Thummala Nageswara Rao: తుమ్మల ఇంట్లో సమావేశం.. కాంగ్రెస్లో చేరడం ఖాయమా ?

తుమ్మల కాంగ్రెస్‌లోకే వెళ్తారనే ప్రచారం జిల్లావ్యాప్తంగా మరింత ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2023 | 05:55 PMLast Updated on: Aug 30, 2023 | 5:55 PM

Thummala Nageswara Rao Likely To Join Congress At Khammam In September

Thummala Nageswara Rao: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల దారెటు అనే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మలకు.. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో అధిష్టానంపై ఆయన గుర్రుగా ఉన్నారు. పాలేరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ఇవ్వడంతో.. ఈ మధ్యే తన అనుచరులతో కలిసి బల ప్రదర్శన కూడా నిర్వహించారు తుమ్మల. గత వారం రోజులుగా వేచి చూసే ధోరణిలో ఉన్న ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారా.. లేక బీజేపీకి వెళ్తారా.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఐతే తుమ్మల కాంగ్రెస్‌లోకే వెళ్తారనే ప్రచారం జిల్లావ్యాప్తంగా మరింత ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తుమ్మల తీసుకునే రాజకీయ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నారు. కూసుమంచి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్‌తో పాటు ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా తుమ్మలను కలిశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారంతా కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగలపల్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన నివాసంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలిశారు. ఇటు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నాననేలా తనను కలిసిన అనుచరులకు హింట్ ఇస్తున్నారు.

బీఆర్ఎస్ అధిష్టానం తనకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు వారి వద్ద తుమ్మల వాపోయినట్లు తెలిసింది. దీంతో తుమ్మల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. సెప్టెంబర్ నెల 6న కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అనుచరులు సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు తుమ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్‌లో కొనసాగే ఆలోచనతో లేడంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు.