వల్లభనేని వంశీని వెంటాడుతున్న పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు వెంటాడుతున్నారు. ఆయన అనుచరులు ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు వెంటాడుతున్నారు. ఆయన అనుచరులు ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా వల్లభనేని ప్రధాన అనుచరుడు మోహనరంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు. 2024 జనవరి 21వ తేదీన గన్నవరం పీఏసీఎస్ఓ (PACSO) మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేయగా… అప్పటి నుంచి వీరు తప్పించుకుని తిరుగుతున్నారు. గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి దిగారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. వంశీ అనచురుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.