Thummala Nageswara Rao: కాంగ్రెస్‌లోకే తుమ్మల.. రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వంటి కాంగ్రెస్ నేతలు తుమ్మలను గురువారం కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 08:01 PMLast Updated on: Aug 31, 2023 | 8:01 PM

Thummala Nageswara Rao Met Wiht Revanth Reddy He Will Join Congress Soon

Thummala Nageswara Rao: బీఆర్‌‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఖమ్మం జిల్లా సీనియర్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వంటి కాంగ్రెస్ నేతలు తుమ్మలను గురువారం కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

బీఆర్ఎస్‌కు చెందిన తుమ్మలకు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ టిక్కెట్ నిరాకరించడంతో అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఆయనను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించినప్పటికీ, పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. తుమ్మలతో నామా నాగేశ్వర రావు భేటీ అయినప్పటికీ, తుమ్మలలో అసంతృప్తి చల్లారలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిన కేసీఆర్‌‌కు సరైన బదులు ఇవ్వాలని తుమ్మల డిసైడయ్యారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి, గెలవాలని భావిస్తున్నారు.

దీనికి అనుగుణంగా ఇటీవల తుమ్మల.. తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు.. తుమ్మలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా.. అండగా ఉంటామన్నారు. ఆయనకు అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే, అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లో చేరడమే మంచిదని సూచించారు. ఖమ్మంలో బీజేపీకి బలం లేదు. కాంగ్రెస్‌కు మంచి క్యాడర్ ఉంది. అందుకే కాంగ్రెస్‌లో చేరితేనే గెలుపు అవకాశాలుంటాయని సూచించారు. దీంతో తుమ్మల కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీనికి అనుగుణంగానే తుమ్మలతో రేవంత్, ఇతర నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా కోరారు. దీనికి తుమ్మల అంగీకరించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.

ఆయనకు పాలేరు నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించారు. అయితే, ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో షర్మిల.. కాంగ్రెస్‌లో చేరి, పాలేరు టిక్కెట్ ఆశిస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. స్థానికంగా పట్టున్న తుమ్మలకు, స్థానికేతరురాలు అయిన షర్మిలకు మధ్య టిక్కెట్ విషయంలో పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇద్దరిలో పాలేరు టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.