Muthireddy Yadagiri Reddy: జనగామలో టికెట్ఫైట్.. పల్లాకు ముత్తిరెడ్డి వార్నింగ్..
సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన కీలక నేతలు సీక్రెట్‌గా పని కానిచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లాకు టికెట్ కేటాయించాలంటూ.. మద్దతుగా కొంతకాలంగా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ రహస్యంగా సాగుతోంది.
Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముత్తిరెడ్డిపై ఆయన కూతురు కేసు పెట్టడంతో రచ్చ పీక్స్‌కు చేరగా.. అది చల్లారేలోపు ఇప్పుడు టికెట్ ఫైట్ తెరమీదకు వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన కీలక నేతలు సీక్రెట్‌గా పని కానిచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లాకు టికెట్ కేటాయించాలంటూ.. మద్దతుగా కొంతకాలంగా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ రహస్యంగా సాగుతోంది.
ఇలాంటి పరిణామాల మధ్య జెడ్పీ చైర్మన్, పార్టీ జెడ్పీటీసీ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం రేపింది. ఇక అటు కేసీఆర్‌ను కలిసేందుకు వాళ్లు ప్రగతిభవన్‌కు వెళ్లగా.. అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు. దీంతో ముత్తిరెడ్డి అలర్ట్ అయ్యారు. టికెట్ తనదే అని ధీమాగా ఉన్న ఆయన.. ఇప్పుడు పల్లాకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. తన వర్గాన్ని యాక్టివ్ చేస్తున్నారు. మల్లాపూర్‌లోని నోమా ఫంక్షన్ హాల్‌లో అనుచరులతో సమావేశం నిర్వహించారు ముత్తిరెడ్డి. కార్యకర్తలకు స్వయంగా అన్నం వడ్డించి పెట్టారు. పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దు అంటూ.. ఆయన వర్గం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వివాదం మరింత పీక్స్‌కు చేరింది. జనగామలో కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లొల్లి నడుస్తోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి.. స్థానిక నేతలకు మధ్య విభేదాలు రావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని, మరెవ్వరికి ఇచ్చినా సహకరిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే చెప్పారు.
ఇదే సమయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నట్టు, ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనికితోడు నియోజకవర్గానికి చెందిన 25 మంది కీలక నేతలను పల్లా హైదరాబాద్ పిలిపించారని.. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉంచారని ప్రచారం జరిగింది. ఇది తెలియడంతో ముత్తిరెడ్డి కూడా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో వివాదం పీక్స్‌కు చేరింది. చివరకు తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. తన వర్గం నాయకులు పట్టు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో జనగామ టికెట్ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఆసక్తి తెలంగాణ రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. ఇక అటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ గడ్డపై కన్నేసి అధిష్టానాన్ని ఒప్పించి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారని కూడా తెలుస్తోంది. పోచంపల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలో ఒకరికి ఈసారి జనగామ టికెట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు టాక్. దీంతో ఎవరికి వారు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిణామాల్లో జనగామ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.