Top story: ఉగ్రవాదులు వాడిన ఆఫ్ లైన్ యాప్ ఇదే, చంపే వీడియో రికార్డ్ చేసారా..?

పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 03:45 PMLast Updated on: Apr 24, 2025 | 3:45 PM

This Is The Offline App Used By Terrorists Did They Record The Killing Video

పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల డిజిటల్ లింకులు.. పాకిస్తాన్ లోని ముజఫరాబాద్, కరాచీలోని సేఫ్‌ హౌస్‌లలో భారత నిఘా సంస్థలు గుర్తించాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ దాడులలో పాకిస్తాన్ హస్తం ఉందని నిరూపించేందుకు భారత్ అన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో పడింది. 26/11 ముంబై దాడులలో ఉపయోగించిన రిమోట్ కంట్రోల్-రూమ్ మాదిరిగానే రిమోట్ కంట్రోల్-రూమ్‌ను ఉపయోగించారని దర్యాప్తులో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉన్నత స్థాయి అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ప్రాథమిక ఫోరెన్సిక్ రిపోర్ట్ ల ప్రకారం.. అదే విధంగా ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలాల ప్రకారం, దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు కలిగి ఉన్నారని, వారి వద్ద AK రైఫిల్స్, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలతో సహా.. ఆటోమేటిక్ ఆయుధాలు కలిగి ఉన్నారని వెల్లడించాయి. వారిలో కొందరు భారత ఆర్మీ దుస్తులను కూడా ధరించారని అధికారులు వెల్లడించారు.

ముజఫరాబాద్ మరియు కరాచీలోని కొన్ని సేఫ్‌హౌస్‌ లను పాక్ సైన్యం, ఆ దేశ గూడచారి సంస్థ ఐఎస్ఐ వంటివి పర్యవేక్షిస్తాయని, ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునే విషయంలో కూడా వారు కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. భారత్ కు భారీగా ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్తాన్ కుట్ర చేస్తుందని నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. ఉగ్రవాదులను పెద్ద ఎత్తున రిక్రూట్ కూడా చేసుకుంటున్నట్టు వెల్లడించాయి. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో దీనిపై నిఘా వర్గాలు హెచ్చరికలు చేసాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు, నుంచి భారత్ లోకి పంపడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయని వెల్లడించారు. ఉగ్రవాదులు కథువా, ఉధంపూర్, దోడా, కిష్త్వార్, రియాసి, రాజౌరి, పూంచ్ వంటి లోయ ప్రాంతాలకు చెందిన జిల్లాల నుంచి కాశ్మీర్ లోకి అడుగుపెట్టారని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. అక్కడి నుంచి వారు కాశ్మీర్ సహా ఇతర సరిహద్దు ప్రాంతాలకు వెళ్తున్నారని, వీరికి స్థానికుల నుంచి మద్దతు ఉందని తెలిపింది.

కాశ్మీర్‌లో నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు ఇటీవల సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం, లోయలో 55 నుండి 60 మంది ఉన్నత శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని అంచనా వేస్తున్నామన్నారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, ఆఫ్‌లైన్ వెర్షన్‌లో ఉగ్రవాదులకు ఆల్పైన్ క్వెస్ట్ యాప్‌ను అందించిందని.. ఇది ప్రొఫెషనల్ ట్రెక్కర్లు తరచుగా ఉపయోగించే నావిగేషన్ యాప్ అని తెలిపింది. భారత భద్రతా దళాల క్యాంపులు, పోలీసు కాన్వాయ్ కదలికలు, బారికేడ్ల వివరాలను ఈ యాప్‌తో చొరబడిన ఉగ్రవాదులకు ఐఎస్ఐ అందించినట్లు సమాచారం ఉందని సదరు అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో సర్వర్‌లను కలిగి ఉన్న ఎన్‌క్రిప్టెడ్ రేడియో కమ్యూనికేషన్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారని సంచలన విషయాలు బయటపెట్టారు. ఉగ్రవాదులు లోయలోని మధ్య-దిగువ ప్రాంతాలలోనే ఉండి, తక్కువ ఎత్తులోనే తప్పించుకుంటున్నారు అని తెలిపారు.

ఈ చొరబడిన ఉగ్రవాదులు, వారికి సహాయం చేస్తున్న స్థానికులపై భారత ఆర్మీ నిఘా పెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఫిబ్రవరి, మార్చి నెలల్లో, జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని పలు కీలక ప్రదేశాలలో విస్తృతమైన సోదాలు నిర్వహించింది. దేశంలోకి అడుగుపెట్టిన తరువాత, ఈ ఉగ్రవాదులను స్థానికులు, సహకరించి, వారికి ఆహారం, ఆశ్రయం, డబ్బు కూడా అందించారని, వారు కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. తాజాగా జరిగిన దాడిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని, మిగిలిన ముగ్గురు పాక్ నుంచి దేశంలోకి చొరబడ్డారని గుర్తించారు. ఆదిల్ ధోకర్ అనే ఉగ్రవాది ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. 2018లో ఆదిల్ థోకర్ పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో సాయుధ శిక్షణ పొంది, దాడులు చేయడానికి దేశంలోకి తిరిగి చొరబడ్డాడని అధికారులు భావిస్తున్నారు. ఇక పహల్గామ్ దాడి తర్వాత, చొరబాట్లను పూర్తిగా అణచివేయాలని కేంద్రం సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు సైన్యాన్ని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను రికార్డ్ చేయడానికి బాడీ కెమెరాలను కూడా తీసుకు వెళ్ళారని సాక్ష్యులు ఆర్మీ అధికారులకు వివరించారు.