అప్పుడు వర్మ…ఇప్పుడు ఖర్మ, ఎమ్మెల్సీ నాగబాబు కామెంట్స్ దుమారం
పిఠాపురం అసెంబ్లీలో విజయం...జనసేనాని పవన్ కల్యాణ్ ఒక్కడి వల్లే సాధ్యమైందా ? సీటు త్యాగం చేసి...ఆయన గెలుపునకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్రేమీ లేదా ?

పిఠాపురం అసెంబ్లీలో విజయం…జనసేనాని పవన్ కల్యాణ్ ఒక్కడి వల్లే సాధ్యమైందా ? సీటు త్యాగం చేసి…ఆయన గెలుపునకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్రేమీ లేదా ? అప్పుడే జనసేన భ్రమల్లోకి వెళ్లిపోతోందా ? 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ పవన్ విజయానికి వర్మ, టీడీపీ శ్రేణులేమీ పని చేయలేదా ? జనసేన బలంతోనే పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారా ? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అప్పుడేమో గెలుపు మీ చేతుల్లో పెట్టామన్నారు…ఇప్పుడు పవన్ కల్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అనుకుంటే వారి ఖర్మ అంటున్నారు. ఓడ దాటే దాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తరువాత బోడి మల్లన్న…ఇది అచ్చంగా జనసేనకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి…ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే జనసేన పార్టీ నేతలు…బీరాలకు పోతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు సహకరించిన నేతలను గడ్డిపోచల్లా తీసి పారేస్తున్నారు. ఒక ఎన్నికల్లో గెలవగానే…మీరెంత అనేలా గర్వం ప్రదర్శిస్తున్నారు. మీకంటే మేమే బలవంతులం…మీకు జనంలో బలమే లేదనేలా జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఎజనసేన ఆవిర్భావ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్.. చాలా ముఖ్యమైనవన్నారు నాగబాబు. అందులో ఒకటి పవన్ కల్యాణ్ అని..రెండో ఫ్యాక్టర్ వ్యక్తి కాదని, ఆ ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పౌరులు, ఓటర్లు అని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత ఒకే అనుకున్నా….ఆ తర్వాత మాట తూలారు. జనాన్ని చూసి మనోడు రెచ్చిపోయాడు. ఎమ్మెల్సీ అన్న ట్యాగ్ జతకాగానే…ఊసరవెల్లిలా మాట మార్చేశాడు. ఎమ్మెల్సీ పదవి రాగానే…మేమే మొనగాళ్లం…మాకన్నా తోపుగాళ్లు ఎవరు లేరనేలా బిల్డప్ ఇచ్చాడు.
తమలో ఎవరైనా..ఇంకెవరైనా సరే పవన్ కల్యాణ్ విజయానికి…తానే దోహదపడ్డాను అని అనుకుంటే..అది వారి ఖర్మ అంటూ నాగబాబు కామెంట్ చేశాడు. ఆ రెండు ఫ్యాక్టర్స్ లేకుంటే తామెంత చేసినా.. ఏం చేసినా ఉపయోగం లేదని చెప్పారు. పిఠాపురం జనసైనికులు, పౌరులకు తాను కృతజ్నత చూపించాలని, అందుకే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మతో పాటు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సీటు వదులుకోవడమే కాకుండా…పవన్ కల్యాణ్ గెలుపునకు తాము శాయశక్తులా పని చేస్తే…ఇప్పుడు కరివేపాకులా తీసి పారేస్తారా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల ముందు నా గెలుపు మీ చేతుల్లో పెట్టామంటూ…వర్మ చేయి పట్టుకొని చెప్పారు పవన్ కల్యాణ్. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పిఠాపురంలో నా ఒక్కడి విజయం కాదు…మనందరి విజయం…వర్మగారి విజయం అంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నాగబాబు కామెంట్లపై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. జనసేనకు అంతబలమే ఉంటే…2019 ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వర్మలాంటి వారు త్యాగాలు చేసి మీలాంటి కృతఘ్నులను గెలిపించుకోవడం మేము చేసుకున్న ఖర్మ. మీలాంటి పాములను పాలుపోసి పెంచి మరీ ఎమ్మెల్సీలను చేసే పార్టీకి వంతపాడడం నిజంగానే మేం చేసుకున్న ఖర్మ అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తనకు ఎమ్మెల్సీ రాకపోవడంపై వర్మ అసంతృప్తిగా ఉన్నప్పటికీ…బయటపడలేదు. ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.