Kamareddy : కామారెడ్డిలో కేవీఆర్ విజయ రహస్యం ఇదే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా హాట్ టాపిక్ అయింది. అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేయడమే అందుక్కారణం. ఇద్దర్లో ఎవరు గెలుస్తారన్నదానిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 01:48 PMLast Updated on: Dec 06, 2023 | 1:48 PM

This Is The Secret Of Kvrs Success In Kamareddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా హాట్ టాపిక్ అయింది. అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేయడమే అందుక్కారణం. ఇద్దర్లో ఎవరు గెలుస్తారన్నదానిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయం సాధించారు. ఈయన ఎవరు.. ఓ అనామకుడు ఎలా గెలిచాడు.. అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అనామకుడు కాదు.. ఓ ప్లానింగ్.. ఓ విజన్ పెట్టుకొని మరీ ఎన్నికల బరిలోకి దిగి.. సక్సెస్ ను అందుకున్నారు. కేవీఆర్ ఎజెండా, సొంత మేనిఫెస్టో చూసి ఇంత వర్కవుటా చేశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కాటిపల్లి వెంకటరమణా రెడ్డి.. కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కించుకున్న కేవీఆర్ ఎంతో పాపులర్ అయ్యారు. కేసీఆర్, రేవంత్ ని ఓడించి.. ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన విజయం వెనుక ఎంతో కృషి.. ప్లానింగ్ ఉందని చెబుతున్నారు కేవీఆర్ అనుచరులు. వైఎస్ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. కామారెడ్డిలో సెంట్రల్ సిలబస్ తో స్కూల్ రన్ చేయడంతో పాటు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. కోట్లల్లో ఆస్తులు, ఆదాయం కూడా ఉంది.

బిజినెస్ లో రాణిస్తున్న ధైర్యంతోనే కేవీఆర్.. కామారెడ్డి నియోజకవర్గంలో సొంత మేనిఫెస్టోతో జనం ముందుకు వెళ్ళారు. తాను గెలిస్తే.. సొంత డబ్బులు 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి అవకాశం లేకుండా కామారెడ్డిని తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తానన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటల్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కార్పొరేట్ స్కూల్, కాలేజీ నిర్మిస్తానన్నారు. రైతులకు, యువతకు ఇలా అందరికీ అన్ని వరాలు ప్రకటించారు.

సొంత మేనిఫెస్టోకి సంబంధించిన బుక్ ను కామారెడ్డి నియోజకవర్గంలో… ఊరూరా ప్రతి ఇంటికీ చేర్చారు. అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులతో కలసి పోరాడారు వెంకట రమణా రెడ్డి. నియోజకవర్గంలో రైతులు, మహిళలతో కలసి ప్రభుత్వంపై ఎన్నో ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలామంది రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఎన్నైనా హామీలు ఇస్తారు. గెలిచాక ముఖం చాటేస్తారు. కానీ కేవీఆర్ అలా కాదు.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా.. 150 కోట్ల రూపాయలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటున్నారు. అందుకోసం అవసరమైతే తన ఆస్తులు కూడా అమ్ముతానని చెబుతున్నారు. కామారెడ్డి లోకల్ అభ్యర్థిగా.. ఆ నియోజకవర్గంలో కలిసిపోయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. నిత్యం జనంలో తిరుగుతున్నందునే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని విజయం వరించింది. బయట ప్రపంచానికి అప్పుడు తెలియకపోయినా నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలే కేవీఆర్ ను గెలిపించాయి. ఇప్పుడు ఆయనంటే ఎవరో అందరికీ తెలిసేలా చేశాయి.