Tummala Nageshwar Rao: తుమ్మల చివరి ప్రయత్నం.. కేసీఆర్ “నో” చెబితే కాంగ్రెస్ లోకి ?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం కనిపిస్తోంది.

సీఎం కేసీఆర్ ప్రకటించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా చాలా మంది ఆశావహుల్లో నిరాశ నింపింది. చాలా మంది నేతలు పార్టీ వీడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ సీటు నిరాకరణతో తుమ్మల ఇప్పుడు పొలిటికల్ జంక్షన్‌లో నిలబడ్డారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు తుమ్మలకు స్నేహ హస్తం అందించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఆయన కాంగ్రెస్‌లో చేరితో పాలేరు నుంచి ఆయననే బరిలో దింపుతారు. కానీ తుమ్మల నిర్ణయం ఏంటి అన్నది మాత్రమే సస్పెన్స్‌గా మారింది.
ఇప్పుడు తుమ్మలకు ఉన్న రెండు ఆప్షన్స్ ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్. వ్యక్తిగతంగా బీజేపీ సిద్ధాంతాలు తుమ్మలకు సెట్ కావు. దాంతోపాటు ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి క్యాడర్ లేదు. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే స్థాయిలో అక్కడ ఉంది కాంగ్రెస్ మాత్రమే. దీంతో ఆయన కాంగ్రెస్‌కే వెళ్తారు అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరితేనే మంచి ఫ్యూచర్ ఉంటుందని కొందరు అనుచరులు తుమ్మలకు సలహా ఇస్తున్నారట.. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తుమ్మల తన అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. చివరి ప్రయత్నంగా.. మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చేలా కేసీఆర్ నుంచి హామీ లభిస్తుందనే ఆశతో తుమ్మల ఎదురు చూస్తున్నారని సమాచారం.
కేసీఆర్ ఇచ్చే భరోసాపై ఆధారపడి తుమ్మల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2018 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు. రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్ లకు తుమ్మలను దూరం చేశారని తుమ్మల అభిమానులు ఆందోళన చెందారు. వాళ్ల ఆందోళనకు తగ్గట్టుగానే ఈ సారి తుమ్మలకు టికెట్ రాకపోవడంతో ఆయన అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ తుమ్మలకు సముచిత స్థానం కల్పించకపోతే.. ఆయన కాంగ్రెస్‌కు వెళ్లడం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది.