Top story: ఒక్క రాత్రి 100 ఎకరాలు…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం,…చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమన్న సుప్రీం…ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేత చిన్న విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. చెట్ల కొట్టివేతకు సీఈసీ అనుమతి తీసుకున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని ఆదేశించిన సుప్రీంకోర్టు…జరిగిన దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 16న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. ప్రభుత్వం మార్చి 15న వేసిన కమిటీలోని అధికారులు కూడా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ…మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అటవీ భూమి అని ఆధారాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
కంచె గచ్చిబౌలి గ్రామం సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13న నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేసింది. ఆ తర్వాత ఏపీ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు కేటాయించినట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ…ఐఎంజీ అకాడమీస్ 2006లో హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఐఎంజీ పిటిషన్‌ను హైకోర్టు 2024, మార్చి 7వ తేదీన కొట్టేసిందని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2024, మే 3వ తేదీన సుప్రీంకోర్టు సైతం ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు వెలువరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
400ఎకరాలు అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీఐఐసీ వెల్లడించింది. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని స్పష్టం చేసింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యతకు ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉందని టీజీఐఐసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనను హెచ్‌సీయూ ఖండించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని తెలిపింది.