Tirupati: బాలాజీ కాలనీలో జగన్ స్టిక్కర్లు.. తిరుమలలో వైసీపీ నేతల ఓవరాక్షన్
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అతికిస్తున్న స్టిక్కర్లపై ఇప్పటికే రాజకీయయుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో మరో సంచలనం జరిగింది. స్టిక్లర్ల రచ్చ ఏకంగా తిరుమల కొండెక్కేసింది. తిరుమల బాలాజీ కాలనీలో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్ల ప్రచారం ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతోంది.

Gadapa Gadapaku YSRCP Programme at tirumala
తిరుమలలో జగన్ సంచిలతో ప్రచారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు.. ఇంటింటికీ జగన్ పోస్టర్లు అతికించారు. తిరుమల శ్రీవారిని నమ్మే చోట.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రచారం చేశారు. మాములుగా రాజకీయ ప్రచార సామాగ్రిని విజిలెన్స్ అధికారులు తిరుమలకు అనుమతించారు. ఐతే జగన్ స్టిక్కర్లు ప్రత్యక్షం కావడంతో.. అధికారుల తీరపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. గతంలో శివాజీ మహారాజ్ ఫొటోలు ఉన్న వాహనాలను టీటీడీ అధికారులు అనుమతించలేదు.
ఐతే ఇప్పుడు మాత్రం జగన్, వైసీపీ ప్రచార సామాగ్రిని ఎలా పైకి పంపించారని రాజకీయ పార్టీలు ఫైర్ అవుతున్నాయ్. ఇలాంటి పనులు చేస్తూ.. టీటీడీ నిబంధనలను అధికారులు కాలరాస్తున్నారని విమర్శిస్తున్నారు. వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని తిరుమలలో నిషేధించింది టీటీడీ. అయితే వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ప్రచారాన్ని విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.