అప్పుడు జయలలితకు భయపడ్డ విజయ్ దళపతి, ఎప్పుడో పుట్టాల్సిన పార్టీనా…?
ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశాన్ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. ఎప్పుడో పురుడు పోసుకోవాల్సిన రాజకీయ పార్టీకి ఇప్పుడు ఊపిరి ఊది, జెండా ఎగరేసారు విజయ్. దేశరాజకీయాల్లో తమిళ రాజకీయాలు చాలా భిన్నం.
ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశాన్ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. ఎప్పుడో పురుడు పోసుకోవాల్సిన రాజకీయ పార్టీకి ఇప్పుడు ఊపిరి ఊది, జెండా ఎగరేసారు విజయ్. దేశరాజకీయాల్లో తమిళ రాజకీయాలు చాలా భిన్నం. సినిమా వాళ్ళ ప్రభావమే ఇక్కడ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులే సినిమాల్లో హీరోలుగా చలామణి అవుతూ ఉంటారు. కరుణానిధి మినహా ఇక్కడ ప్రభావం చూపిన రాజకీయ నాయకులు ఎక్కువగా సినిమా రంగం నుంచి వచ్చిన వారే.
కరుణానిధి కూడా రచయితగా సినిమా రంగంతో సంబంధాలు కొనసాగించారు. ఆయన కుటుంబం ఇప్పటికీ సినిమా, రాజకీయ రంగాల్లో ప్రభావం చూపుతోంది. సినిమా వాళ్ళను దేవుళ్ళుగా పూజించే తమిళ సమాజంలో… మరో యాక్టర్ రాజకీయ నాయకుడిగా అడుగు పెట్టడం ఒక సంచలనం అనే చెప్పాలి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్… తమిళిగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి విల్లుపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 3 లక్షల మందికి పైగా ఆయన అభిమానులు, ప్రజలు హాజరై సభను విజయవంతం చేయగా… తన విజన్ ను ప్రజల ముందు ఉంచారు విజయ్.
వాస్తవానికి విజయ్ పార్టీ ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది. కాని వాయిదా పడుతూ వచ్చింది. తమిళనాడు మాజీ సిఎం జయలలిత బ్రతికి ఉన్న సమయంలో… విజయ్ పార్టీ ఏర్పాటు చేసేందుకు ఓ సంస్థతో సర్వే చేయించగా అనుకూల ఫలితాలు వచ్చాయి. అప్పుడు జయలలిత ఈ విషయం తెలుసుకుని… విజయ్ సినిమాలను అడ్డుకున్నారని ప్రచారం కూడా జరిగింది. అందుకే విజయ్… రాజకీయ రంగ ప్రవేశం వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇదే సరైన సమయం అనుకున్న విజయ్… సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నారు.
అయితే విజయ్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది చెప్పడం కష్టమే. ఆయన కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కమల్ హాసన్, కెప్టెన్ విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూసినా వెనకడుగు వేసారు. కమల్ హాసన్ పార్టీ ఇప్పుడు యాక్టివ్ గా కూడా లేదు. విజయ్ కాంత్ మరణంతో ఆయన పార్టీ కనుమరుగు అయిపోయిందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే వారితో పోలిస్తే ఇక్కడ విజయ్ కు కాస్త సానుకూల అంశాలు ఉన్నాయి.
తమిళనాడులో ఏఐడీఏంకె అంత బలంగా లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా ఆ పార్టీకి కష్టంగా మారింది. మతతత్వ పార్టీలకు తమిళనాడులో ఇప్పటి వరకు స్థానం లేదు. ఆ పార్టీ బిజెపితో కలిసి ఉండటం తమిళ ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయింది. మతానికి పెద్దగా తమిళనాట ప్రాధాన్యత లేకపోవడంతో నాస్తికుడు అయిన కరుణానిధి బలమైన రాజకీయ నాయకుడిగా చక్రం తిప్పారు. ఆయన కుటుంబం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డీఏంకె అధికార పీఠంపై ఉంది.
ఇప్పుడు విజయ్ కు ఇదే సానుకూల అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ వైపు తిరగడానికి కూడా ఇదే సహకారం అందించవచ్చు. ప్రత్యామ్నాయం చూసే అక్కడి ప్రజలకు… విజయ్ యువ నేతగా కనపడుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉంటే… రెండు పార్టీలదే సిఎం కుర్చీగా ఉండేది వాతావరణం. ఇప్పుడు విజయ్ అడుగుపెట్టారు కాబట్టి… ఏడీఎంకే అంతగా ప్రభావం చూపకపోవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే స్టాలిన్ ను ఇప్పుడు ఢి కొట్టడం మాత్రం విజయ్ కు అంత ఈజీ కాదు అనే భావన ఉంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత తక్కువగానే ఉంది. ప్రతిపక్షం మాత్రమే బలహీనంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలో సిఎం అభ్యర్ధి ఎవరో కూడా క్లారిటీ లేదు. స్టార్ ఇమేజ్ ఉన్న నాయకత్వం అక్కడ కరువైంది. డిఎంకె, కాంగ్రెస్ ఇక్కడ కలిసి పోటీ చేస్తున్నాయి. బిజెపి ప్రతిపక్షంలో ఉండటం మైనస్ అయిన అంశం. క్రైస్తవ సమాజంతో పాటుగా యువతలో విజయ్ కు మంచి ఇమేజ్ ఉంది. ఆయన మరో రెండేళ్ళలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే కచ్చితంగా బలమైన పర్యటనలు, యువతను ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇక ఇతర పార్టీల నుంచి కాకుండా సొంతగా నాయకులను విజయ్ తయారు చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.