TOP STORY: ఏపీలో మూడు పార్టీలు మరోసారి బిజెపికి సరెండర్….

తెలుగు రాష్ట్రాలు చీలిపోతున్నప్పుడు ఈ ముగ్గురు నోరెత్తలేదు. చీలి పోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వము అవతలకి పోండి అంటే అప్పుడు ఈ ముగ్గురు పెదవి విప్పలేదు. విభజన హామీలైన నెరవేర్చండి అని జనం మొత్తుకుంటుంటే.....

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 06:00 PMLast Updated on: Mar 25, 2025 | 6:00 PM

Three Parties In Ap Surrender To Bjp Once Again

తెలుగు రాష్ట్రాలు చీలిపోతున్నప్పుడు ఈ ముగ్గురు నోరెత్తలేదు. చీలి పోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వము అవతలకి పోండి అంటే అప్పుడు ఈ ముగ్గురు పెదవి విప్పలేదు. విభజన హామీలైన నెరవేర్చండి అని జనం మొత్తుకుంటుంటే… ఈ ముగ్గురు పోరాడ లేదు. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తి ఉద్యమిస్తుంటే ఏపీలో ఈ మూడు పార్టీలు… ముగ్గురు నాయకులు తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారు. ముగ్గురు పైకి తిట్టుకుంటారు… కుట్రలు చేసుకుంటారు… హత్యలు చేసుకుంటారు… ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటారు. కానీ బిజెపి విషయానికి వస్తే మాత్రం వీళ్ళ ముగ్గురు ఒకటే. బిజెపి గొడుగు కిందే బతుకుతారు. ఏపీలో వందమంది సర్పంచులను కూడా గెలిపించుకోలేని బిజెపి ఈ ముగ్గురి బలహీనతల్ని అడ్డం పెట్టుకొని అనధికారికంగా అధికారాన్ని చలాయిస్తుంది. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనుకుంటారో ఏమో ఇప్పటికీ ముగ్గురు బిజెపికి బానిసలే. నోరెత్తే ధైర్యం లేని నేతలే.

డీ లిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ చెన్నైలో జరిగిన మీటింగ్ కి ఏపీలో మూడు ప్రధాన పార్టీలు… తెలుగుదేశం, వైసిపి, జనసేన డుమ్మా కొట్టాయి. అసలు అలాంటి మీటింగ్ ఒకటి ఉందని కూడా తెలియనట్లు నటిస్తున్నాయి. ఆ పార్టీల అధినేతలైన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రత్యర్ధులు అయినప్పటికీ బిజెపి స్కూల్లో…. బుద్ధిమంతులైన విద్యార్థులేనని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి…. ముందు నుంచే నోరెత్తలేదు బాబు, పవన్. అసలు డిలిమిటేషన్ అనేది ఒకటి ఉందని అది జరుగుతుందని, జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల నష్టం జరుగుతోందనే
విషయమే తెలియనట్లు పవన్ కళ్యాణ్…. అందరూ హిందీ నేర్చుకోవాలి, సనాతన ధర్మం పాటించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. చంద్రబాబు నాయుడు పిల్లలు ఎక్కువ కనండి, జనాభాను పెంచండి…. అంటూ మరోదారిలో జనానికి చెవిలో పువ్వులు పెడుతున్నారు. వైయస్సార్సీపి అధినేత జగన్మోహన్ రెడ్డిది మరీ విచిత్రమైన పరిస్థితి. డి లిమిటేషన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్ కి రావాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాస్తే…. ఆ మీటింగ్ కి డుమ్మా కొట్టడమే కాకుండా, ప్రధాని మోడీకి లేఖ రాశారాయన. తెలివిగా నేను ఇప్పటికీ మీ దొడ్లో కట్టేసిన గొడ్డునే అని చెప్పకనే చెప్పారు. ఆ మీటింగ్ కి వెళ్ళలేదు అనే విషయాన్ని ప్రధానికి తెలివిగా చేరవేశాడు జగన్.

తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ. పోరాటాల గడ్డ. తెలంగాణ నష్టపోతుంది అనగానే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి టిఆర్ఎస్ తరఫున కేటీఆర్, కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై డీలిమిటేషన్ వ్యతిరేక మీటింగ్ కి హాజరై తమ వాదన వినిపించి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప… పార్టీ విధానాలు, వ్యక్తిగత విధానాలు తమకు ముఖ్యం కాదని చెప్పకనే చెప్పారు. వ్యక్తిగతంగా కేటీఆర్ కి రేవంత్ కి విభేదాలు ఉన్న….. తెలుగుజాతి హక్కుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కి వెళ్లి కేంద్రాన్ని హెచ్చరించి వచ్చారు. కానీ ఏపీ రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ఆది నుంచి తమ వ్యక్తిగత , ఆర్థిక ,పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ జనం ప్రయోజనాల్ని తుంగలోకి తొక్కి డ్రామా ఆడుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలోనూ ఇలా అన్ని పార్టీలు కేంద్రానికి బానిసలు అయిపోయిన దుస్థితి లేదు.

