వంశీ ఇప్పట్లో కష్టమే…!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే సంకేతాలు కనబడటం లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన అంశంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే సంకేతాలు కనబడటం లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన అంశంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు అనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయనను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.
పలు కేసులు కూడా వంశీ పై ఇప్పటికే నమోదయ్యాయి. ఇక తాజాగా వల్లభనేని వంశీ కీలక అనుచరుడు ఓలుపల్లి రంగాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి తాజాగా ఎస్సీ ఎస్టీ కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ దాడి కేసులో కూడా ఆయన రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఆయన విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ దాఖలు చేసినా.. ఆయనకు బెయిల్ రాలేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా.. ఆ తర్వాత వంశీ చర్యల కారణంగా కోర్టు కొట్టి వేసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీ పై సీరియస్ గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసిన అధికారులు.. కోర్టుకు నివేదిక కూడా సమర్పించారు.