Top story: ట్రంప్ ఎఫెక్ట్…!
ట్రంప్ 26శాతం పన్ను వేస్తున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత వైట్‌హౌస్ ఎనెక్సర్ మాత్రం భారత్‌పై పన్నును 27శాతం పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ట్రంప్ 26శాతం పన్ను వేస్తున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత వైట్‌హౌస్ ఎనెక్సర్ మాత్రం భారత్‌పై పన్నును 27శాతం పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని భారతీయ ఉత్పత్తులపై 26 లేదా 27శాతం పన్ను ఉండదు. కొన్నిటిపై ఎక్కువ ఉంటుంది. కొన్నింటిపై తక్కువ ఉంటుంది. కానీ సగటున 26శాతం పన్నులు వేస్తారు. ముఖ్యంగా మన వ్యవసాయ ఉత్పత్తులపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. మనం అమెరికా అగ్రీ ప్రొడక్ట్స్పై వందశాతం పన్నులు వేస్తున్నామని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాబట్టి మన అగ్రీ ఉత్పుత్తులకు కాస్త గడ్డుకాలమే. మన డెయిరీ ఉత్పత్తులపై అమెరికాలో ట్యాక్సులు 38.23శాతానికి చేరతాయి. దీంతో అక్కడ వాటి రేట్లు పెరిగి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్, కోకో ఎగుమతులపైనా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే భారత్ నుంచి చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతులు కూడా అమెరికాకు ఎక్కువే. వాటి రేట్లు పెరిగి అక్కడ మన ప్రోడక్ట్స్ అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే బంగారం, డైమండ్ ఆర్నమెంట్స్‌పై కూడా పన్నులు 13.32శాతానికి చేరతాయి. దీంతో వాటి రేట్లు పెరుగుతాయి. చెప్పులు, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగి మనవాళ్లకు ఇబ్బందులు తప్పవు. అమెరికాకు మన ఎక్స్‌పోర్ట్స్ 91 బిలియన్ డాలర్లు.. అలాగే మన దిగుమతులు 54 బిలియన్ డాలర్లు… ఇప్పుడు టారిఫ్‌ల పెరుగుదలతో అమెరికాకు మన ఎగుమతులు భారీగా పడిపోతాయన్నది ఓ అంచనా. దీంతో పరిస్థితిని కేంద్రం విశ్లేషిస్తోంది. ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే వ్యూహాలు రెడీగా ఉన్నాయి.
ట్రంప్ టారిఫ్‌లు పెంచడం వల్ల అంతా నష్టమేనా అంటే అలాగని చెప్పడానికీ వీల్లేదు. మన వ్యాపార విస్తృతికి ఇదో మంచి అవకాశం. సంక్షోభ సమయాల్లో సరికొత్త మార్కెట్లను సృష్టించుకోవాల్సి ఉంటుంది.
కొంతకాలం పాటు ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత కుదుటపడుతుందన్నది ఓ అంచనా. అమెరికన్ మార్కెట్లలో వచ్చే ఇబ్బందులతో యూరోపియన్ దేశాలతో వ్యాపారం పెరిగే అవకాశాలున్నాయి. అలాగే ట్రంప్ మనకు కీడులోనూ మేలు చేశారు. మనతో పోల్చితే ఇతర ఆసియా దేశాలపై పన్నుమోత ఎక్కువగా ఉంది. చైనాను చూసుకుంటే గతంలో వేసిన 20శాతంతో పోల్చితే ప్రస్తుతం పన్నుపోటు 54శాతానికి చేరింది అలాగే వియత్నాంపై 46, బంగ్లాపై 37, థాయ్‌లాండ్‌పై 36, తైవాన్‌పై 32శాతం పన్నులు వేశారు. అంటే మనకంటే వారి ఉత్పత్తుల రేట్లు అమెరికాలో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇది కొద్దిగా ఉపశమనం కలిగించేదే. బంగ్లా నుంచి భారీగా టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్స్ అవుతాయి. అయితే ఇప్పుడు దానిపై పన్నుభారం పెరిగింది. దీంతో బంగ్లా ఉత్పత్తులతో పోల్చితే మనవి కాస్త తక్కువ ధరకు లభిస్తాయి. సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ లీడర్. ఇప్పుడు దానిపై పన్నులు పెంచడంతో సెమీకండక్టర్ తయారీని ఆయా కంపెనీలు భారత్‌కు తరలించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి అవకాశాలను మన ప్రభుత్వం అందిపుచ్చుకోవాల్సి ఉంది.
ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించినప్పటి నుంచి మనం కొంచెం రేషనల్‌గానే వ్యవహరిస్తున్నాం. అమెరికా ఉత్పత్తులపై పన్నులు భారీగానే తగ్గించాం… మోడీ ఇటీవలి అమెరికా పర్యటనలో కూడా టారిఫ్‌లపై చర్చించారు. రానున్న రోజుల్లో మనం పన్నులు ఇంకాస్త తగ్గిస్తే ట్రంప్ కూడా అదే రీతిన స్పందించే అవకాశం ఉంది. అప్పుడు మరికొంత టారిఫ్‌లు తగ్గే ఛాన్సులున్నాయి.
ట్రంప్ ప్రస్తుతానికి బుసలు కొట్టే పాములా ఉన్నా త్వరలో ఆ పొగరు అణిగిపోతుందన్నది కొందరి అంచనా. అన్ని దేశాలపై పన్నులు వేయడం అంటే ట్రంప్ ట్రేడ్ వార్‌ను ఆహ్వానించినట్లే. కొన్ని దేశాలు వెయిట్ అండ్ సీ అంటుంటే మరికొన్ని దేశాలు మాత్రం ఘాటుగానే స్పందించాయి. అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్‌పై ట్యాక్సులు పెంచేశాయి. ఇది అమెరికన్ ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. దీంతో పాటు అమెరికాకు చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు పన్నులు పెరిగితే అమెరికాలో ఆ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోతాయి. ఇది అమెరికన్ సిటిజన్స్‌కే నష్టం చేస్తుంది. పైగా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ తప్పుతుంది. ఈ భయాలతోనే ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించగానే అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి. కాబట్టి ట్రంప్ ఇంత కఠినంగా ముందు ముందు ఉండే అవకాశాలు లేవు. మొత్తానికి చూస్తే టారిఫ్ వార్ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అది ఇతర దేశాలను గుచ్చుతుందో లేక అమెరికానే ముంచుతుందో చూడాలి. కొన్ని నెలల్లోనే దాని ఎఫెక్ట్ ప్రపంచానికి అర్థమవుతుంది.