తమిళనాడులో ఏళ్ల నాటి శత్రుత్వం ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు కలిసి పోరాటాలు చేశాయి. ఆనాడు సేలం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కటై గొంతు కలిపాయి.కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, యు డి ఎఫ్ మధ్య అధికారం కోసం ఒకరినొకరు విమర్శించు కుంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్తు కోసం రెండు పార్టీల అసెంబ్లీ సభ్యులందరూ కలసి రోడ్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.ఇక కర్ణాటకలో జనతాదళ్ ,కాంగ్రెస్ కూడా కలిసి పోరాడాయి. తెలంగాణలో ఒకరినొకరు జైల్లో వేసుకునేటంత కక్షలు ఉన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ మీటింగ్ లో కలసి తమ వాదన వినిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని మూడు పార్టీలు, ఆ పార్టీల నాయకులకు బిజెపి అంటే చెమటలు పట్టేస్తాయి. ఒకరు అక్రమార్జన కేసులకు భయపడతారు, మరొకరు ఇన్కమ్ టాక్స్ కు భయపడతారు, ఇంకొకరు అధికారం కోసం రాజీ పడతారు , ముగ్గురు కలిసి రాష్ట్రంలో దేన్నైనా కేంద్రానికి తాకట్టు పెడతారు.

వైసిపి, టిడిపి, జనసేన మూడు పార్టీల నేతలకు ఇదేం కొత్త కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను 11 రోజులు ఇంట్లోనే దీక్ష చేశాను అని తెలివిగా తప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్. నాది రెండు కళ్ళ సిద్ధాంతం అని ఏపీకి వెళ్లిపోయాడు చంద్రబాబు నాయుడు. జనం ఏం కోరుకుంటే అది చేయండి అని తన దారి చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రత్యేక హోదా విషయానికొస్తే ముగ్గురు మూడు రకాల డ్రామాలు ఆడారు. ప్రత్యేక హోదా కోసం చచ్చిపోతానని…. పాచిపోయిన లడ్డుల పై ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్…. బిజెపి చంకలో దూరి ప్రత్యేక హోదాను పూర్తిగా పాతిపెట్టేశారు. ప్రత్యేక హోదా తో స్పెషల్గా మనకొచ్చేదేముంది? అని ఒకసారి చెప్పి, మరోసారి ప్రత్యేక హోదా కోసం నల్లషర్ట్లు వేసుకొని మోడీని ఐ హావ్ ఫ్యామిలీ ….యు డోంట్ హేవ్ ఫ్యామిలీ అని తిట్టి…. మళ్లీ ఐదేళ్ల తర్వాత అదే మోడీ కాళ్ల దగ్గర కూలబడ్డాడు చంద్రబాబు నాయుడు.

జగన్మోహన్ రెడ్డిది మరో వింత నాటకం.2019 నుంచి 24 వరకు కేంద్రంలో బిజెపికి కావలసిన సహకారం అందించి… తాను తిరిగి జైల్లోకి వెళ్ళకుండా బతికేసిన జగన్… ఇప్పటికీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నానని అంటాడు. అది రాదు రాదని అందరికీ తెలుసు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తారని మూడు పార్టీల నాయకులకి తెలుసు. అయినా పన్నెత్తు మాట మాట్లాడరు. ఇలా ముగ్గురికి ముగ్గురు ఎవరి డ్రామాలు వాళ్ళవి. జనాన్ని నిత్యం ఎర్రిపప్పలను చేస్తూ తాము మాత్రం బిజెపి ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారు. రాష్ట్రంలో పైకి నిత్యం సిగపట్లు పడుతూ ఉంటారు. బిజెపి నుంచి కాల్ రాగానే ముగ్గురు ఒకటే వాదన వినిపిస్తారు. ఏపీ భవిష్యత్తు ఏమైపోయినా వీళ్ళ ముగ్గురికి అనవసరం. వీళ్ళ భవిష్యత్తు మాత్రమే వీళ్ళకి ముఖ్యం. ఈ అవగాహన ఉన్నంత కాలం ఏపీలో బిజెపి పాలన కొనసాగుతూనే ఉంటుంది. బిజెపికి ఏపీలో 25 ఎంపీ సీట్లు దాని జేబులో ఉన్నట్లే. ఏపీలో జనం మాత్రమే నిత్యం వెధవలు అవుతూ ఉంటారు. అది వాళ్ళ కర్మ.