నెతన్యాహు చేతికి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్‌డౌన్ షురూ
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది.

మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇప్పటివరకూ ఎవరికీ ఇవ్వని ఈ బాంబును ట్రంప్ ఇజ్రాయెల్‌కు ఇవ్వబోతున్నారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అదే నిజమై టెల్ అవీవ్ చేతికి ఈ బాంబు చిక్కితే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మాత్రమే కాదు..కలలో కూడా ఊహించని విధ్వంసం ఇరాన్‌లో జరుగుతుంది. అదే జరిగితే ఇస్లామిక్ దేశాలన్నీ ఏకం అవుతాయి. ఆ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ని తెలిసీ ట్రంప్ ఆ భయంకరమైన బాంబును ఇజ్రాయెల్‌కు ఎందుకిస్తున్నట్టు? ఇజ్రాయెల్‌కు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ చేయి దాటిపోతున్నాయి. హమాస్ తన చెరలో ఉన్న బందీలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు విడుదల చేయాలని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ సైతం హమాస్‌కు అంతే టైమ్ ఇచ్చింది. కానీ, హమాస్ మాత్రం ట్రంప్, నెతన్యాహులను లెక్కచేయలేదు. దీంతో టెల్ అవీవ్ నుంచి మరో ప్రకటన వచ్చింది. వీకెండ్ లోపు తమ పౌరులను విడుదల చేయకపోతే.. యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందనీ, ఆ యుద్ధం ఎక్కడ ఆగుతుందో చెప్పడం కూడా కష్టమని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికని అమలు చేస్తామనీ తేల్చి చెప్పింది. అయినా హమాస్ తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ యుద్ధమే కోరుకుంటే తామూ అదే చేస్తామనే సంకేతాలిస్తోంది. సో.. శనివారం 12 గంటల తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఏదైనా జరగొచ్చు. కానీ, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు రచ్చ వేరే ఉంది. అదే గాజాకు మాత్రమే పరిమితం కావాల్సిన ఉద్రిక్తతలను వరల్డ్ వార్ త్రీ దిశగా నడిపించబోతోంది.
ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు వీలుగా ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకొని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు సమర్పించాయి. ఈ దాడుల తీవ్రత ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. ఇరాన్ అణు కార్యక్రమం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లిపోయే స్థాయిలో ఉంటుంది. అంటే ఆ దేశం మళ్లీ అణ్వాయుధాల తయారీకి సిద్ధం అవ్వడానికి దశాబ్దాల సమయం పడుతుంది. ఇరాన్‌పై దాడుల ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ కార్యవర్గానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందిస్తారు. ఆ మాటకొస్తే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్‌పై దాడులుచేయాలని ట్రంప్ ఎప్పుడో నెతన్యాహుకు చెప్పారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అవసరమైన ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు అందే అవకాశం ఉంది. ఇటీవలే ఇరాన్ అణు లక్ష్యాలపై వైట్‌హౌస్ క్లియక్ కట్ కామెంట్స్ చేసింది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారుచేయడాన్ని ట్రంప్ సర్కారు ఏమాత్రం ఆమోదించదని తేల్చి చెప్పింది. తాను ఒప్పందానికి సిద్ధమైనా.. ఇరాన్ మాత్రం ఘర్షణనే ఇష్టపడుతుందని ట్రంప్ కూడా అన్నారు. సో.. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేస్తానంటే ట్రంప్ అస్సలు కాదనరు.
ఇరాన్‌లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని గత నెలలో అమెరికాకు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే ఇజ్రాయెల్ అక్టోబర్‌లో జరిగిన దాడుల్లో టెహ్రాన్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే సిట్యువేషన్‌లో ఇరాన్ లేదు. కాబట్టి దాడికి ఇదే రైట్ టైమ్ అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. కానీ, ఇరాన్ అణు కార్యకలాపాలను భారీగా ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ దగ్గరున్న సాధారణ బాంబులు సరిపోవు. అది ఇప్పటికే నిరూపితమైంది. గతేడాది అక్టోబర్‌లో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్‌పై దాడులు చేసినా స్వల్ప నష్టమే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం వాటిని నామరూపాలు లేకుండా చేయడం. అలా చేయాలంటే ఒక్క మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు మాత్రమే సాధ్యం. వీటికోసం ఇజ్రాయెల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. కానీ, జార్జ్‌బుష్, ఒబామా, బైడెన్ అందుకు అంగీకరించలేదు. తొలివిడత పాలనలో ట్రంప్ కూడా విముఖత వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఇజ్రాయెల్ చేతికి చిక్కబోతున్నాయి.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పేరున్న జీబీయూ 43లను ఇజ్రాయెల్‌కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఇవి నాన్ న్యూక్లియర్ బాంబ్స్. దీనిని అల్బర్డ్ ఎల్ వీమోర్స్ట్ డెవలప్ చేశారు. 2017లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా ఈ బాంబులను ప్రయోగించింది. అప్పుడు 36 మంది ఉగ్రవాదులు హంతం అయ్యారు. ఈ బాంబు ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో అక్కడి నుంచి ఏకంగా 20 మైళ్ల వరకు దాని దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఇరాక్ ఆర్మీ పైన విజయం సాధించేందుకు తొలిసారి దీనిని తీసుకు వచ్చారు. సద్దాం హుస్సేన్‌ను టార్గెట్ చేసేందుకు డిజైన్ చేశారు. సులభంగా వెళ్లలేని గుహలు తదితర ప్రాంతాలలో దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులకు ఈ బాంబులే ఎందుకంటే..భూగర్భంలో ఉన్న ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి దిట్టకాబట్టి. అందుకే ఈ బాంబుల పేరు వినపడగానే టెహ్రాన్ వెన్నులో వణుకు మొదలైంది. ట్రంప్ నిజంగా ఈ బాంబులను ఇజ్రాయెల్‌కు ఇస్తే మిడిల్ ఈస్ట్ వార్.. కాస్తా వరల్డ్ వార్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.