ఊహకందని స్కెచ్ వేసిన తాలిబన్లు ,పాకిస్తాన్ అంతానికి అదే ఆరంభమా?

దారుల్ ఉలూమ్ హక్కానియా.. పేరుకే మదర్సా. రియాలిటీలో ఉగ్రవాదులను తయారు చేసే జిహాద్ యూనివర్శిటీ. ఇక్కడే మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదుల్ని తయారు చేసింది పాకిస్తాన్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 01:00 PMLast Updated on: Mar 05, 2025 | 1:00 PM

The Taliban Who Made An Unexpected Sketch Is It The Beginning Of The End Of Pakistan

దారుల్ ఉలూమ్ హక్కానియా.. పేరుకే మదర్సా. రియాలిటీలో ఉగ్రవాదులను తయారు చేసే జిహాద్ యూనివర్శిటీ. ఇక్కడే మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదుల్ని తయారు చేసింది పాకిస్తాన్. ఇండియాలో ఉగ్రదాడుల మూలాలు చాలా వరకూ అక్కడే కనిపించేవి. కానీ, తాలిబన్ల ఎంట్రీతో పరిస్థితులు మారాయి. తాలిబన్లకు హక్కానీలు మద్దతు తెలిపారు. దీంతో ఈ మదర్సా పేరు వినిపిస్తే చాలు పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలయ్యేది. ఇటీవల ఈ మదర్సాలో ఆత్మాహుతి దాడి జరిగింది. అందులో తాలిబన్ పితామహుడు మౌలానా సమియుల్ హక్ హక్కానీ కుమారుడు మృతి చెందాడు. పాక్ పతనానికి బీజం పడింది అక్కడే. ఎందుకంటే సమియుల్ హక్ హక్కానీ కుమారుడు పాకిస్తాన్ పతనాన్ని శాసించే శపథం చేశాడు. ఆ శపథమే ఇస్లామాబాద్ పాలకులను నిలువునా వణికిస్తోంది. ఇంతకూ, దారుల్ ఉలూమ్ హక్కానియాలో అసలేం జరిగింది? తాలిబన్ పితామహుడి కుమారుడి మరణం పాకిస్తాన్‌ను ఎలా ధ్వంసం చేయబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..

ఇతడి పేరు మౌలానా అబ్దుల్ హక్ సానీ. పాకిస్తాన్‌ను తాము సొంతం చేసుకుంటామన్నది సానీ ఆవేశపూరిత ప్రసంగం సారాశం. అంతేకాదు, పాకిస్తాన్‌ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అమర వీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నాడు. అతడు ఎక్కడో.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండి ఈ వ్యాఖ్యలు చేయలేదు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇతడు ఎవరోకాదు..దారుల్ ఉలూమ్ హక్కానియా చీఫ్ మౌలానా హమీద్ ఉల్ హక్ కుమారుడు. మూడు రోజుల క్రితం అతడు దారుల్ ఉలూమ్ హక్కానియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మౌలానా హమీద్ ఉల్ హక్ చనిపోయాడు. అదికూడా అతడిని చంపడమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. అతడి అంత్యక్రియలకు వేలాది మంది తాలిబన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు సానీ. తాము బాంబు దాడులు, బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పాడు. హక్కానియా కుటుంబ సభ్యుడు ప్రాణాలతో ఉన్నంత వరకు పాకిస్తాన్‌పై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశాడు. సో.. దారుల్ ఉలూమ్ హక్కానియా చీఫ్ మరణం పాకిస్తాన్ పతనానికి ఆరంభం అనుకోవచ్చు.

నిజానికి.. దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాను ఏర్పాటు చేసింది పాకిస్తానే. 1973 నుంచి ఇక్కడి ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ ఆయుధాలు అందించి.. శిక్షణ ఇచ్చింది. అక్కడి నుంచే భారత్‌ మీదికి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పేది. కానీ.. ఆ తర్వాత తాలిబన్ల పోరాటానికి హక్కానీలు మద్దతు పలికారు. వాస్తవానికి హక్కానీలను తాలిబన్లకు మద్దతుగా పంపింది కూడా పాకిస్తానే. తాలిబన్లు ఆప్ఘానిస్తాన్‌ను 2021 ఆగస్టులో సొంతం చేసుకున్నారు. సుమారు నాలుగేళ్లుగా అల్లా పేరుతో కరుడుగట్టిన ఇస్లామిక్‌ పాలనను సాగిస్తున్నారు. షరియా చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అంతటితో తాలిబన్లు సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్‌పై కన్నేశారు. పాకిస్తాన్‌ను తాలిబన్‌ రాజ్యంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. పాకిస్తాన్‌కు ప్రధాన శత్రువు ఎవరు? అంటే.. ఎవరైనా తడుముకోకుండా ఇండియా అని చెబుతారు. కానీ ఇస్లామాబాద్‌కు ఇప్పుడు అసలైన శత్రువులు తాలిబన్లే. చాన్నాళ్లుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బోర్డర్‌లో నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో దారుల్ ఉలూమ్ హక్కానియా చీఫ్ ఆత్మాహుతి దాడిలో మరణించడం పాకిస్తాన్‌కు శాపంగా మారింది.

వాస్తవానికి.. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను సొంతం చేసుకుంటే.. దాన్ని పాక్‌లో కలుపుకోవచ్చని ఇస్లామాబాద్‌ పాలకులు స్కెచ్ వేశారు. కానీ, ఈ ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడు తాలిబన్లే పాకిస్తాన్‌ను అల్లా రాజ్యంగా మార్చాలని వ్యూహాలు చేస్తున్నారు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి వెళ్లిపోయే సమయంలో అమెరికా సైన్యం భారీగా గన్స్‌తో పాటు మందుగుండు సామగ్రి వంటి ఆయుధాలను, యుద్ధ వాహనాలను వదిలేసి వెళ్లింది. అమెరికా వదిలేసి వెళ్లిన ఆ ఆయుధాలనే ఇప్పుడు టీటీపీ, హక్కానియా సభ్యులు వినియోగిస్తున్నారు. విచిత్రం ఏంటంటే జమ్మూకశ్మీర్‌పై పాకిస్తాన్ అమలు చేసిన ఉగ్రవాద ప్లాన్‌నే ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాపై టీటీపీ ద్వారా తాలిబన్లు ప్రయోగిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. తాను సృష్టించిన ఉగ్ర సంస్థలే పాకిస్తాన్‌ను క్రమంగా కబళిస్తున్నాయి. దీనికి పాకిస్తాన్ భద్రతా బలగాలలో ఉన్న టీటీపీ, హక్కానియా మద్దతు దారులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం కథ అంతా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లే నడిపిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరు చేసుకున్న పాపం వారినే బలి తీసుకుంటుంది అన్నట్టు.. పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలకు తాలిబన్ల రూపంలో అనుభవించబోతున్నారు.