ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసులాట ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఇక ఈ ఘటనపై ఇప్పుడు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని వెనక కుట్రకోణం ఉందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాలకు రావడం, ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉండడం, ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో ఈ తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. అయితే ఊహించని విధంగా తొక్కిసలాట ఘటన జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. భక్తులను క్యూ లైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేయగా భారీగా భక్తులు ముందుకు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని టిటిడి ఇప్పటికే ప్రకటించింది. అయితే డిఎస్పీ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణం అని ఆరోపణలు వినపడుతున్నాయి. బైరాగి పట్టెడ, పద్మావతి పార్క్ లో జరిగిన తొక్కేసిలాట ఘటనపై కీలక నివేదికను సీఎం చంద్రబాబుకు అందించిన తెలుస్తోంది. ఓ డిఎస్పి చేసిన అత్యుత్సాహం కారణంగా ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం గేటు వద్దకు భక్తులు దూసుకొచ్చారు. భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో అక్కడున్న సిబ్బంది కూడా వారిని అదుపు చేయలేకపోయారు. ఇక తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత డిఎస్పి స్పందన కూడా ఆశించిన స్థాయిలో లేదు అని ఆరోపణలు వినిపించాయి. సకాలంలో అదనపు సిబ్బందితో ఎస్పీ సుబ్బారాయుడు సహా ఇతర పోలీసు సిబ్బంది చేరుకొని కిందపడిపోయిన భక్తులను బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. లేకపోతే మృతుల సంఖ్య మరింతగా పెరిగి ఉండేది అని అక్కడి భక్తులు చెప్తున్నారు. అంబులెన్స్ వాహనాలను బయటే పార్కు చేసి డ్రైవర్లు వెళ్లిపోయారు. దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులోకి రాలేదు. డి.ఎస్.పి అత్యుత్సాహం తో పాటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. డిఎస్పి తీరుపై ఇప్పటికే ఎస్పీ సుబ్బారాయుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే... 8వ తేదీ బుధవారం ఉదయం 5 గంటలకు తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభమైంది. ఉదయం ఏడున్నర కు 60 శాతం భక్తులతో క్యూ లైన్ లు నిండిపోయాయి 8:30 నిమిషాలకు క్యూలైన్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్తిస్థాయిలో క్యూ లైన్ లో నుండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. ఇక ఉదయం 10:30కు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్ళిపోయారు. 11 గంటల 30 నిమిషాలకు భక్తులు టాయిలెట్స్ కోసం తాగునీరు భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు భక్తుల తాకిడి తారస్థాయికి చేరుకుంది మధ్యాహ్నం 2:30 అవుతున్నా.. కౌంటర్ కేంద్రాల వద్ద భక్తులను అధికారులు అప్రమత్తం చేయలేదు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు క్యూలైన్లో వేచి ఉండలేక టికెట్లు ఎప్పుడు ఇస్తారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసం, బైరాగి పట్టిడి, రామానాయుడు స్కూల్స్ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్ ఇస్తారని ప్రకటించారు. సాయంత్రం 5: 30 నిమిషాలకు రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఇక సాయంత్రం 6:30 కు కౌంటర్ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండడంతో టోకెన్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసన్ కౌంటర్ వద్ద తమిళనాడుకు చెందిన మల్లికా అనే మహిళ క్యూలైన్లో కింద పడిపోయింది. రాత్రి 7:45 నిమిషాలకు కిందపడిన మహిళపై నుంచి భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. రాత్రి 8 గంటలకు మరో పదిమంది భక్తులు కింద పడిపోయారు. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేశారు. రాత్రి 8:30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో బైరాగి పట్టిడి రామానాయుడు స్కూల్ వద్ద తోపులాటలో 40 మంది భక్తులు కిందపడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. రాత్రి 9:30 నిమిషాలకు కిందపడిపోయిన భక్తులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీళ్ళలో ఐదుగురు చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 9.20 నిమిషాలకు అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్లు జారీని కొనసాగించే పనిలో పడటం వివాదాస్పదమైంది. అయితే ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉంది అనే అనుమానాలు రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. గతంలో తిరుమలలో ఎటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు కనబడుతున్నాయి.[embed]https://www.youtube.com/watch?v=59UDVeRFdLI[/embed]