ఉక్రెయిన్‌, జెలెన్‌స్కీని లేపెయ్ పుతిన్‌కు పవర్స్ ఇచ్చిన ట్రంప్

మిస్టర్ పుతిన్.. ఉక్రెయిన్‌ కథ ముగించేయండి.. జెలెన్‌స్కీ అనేవ్యక్తి మళ్లీనాకు కనపడకూడదు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా'. రష్యా అధినేతతో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటే ఇది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 12:50 PMLast Updated on: Mar 06, 2025 | 12:50 PM

This Is What Donald Trump Said To The Russian Leader

మిస్టర్ పుతిన్.. ఉక్రెయిన్‌ కథ ముగించేయండి.. జెలెన్‌స్కీ అనేవ్యక్తి మళ్లీనాకు కనపడకూడదు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా’. రష్యా అధినేతతో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటే ఇది. అదేంటి, ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకోకండి.. పుతిన్‌తో ట్రంప్ నేరుగా ఈ మాటలు చెప్పలేదు.. కానీ, ఆయన వైఖరి మాత్రం అదే చెబుతోంది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేలా, జెలెన్‌స్కీ అంతుచూసేలా అగ్రరాజ్యం అధినేత నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేశారు. మాస్కోపై ఆంక్షలను ఎత్తి వేసేందుకు సిద్ధపడుతున్నారు. పశ్చిమ దేశాల లెక్క తేల్చే నిర్ణయాలూ తీసుకుంటున్నారు. వీటన్నింటి వెనుకా ఎవరి ఊహకూ అందని చాలా వ్యూహాలు ఉన్నాయి. ఆ స్ట్రాటజీలేంటో టాప్ స్టోరీలో చూద్దాం..

ట్రంప్ వంటి ఇగోయిస్ట్ క్యారెక్టర్‌తో చర్చలకు వెళ్లినప్పుడే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. కామ్‌గా పని పూర్తి చేసుకుని జాగ్రత్తగా బయటపడాలి. కానీ, జెలెన్‌స్కీ ఆ పని చేయలేదు. యూరోపియన్ దేశాల అండ చూసుకుని ఎవడైతే నాకేంటి అన్న రేంజ్‌లో రెచ్చిపోయాడు. అమెరికా లేకపోతే అంతా అయిపోయినట్టు కాదు, మాకు యూరప్ అండగా ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. తీరా లండన్‌లో యూరప్ నేతలతో భేటీ తర్వాత చల్లబడ్డాడు. అమెరికాతో ఒప్పందానికి సిద్ధమే అనీ, అగ్రరాజ్య సాయం లేకుంటే తమకు భవిష్యతే లేదని యూటర్న్ తీసుకున్నాడు. అందుకు కారణం యూరోపియన్ నేతలు జెలెన్‌స్కీకి బ్రెయిన్ వాష్ చేయడమే. మేం ఎంత అండగా నిలిచినా అమెరికా లేకపోతే రష్యాని ఓడించడం అసాధ్యం అని చెప్పడమే. కానీ, అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వైట్‌హౌస్‌లో ఓ రేంజులో చెలరేగిపోయిన జెలె న్‌స్కీకి అమెరికా ఇంపార్టెన్స్ ఏంటో తెలిసేలా చేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. కట్‌చేస్తే.. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసేశారు.

ట్రంప్ లక్ష్యం శాంతిస్థాపన. ఇతర దేశాలు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. మా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తుందని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అయితే, ఈ నిలుపుదల తాత్కాలికమేనని ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలుపుదల తాత్కాలికమే కావచ్చు.. కానీ, దాని ప్రభావం మాత్రం జెలెన్‌స్కీపై దారుణంగా ఉండబోతోంది. ఇది తెలుసు కాబట్టే కీవ్ ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు క్రమంగా తమ దేశాన్ని రష్యాకు లొంగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లు ఉన్నాయని ఆ దేశ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ మెరెజ్‌కో ఆరోపించారు. ట్రంప్‌తో వాగ్వాదంతోనే కీవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరోపియన్‌ దేశాలు ఆరోపించాయి. అగ్రరాజ్యం సాయం లేకుండా కీవ్‌ రష్యాతో పోరాటం చేయగలదా అని ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్ కోరుకుంది కూడా ఇదే. అమెరికా సాయం లేకపోతే జరిగేది ఏంటో ఇటు జెలెన్‌స్కీకి, అటు పశ్చిమ దేశాలకు తెలియ జెప్పడమే. కానీ, ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ మరొకటుంది.

యుద్ధం మొదలైన దగ్గర నుంచీ పుతిన్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ట్రంప్.. తాజాగా ఏకంగా రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తేయడానికి యోచిస్తున్నారు. ఇదే కనుక నిజంగా జరిగితే, ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవడం ఖాయం. రష్యాపై ఆంక్షలు ఎత్తేయాలనే ట్రంప్ ఆలోచన వెనుక ప్రధాన కారణం మాస్కోతో సంబంధాల్ని మెరుగుపరచుకోవడమే. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను తొలగించేందుకు ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని వైట్‌హౌస్, విదేశీ వ్యవహారాల, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికా అధికారులు రష్యా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాదు, రష్యా కుబేరులపైనా ఆంక్షలు ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం ఆంక్షలను ఎత్తివేస్తే మాస్కో మరింత పవర్‌ఫుల్‌గా మారడం ఖాయం. అదే జరిగితే ఉక్రెయిన్‌ నిలిచే అవకాశమే ఉండదు.

ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేయడం, అదే సమయంలో రష్యాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన చేయడం వెనుక ఒక్కటి మాత్రం క్లారిటీగా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ కథ ముగించే ఛాన్స్ పుతిన్‌కు ఇస్తున్నారు ట్రంప్. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మూడేళ్ల వార్‌లో పెద్ద ఎత్తున సైనికులు మరణించారు. రష్యాను అడ్డుకునేందుకు ఆయుధాలు కూడా పెద్దగా లేవు. ఇదే సమయంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కీవ్‌పై దాడుల తీవ్రత పెంచారు పుతిన్. ఇలాంటి సమయంలో కీవ్‌కు తాత్కాలికంగా ఆయుధ సాయం ఆపేయడం అంటే పుతిన్‌ను రెచ్చిపోమని చెప్పడమే. పైగా జెలెన్‌స్కీకి అండగా ఉంటామన్న యూరప్ దేశాల సత్తా ఏంటో ఈ దెబ్బతో తేలిపోతుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్రంప్ ఇగోను హర్ట్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో జెలెన్‌స్కీతో పాటు ప్రపంచం మొత్తానికీ ఓ క్లారిటీ రావడం ఖాయం.