Congress: భారత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చైనాతో చేతులుకలిపిందా ? న్యూయార్క్ టైమ్స్ రిపోర్టులో ఏముంది ?
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై ఉన్న అనర్హత వేటు నిషేధాన్ని ఎత్తివేయడం, ఆయన మళ్లీ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం.. ప్రజాస్వామ్య విజయమంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక రెండు రోజుల క్రితం ప్రచురించిన ఓ కథనం.. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న కొందరి మెడకు చుట్టుకుంది. కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకు బీజేపీకి న్యూయార్క్ టైమ్స్ రూపంలో మరో పొలిటికల్ అస్త్రం దొరికింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు వ్యతిరేకంగా చైనాతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోంది.
ఇంతకీ న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఏముంది ?
అమెరికాకు చెందిన నెవిల్ రాయ్ సింగమ్.. ఈయన బిలయనీర్. ఉండేది షాంఘైలో. చైనా ప్రభుత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్టుపార్టీకి అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రో చైనా ప్రొపగాండా నిర్వహిస్తూ ఉంటారన్నది సింగమ్‌పై ఉన్న అభియోగం. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి భారీగా నిధులు అందుకుంటూ భారత్ సహా వివిధ దేశాల్లో చైనా అనుకూల ప్రచారం నిర్వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ లో న్యూస్‌క్లిక్ అనే వెబ్ పత్రికకు సింగమ్ నుంచి నిధులు అందాయని.. కాంగ్రెస్ నేతలకు కూడా ఇందులో వాటా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. చైనా, కాంగ్రెస్, న్యూస్‌క్లిక్ ఈ మూడు కలిసి భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
లోక్‌సభలో న్యూస్‌క్లిక్ ప్రకంపనలు
యాంటీ ఇండియా క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ పార్టీ న్యూస్‌క్లిక్ చైనాతో చేతులు కలిపాయని లోక్‌సభలో బీజేపీ ఆరోపించింది. చైనా నుంచి న్యూస్‌క్లిక్… 38 కోట్ల రూపాయలను తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఇందులో రాహుల్ గాంధీకి కూడా ముడుపులు అందాయని విమర్శించారు. మనీలాండరింగ్ వ్యవహారంలో 2021లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్‌పై దాడులు నిర్వహించిందని.. ఇంతకాలానికి న్యూయార్క్ టైమ్ కథనంతో ఆ పత్రిక బండారం బయపడిందని చెప్పుకొచ్చారు. 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కూడా చైనా నుంచి ముడుపులు తీసుకుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, రణదీప్
సూర్జేవాలాలు చైనాతో చర్చలు జరిపిన నేతల్లో ఉన్నారన్నది బీజేపీ చేస్తున్న అభియోగం. భారత్ లో రోహిణి సింగ్, స్వాతి చతుర్వేది లాంటి జర్నలిస్టులను అడ్డంపెట్టుకుని దేశాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చైనా ద్వారా కుట్రలు పన్నుతుందని కాషాయ నేతలు చెబుతున్నారు.
ఎదురుదాడితోనే కాంగ్రెస్ సమాధానం
తమ పార్టీకి చైనాతో లింక్ పెట్టి బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. అబద్దాలు ఆడటంలో మీకు మీరే దిట్ట.. అంటూ బీజేపీ నేతలకు 10 ప్రశ్నలను సంధించింది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది… లడక్ లో 2020 ఏప్రిల్ ముందు నాటి పరిస్థితి మోడీ ప్రభుత్వం ఎప్పటికి తీసుకువస్తుంది ? బీజేపీ హయాంలో సరిహద్దుల్లో పెట్రోలింగ్ పాయింట్స్ ..బఫర్ జోన్స్ గా ఎందుకు మారాయి ? మోడీ ఇప్పటి వరకు 18 సార్లు చైనా నేతలను ఎందుకు కలిశారు ? ఇలా బీజేపీపై ప్రశ్నలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్న సమయంలో బీజేపీ ఆడుతున్న డ్రామాలోభాగంగానే.. చైనాతో లింకులు పెడుతున్నారని విమర్శిస్తోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్ సమయంలో మరోసారి చైనా చుట్టూ దేశ రాజకీయం తిరగడం మొదలుపెట్టింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్న ఎదురుదాడి ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.