ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు ,ప్రపంచ యుద్ధానికి కౌంట్‌డౌన్ షురూ

లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 01:45 PMLast Updated on: Feb 25, 2025 | 1:45 PM

Three Years Of Ukraine Russia War The Countdown To World War Has Begun

లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సింపుల్‌గా చెప్పాలంటే దేశమే నామరూపాల్లేకుండాపోయింది. ఆ మారణ హోమం మొదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ఒక్కడు ఒకే ఒక్కడి ఇగో..! ఔను.. పుతిన్‌ను విలన్‌గా చూపిస్తూ నాటోలో చేరాలన్న జెలెన్‌స్కీ పంతమే ఇంతటి విధ్వంసానికి కారణం. నాటోలో చేరితే ఉక్రెయిన్ సేఫ్‌గా ఉంటుందన్న స్వార్ధంతో రష్యా భద్రతను రిస్క్‌లో పెట్టడానికి సిద్ధపడ్డాడు. జెలెన్‌స్కీ అనుకున్నది సాధిస్తే.. రష్యా శత్రువులైన నాటో దేశాలు తమ దేశ సరిహద్దుల్లోకి వస్తాయని గ్రహించిన పుతిన్.. ఉక్రెయిన్‌పై దండెత్తారు. అలా మొదలైన యుద్ధానికి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. కానీ, ఈ మూడేళ్లలో ఏం సాధించారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకూ సమాధానం కనిపించడం లేదు. అసలు ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు ఉందా.. లేదా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

ఉక్రెయిన్‌ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి దిగారు. నాటో కూట‌మిలో ఉక్రెయిన్ చేరాల‌ని ప్ర‌య‌త్నించింది. దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించిన పుతిన్‌.. గ‌తంలోనే ప్రారంభించిన యుద్ధాన్ని మూడేళ్ల కింద‌ట ఇదే రోజున మ‌రింత ముమ్మ‌రం చేశారు. 2022 ఫిబ్రవరి 22, ‌23తేదీల్లో విక్టర్ యనుకోవిచ్ బహిష్కరణకు గురైన వెంటనే రష్యా దళాలు క్రిమియా సరిహద్దుకు దగ్గరగా వెళ్లాయి. ఇది.. ఇరు దేశాల మ‌ధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం కొద్దిరోజుల్లోనే ముగుస్తుందని భావించినా చూస్తుండగానే మూడేళ్లు పూర్తయ్యాయి. నేటికీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవరూచెప్పలేని పరిస్థితి. నిజానికి.. ర‌ష్యా ముందు ఉక్రెయిన్ చాలా చిన్నదేశం. ఏ రంగంలోనూ మాస్కోతో పోటీ పడేస్థాయి కాదు కీవ్‌ది. రక్షణ పరంగా ఐతే ఇరు దేశాల మధ్య అంతరం అంతులేనంత పెద్దది. కానీ, అమెరికా, పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ మూడేళ్లుగా రష్యాపై పోరాడుతోంది. పుతిన్ మాత్రం ఒంటరి గానే ఉక్రెయిన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆ మాటకొస్తే పుతిన్ ఫేస్ చేస్తోంది ఒక్క జెలెన్‌స్కీని మాత్రమే కాదు.. అమెరికా సహా పశ్చిమ దేశాలను కూడా. అందుకే ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగుతోంది. లేదంటే కీవ్ కథ ఎప్పుడో ముగిసిపోయేది. కానీ, కీవ్‌కు మాత్రం పశ్చిమ దేశాలు ఎంతని సాయం చేస్తాయి? మూడేళ్ల యుద్ధంలో ఊహించని మార్పు ఇదే. ఈ మార్పు యుద్ధాన్ని ముగించడమైనా చేస్తుంది.. లేదంటే మరింత ఉధృతంగా అయినా మార్చేస్తుంది.

జెలెన్‌స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చాడని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగానూ చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటివరకూ ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి వాస్తవాదీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్‌స్కీని ఒప్పించాలని డొనాల్డ్ ట్రంప్‌ భావిస్తున్నట్లు ఆయన వైఖరి చూస్తే అర్ధమవుతుంది. ఈ ఒప్పందానికి ఒప్పకోకపోతే తమ నుంచి ఎలాంటి సాయం అందదని ట్రంప్‌ హెచ్చరించి జెలెన్‌స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అత్యాధునిక ఆయుధా లతో దూసుకొస్తున్న పుతిన్ సేనను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు అమెరికా సాయం తప్పనిసరి. అమెరికా సాయం లేకపోతే తమ పని అయిపోయినట్టే అని జెలెన్‌స్కీ ఇటీవలే ప్రకటించాడు. కాబట్టి అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరకంగా మూడేళ్ల యుద్ధంలో ఇది పాజిటివ్ యాంగిల్. కానీ, ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఆ చిక్కే ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతంగా మమార్చబోతోంది.

ఉక్రెయిన్‌కు సాయం విషయంలో మార్పు వచ్చింది అమెరికాలోనే.. యూరోపియన్ దేశాల్లో కాదు. యూరప్ దేశాలు కీవ్‌కు కడవరకూ అండగా నిలవాలని భావిస్తున్నాయి. యుద్ధం ముగియడానికి ఒకే ఒక్క ఆప్షన్.. ఉక్రెయిన్‌ నుంచి రష్యా తన సేనలను వెంటనే ఉపసంహరించుకోవడమేనని యూరోపియన్ దేశాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అంతవరకూ ఈ యుద్ధం ఆగదనీ, ఉక్రెయిన్‌కు తాము అండగా నిలుస్తాం అని స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ అయితే కీవ్‌కు మద్దతుగా తమ సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికి ఏ మాత్రం ఆలోచించను అంటోంది. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ సహా చాలా దేశాలు ఇదే మాట చెబుతున్నాయి. పైగా దాదాపు 18శాతం భూభాగాన్ని కోల్పోయిన జెలెన్‌స్కీ.. ఈ యుద్ధాన్ని ముగించాలని అస్సలు అనుకోవడంలేదు. అంటే అమెరికా అండ లేకపోయినా జెలెన్‌న్సీ యుద్ధంలో పోరాడాలని డిసైడ్ అయ్యారన్నమాట. అదే జరిగితే మూడేళ్ల యుద్ధం ముగియడం కాదు.. మరో దశలోకి అడుగు పెడుతుంది. వివరంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలూ మొదలైనట్టే యూరప్‌లోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఒకవేళ అమెరికా తన పలుకుబడి తో ఉక్రెయిన్ యుద్ధం ముగించినా, యూరప్ దేశాలు సైలెంట్‌గా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పుతిన్‌తో తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. పుతిన్ సైతం వెస్ట్రన్ దేశాలను ఎదుర్కోడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. సో.. మూడేళ్ల యుద్ధానికి ముగింపు మాట ఏమో కానీ, అంతకుమించి ఏదో జరగబోతోంది అన్నది సుస్పష్టం.