Thummala Nageswara Rao: బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. పోటీకి సిద్ధమవుతున్న తుమ్మల..!
పాలేరు టిక్కెట్ కందాలకు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల శుక్రవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Thummala Nageswara Rao: బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఆయనకే టిక్కెట్ కేటాయించడంతో తుమ్మల తిరుగుబాటు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర రావు సీనియర్ నేత. ఆయన 1985 నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి 1985, 1994, 1999, 2009లో గెలిచారు. మంత్రివర్గంలోనూ పని చేశారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి, 2016 ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. అయితే, 2018లో పాలేరులో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కందాల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరి, ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దీంతో ఇంతకాలం బీఆర్ఎస్‌లో అటు తుమ్మల వర్గం.. ఇటు కందాల వర్గం రెండూ ఉండేవి. అయితే, కందాల కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కావడంతో.. రాబోయే ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని తుమ్మల భావించారు. కానీ, తాజాగా పాలేరు టిక్కెట్ కందాలకు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల శుక్రవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు అసంతృప్తితో ఉన్న తుమ్మలను బుజ్జగించేందుకు కేసీఆర్.. నామా నాగేశ్వర రావును రాయబారం పంపారు. అయినప్పటికీ, తుమ్మల పట్టు వీడకపోవడం గమనార్హం.
ఏ పార్టీ నుంచి పోటీ..?
రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని తుమ్మల వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. తుమ్మల అనుచరులు, ఆయనను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పెద్దల నుంచి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు కూడా అందాయి. దీనిపై తుమ్మల ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏ పార్టీలో చేరితే తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కానీ, కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. అందుకే కాంగ్రెస్‌లో చేరితేనే మంచిదని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై త్వరలోనే తుమ్మల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తుమ్మల బీఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయమైంది.