BJP politics : కులగణన’ అనగానే ‘నో’ అంటున్న బీజేపీ.. ఎందుకు ?
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి బీసీలకు రిజర్వేషన్ అనేదే లేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే కేంద్ర సర్కారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది.
కులగణనపై దేశంలో వాడివేడి చర్చ జరుగుతోంది. దీన్ని నిర్వహించాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం వెనుకడుగు వేస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే ఆ రాష్ట్రంలో కుల గణనను పూర్తి చేశారు. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసినా.. దానిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు. కులగణన నిర్వహించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని చెబుతున్న మోడీ ప్రభుత్వం.. దాన్ని నిర్వహించే సాహసం మాత్రం చేయడం లేదు. ఎందుకీ వెనుకడుగు ? వాస్తవానికి 2018లో బీజేపీ హయాంలో రాజనాథ్ సింగ్ హోంమంత్రిగా ఉండగా కులగణన చేపడతామని చెప్పారు. 2021 జనాభా గణనతో సమానంగా కులగణన చేపడతామని ఆయన అప్పట్లో అన్నారు. కానీ ఈ మధ్య పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మాత్రం కులగణన చేపట్టేది లేదని స్పష్టం చేశారు.
కులగణన బీసీలకే ఎందుకు ముఖ్యం ?
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి బీసీలకు రిజర్వేషన్ అనేదే లేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే కేంద్ర సర్కారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. అప్పట్లో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం మంది బీసీలు ఉన్నారని ఆనాడు వెల్లడైంది. కానీ అందులో సగం మాత్రమే (27 శాతమే) బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి. కేవలం రాష్ట్రాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకునే కులాలు మొత్తం 3,150 ఉన్నాయి.ఒకవేళ మళ్లీ లేటెస్ట్ గా కులగణన నిర్వహిస్తే .. అసలు బీసీల జనాభా ఎంత? వారికి దక్కాల్సిన రిజర్వేషన్ ఎంత? దక్కుతున్నది ఎంత? అనేది తేలుతుంది. కులాల వారీగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. కుల గణన చేస్తే అందులో వచ్చే సమాచారం ఆధారంగా.. కొత్త రిజర్వేషన్లకు డిమాండ్లు పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
బీజేపీ ఆందోళన ఏమిటి ?
ఈ కుల గణనతో బీజేపీకి నష్టం చేకూరే అవకాశముందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తాము అందరినీ కలుపుకుని పోతామని బీజేపీ చెబుతోంది. కాబట్టి ఇప్పుడు కుల గణనతో సమాజంలోని కొన్ని కులాలు ఆ పార్టీకి వ్యతిరేకమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే బీజేపీ మధ్యేమార్గాన్ని అనుసరిస్తోందని చెబుతున్నారు. కుల గణనతో హిందువులు మరిన్ని వర్గాలుగా చీలిపోతారనేది ఆందోళనలో బీజేపీ ఉందని అంటున్నారు. ప్రాంతీయ పార్టీల బలం కుల సమీకరణాలు. ఒకవేళ కులగణన జరిగితే ఆ నివేదికల ఆధారంగా కొన్ని కులాలు.. తమకు తగిన ప్రాధాన్యం కల్పించే ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఓటుబ్యాంకుగా మారిపోతాయని బీజేపీ జంకుతోంది. ఇది జాతీయ పార్టీలకు మైనస్ పాయింట్ గా మారుతుందని అంచనా వేస్తోంది. బీజేపీ శక్తిమొత్తం హిందువులను ఏకం చేయడంలోనే ఉంది. ఒకవేళ కులం పేరుతో వారి మధ్య విభజన వస్తే, బీజేపీకి చాలా నష్టం జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు.