Spl story: ఏపీ రాజ్యసభ అభ్యర్ధులే వీళ్ళే.. నాగబాబు తప్పుకున్నడా? తప్పించారా?
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీకి షాక్ ఇస్తూ... ముగ్గురు వైసీపీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీదా పేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీకి షాక్ ఇస్తూ… ముగ్గురు వైసీపీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీదా పేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయింది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ విషయంలో దాదాపు 6 పేర్లు పరిశీలనలోకి వచ్చినా… చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో మాట ఇచ్చిన వారికే రాజ్యసభ సీటును ఖరారు చేసే అవకాశం స్పష్టంగా కనబడుతోంది.
బీద మస్తాన్ రావు వైసిపి నుంచి టీడీపీలో జాయిన్ కాగా ఆయనకు మరో నాలుగేళ్లు రాజ్యసభ పదవి ఉంది మళ్లీ ఆయనకే రాజ్యసభ సీటు ఖరారు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరో స్థానం విషయంలో ఎవరికీ ఆ సీటును ఖరారు చేస్తారు అనేదానిపై స్పష్టత రావటం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా నేత సానా సతీష్ ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. 2024 ఎన్నికల్లో సానా సతీష్ కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా ఆ సీటును ఉదయ్ శ్రీనివాస్ కు జనసేన పార్టీ కేటాయించింది.
దీనితో సానా సతీష్ లో రాజ్యసభకు పంపిస్తానని చంద్రబాబు నాయుడు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానానికి సానా సతీష్ ను పంపిస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఆ పదవికి సమయం ఉంది. ఆ తర్వాత కూడా మళ్లీ సతీష్ ను రాజ్యసభలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు సముఖంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించిన వారిలో సతీష్ ఒకరు. అందుకే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గడం లేదని సమాచారం.
ఇక మరో స్థానం విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను నిలబెడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని సమాచారం. ముందు నాగబాబును రాజ్యసభకు పంపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినా దానిపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. ఆ స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను బిజెపి పెద్దలు కోరడంతో పవన్ చేసేదిలేక అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ తీసుకుని ఒకటి తమకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లుగా సమాచారం. ఎలాగైనా తన అన్నాను పెద్దల సభలో కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారట. అయితే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిల్లో ఒకటి జనసేన పార్టీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో బిజెపి అధిష్టానం కూడా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. అవసరమైతే నాగబాబుకు కేబినేట్ హోదా కల్పించే ఓ కీలక పదవి కూడా ఇవ్వడానికి చంద్రబాబు ఓకే చెప్పారట. దీనితో రాజ్యసభ కోసం పవన్ పట్టుబట్టడం లేదని తెలుస్తోంది. జనసేన పార్టీ కోసం ముందు నుంచి నాగబాబు కష్టపడ్డారు. ప్రజారాజ్యం సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పటి వరకు ఏ పదవి చేపట్టలేదు. దీనితో ఇప్పుడు నాగబాబుకు ఎలాగైనా మంచి పదవి ఇవ్వాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.