదీర్ఘ యుద్ధానికి త్వరలోనే ముగింపు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్లానే వేశాడుగా..!
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడబోతోందా? మూడేళ్ల సుదీర్ఘ యుద్ధం జస్ట్ వారం రోజుల్లోనే ముగియబోతోందా? అమెరికా అధినేత ట్రంప్ ఔననే చెబుతున్నారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడబోతోందా? మూడేళ్ల సుదీర్ఘ యుద్ధం జస్ట్ వారం రోజుల్లోనే ముగియబోతోందా? అమెరికా అధినేత ట్రంప్ ఔననే చెబుతున్నారు. ఈ వారం లోనే సుదీర్ఘ యుద్ధం ముగియబోతోందని ప్రకటించారు. కానీ, పుతిన్ దూకుడు మాత్రం దరిదాపుల్లో కూడా యుద్ధానికి ముగింపు లేదనే చెబుతున్నాయి. జెలెన్‌స్కీ సైతం పీస్ ప్రకటనలకే తప్ప ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదంటున్నారు. ఇంతకూ, ఉక్రెయిన్ వార్‌జోన్‌లో అసలేం జరుగుతోంది? ఈ వారంలోనే యుద్ధానికి ముగియబోతోందని ట్రంప్ అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెబుతున్నారు? సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న అడ్డంకులేంటి? టాప్ స్టోరీలో చూద్దాం..
మూడేళ్ల భీకర యుద్ధంతో స్మశానంగా మారిన ఉక్రెయిన్‌లో కొత్త ఆశలు రేపుతున్న ప్రకటన ఇది. తాను అధికారంలోకి వచ్చీరాగానే ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్‌కార్డ్ వేసి తీరతానని ప్రకటించిన ట్రంప్.. ఆ దిశగా చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే, సౌదీలో చర్చల తర్వాత అగ్రరాజ్యం నుంచి యుద్ధ విరమణకు సంబంధించి ప్రకటనలు రాలేదు. దీంతో మూడేళ్ల యుద్ధాన్ని ట్రంప్ కూడా ముగించలేరని ప్రపంచం డిసైడ్ అయిపోయింది. కట్‌చేస్తే.. రెండు రోజుల క్రితం ట్రంప్ నుంచి కీలక ప్రకటన ఒకటి వచ్చింది. యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే అమెరికా కూడా లైట్ తీసుకుంటుందన్నది ఆ ప్రకటన సారాంశం. తర్వాత పుతిన్, జెలెన్‌స్కీల్లో కదలికలు కనిపించాయి. తాజాగా ట్రంప్ కూడా ఈ వారంలో యుద్ధానికి ముగింపు రాబోతోందని ప్రకటించడంతో యుద్ధ భూమిలో ఆశలు చిగురిస్తున్నాయి.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం ఉందన్నది ట్రంప్ ప్రకటన సారాంశం. ఆ రెండు దేశాలు తమతో కలిసి భారీగా వ్యాపారం చేయబోతున్నాయని ట్రూత్‌లో పోస్టు చేశారు. వ్యాపార ఒప్పందాల నుంచి ఆ దేశాలు తమతో కలిసి సంపద గడిస్తాయని వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ అభివృద్ధికి ఇవి దోహదపడతాయన్నారు. ఇదే విషయంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. తొందర్లోనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందం సాకారం అవ్వొచ్చని చెప్పారు. ఈ మేరకు అమెరికా ఓ శాంతి ఒప్పందం ముసాయిదా తయారుచేసి యూరప్ నేతలకు వెల్లడించగా.. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చే వారం లండన్‌లో మరో రౌండ్ చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. యుద్ధాన్ని ముగిస్తున్నందు కుగాను ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందానికి సంబంధించిన మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై సంత కాలు చేశామన్నారు. అదే విధంగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నిజానికి.. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు మొదట 30 రోజుల కాల్పుల విరమణ ప్లాన్‌ని ట్రంప్ ఫాలో అయ్యారు. 30రోజుల సమయనాన్ని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఉపయోగిం చుకోవాలనేది ఆయన వ్యూహం. ఈ 30 రోజుల కాల్పుల విరమణ కోసం అగ్రరాజ్యం అధినేత చేయని ప్రయత్నం లేదు. దుబాయ్ వేదికగా మొదలైన చర్చలు అధ్యక్షుల స్థాయికి వరకూ వెళ్లాయి. నేరుగా సమావేశం జరగకపోయినా… ఫోన్ కాల్స్ ద్వారా పుతిన్, జెలెన్‌స్కీతో చర్చించారు. మొదట పుతిన్‌కు కాల్ చేసిన ట్రంప్.. 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. దీనికి పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధాన్ని విరమింపజేయంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపి వేసేలా చూడాలని అమెరికా, రష్యా నిర్ణయించాయని ప్రకటనలో పేర్కొ న్నారు. అదే సమయంలో జెలెన్‌స్కీతోనూ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై సానుకూలత రాబట్టారు. ఇంకేముంది.. సుదీర్ఘ యుద్ధం ముగియడం ఖాయం అనే అంతా అనుకున్నారు. కానీ, ఈ వ్యవహారం మాటలవరకే పరిమితం అయింది తప్ప చేతల్లో కనపడలేదు. వివరంగా చెప్పాలంటే 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు తప్ప దాడులు మాత్రం ఆపలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది.
ఒకవైపు శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మాత్రం దాడులను కొనసాగిస్తున్నాయి. ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన రష్యా.. కీవ్‌పై పదులకొద్దీ డ్రోన్, బాంబు దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్ బలగాలూ దాడులు కొనసాగించాయని రష్యా అధికారులు వెల్లడించారు. వివరంగా చెప్పాలంటే.. గత నెలలో సౌదీ చర్చల సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే ఒకరిపై మరొకరు భీకర దాడులకు దిగినట్టే ఇప్పుడూ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులు మరణించారనీ, శత్రువులపై ప్రతీకారం తీర్చుకుని తీరతామని జెలెన్‌స్కీ ప్రకటించారు. పైగా క్రిమియాపై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అగ్ర రాజ్యం సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది. దీనికి జెలెన్‌స్కీ అంగీకరించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గతేడాది జూన్‌లో కాల్పుల విరమణ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనల్లో క్రిమియాను రష్యా ప్రాంతంగా ఉక్రెయిన్ గుర్తించాలని చెప్పారు. అయితే దానికి జెలెన్‌స్కీ అంగీకరించలేదు. పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ స్పందించింది. సుదీర్ఘ యుద్ధాన్ని ముగించడంలో ఇలాంటి చిక్కుముడులు చాలానే ఉన్నాయి. అవన్నీ జస్ట్ వారం రోజుల్లో తేలేవి అయితే కాదు. మరి ఏ లెక్క ప్రకారం ట్రంప్ వారం రోజుల్లోనే యుద్ధం ఆగుతుందని ప్రకటించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.