Brahmanandam: అబ్బో.. జనాలకు కోపాలు వచ్చేశాయట! బ్రహ్మి చేసిన తప్పేంటో!

కర్ణాటకలో బీజేపీకి బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అంతే కొంతమంది జనాలకు ఆయనపై ఎక్కడలేని కోపం వచ్చింది. బ్రహ్మానందాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. ఇంతకీ దీనికి కారణమేంటంటే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2023 | 01:00 PMLast Updated on: May 06, 2023 | 1:00 PM

Tollywood Actor Brahmanandam Campaigning For Bjp In Karnataka Some People In Ap Gets Anger

Brahmanandam: ఎదుటివాళ్లు కూడా మాకు నచ్చిన తిండే తినాలి.. మాకు నచ్చిన డ్రెస్సులే ఎదుటివాళ్లు వేసుకోవాలి.. మాకు నచ్చిన నాయకుడికే అందరూ సపోర్టు చేయాలి.. లేకపోతే మాకు కోపాలు వచ్చేస్తాయ్.. తిట్టిపడేస్తాం.. ఏకిపారేస్తాం..! ఇలాంటి మైండ్‌సెట్‌ ఉన్న మనుషులు ప్రతీచోటా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా ఉంటారు..! కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్న బ్రహ్మానందంపై కొంతమంది కోపంగా ఉన్నారట. ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో తెలిస్తే ఢీ సినిమాలో బ్రహ్మానందం వేసుకున్నట్లు మనం కూడా బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే.
అన్నీ రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాటజీ వేరు. ఏపీలో కమలం పార్టీ వేసే అడుగులు వేరు..! ఏపీలో నిజానికి బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీ లేదు. జనాలు కూడా ఆ పార్టీని ఎన్నికల్లో పెద్దగా పట్టించుకోరు. అందుకే గత ఎన్నికల్లో కాషాయ పార్టీకి కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లే పోలయ్యాయి. అంతటి జనాదరణ కలిగిన పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పుణ్యామా అని.. కాస్తో కూస్తో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పడతాయన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా పవన్ ముఖం చూసి వేయడమే కానీ.. ఆ పార్టీకి ఏపీలో అంత సీన్ లేదన్నది విశ్లేషకుల మాట. నిజానికి ఏపీ విషయంలో బీజేపీ చాలా అన్యాయమే చేసింది..! స్పెషల్ స్టేటస్‌ బదులు ప్యాకేజీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటివి ఇందులో ప్రధానమైనవి. అయితే ఇక్కడ బీజేపీని నిందించకుండా వైసీపీ ఏమో చంద్రబాబుని, టీడీపీ ఏమో జగన్‌ని, జనసేన ఏమో టీడీపీ అన్న మాటలనే రీమేక్‌ చేసి వైసీపీని టార్గెట్‌ చేస్తుంటుంది. ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా కానీ, విడిగా కానీ బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం మాత్రం చేయవు. ప్రజలు కూడా వాళ్ల పార్టీ నాయకులకు తగ్గట్లుగానే విమర్శలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ లేనిది ప్రజల్లో కొంతమందికి బ్రహ్మానందంపై కోపం వచ్చిందట.. ఎందుకో చూడండి..!
స్నేహితుడి కోసం బ్రహ్మానందం ప్రచారం
సినిమావాళ్ల క్రేజ్‌ను రాజకీయ నాయకులు క్యాష్‌ చేసుకోవడం మామూలే. కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలవగా.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగా మన టాలీవుడ్ ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో కర్ణాటకలో ప్రచారం మొదలుపెట్టారు. చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ప్రస్తుత మంత్రి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్‌లో తెలుగు ఓటర్లు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించే సంఖ్యలో ఉన్నారు. అక్కడి తెలుగు వాళ్లను ఆకర్షించడం అభ్యర్థులకు ఎంతో ముఖ్యం. బ్రహ్మానందంతో సుధాకర్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన్ని క్యాంపెయినింగ్‌ చేయమని కోరగా.. దానికి బ్రహ్మి ఓకే చెప్పారు. అయితే ఇదంతా కొంతమందికి రుచించడంలేదట. పెట్రో ధరలు, గ్యాస్‌ ధరలు పెంచేసిన బీజేపీకి బ్రహ్మనందం ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారట.
ప్రశ్నించాల్సింది ఎవరిని?
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతకముందు కాంగ్రెస్‌ పప్పు, ఉప్పులతో సరిపెడితే.. బీజేపీ మాత్రం జీలకర్ర, ధనియలను కూడా వదల్లేదు..! ఏపీకి దక్కాల్సిన స్పెషల్‌ స్టేటస్‌ను కూడా ఇవ్వలేదు. ప్యాకేజీతో సరిపెట్టుకోమని చెప్పింది. దీనిపై ప్రశ్నించాల్సిన నాటి సీఎం చంద్రబాబు.. స్పెషల్ స్టేటస్‌ సంజీవని కాదు అని.. ప్యాకేజీనే బెస్ట్ అంటూ సడన్‌గా ప్లేట్ తిప్పేశారు. అప్పటికే ఎన్డీఏలోనే ఆయన భాగంగా ఉన్నారు. అప్పుడు ఈ నిర్ణయాన్ని అందరికంటే గట్టిగా వ్యతిరేకించారు పవన్ కల్యాణ్‌. ప్యాకేజీలను పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆ పాచిపోయిన లడ్డూలే బందర్‌ లడ్డూల్లా కనిపించినట్లు ఉన్నాయి.. అందుకే బీజేపీతో జత కట్టారు. మరోవైపు తాను అధికారంలోకి వస్తే స్పెషల్‌ స్టేటస్‌ తీసుకొస్తానని చెప్పిన జగన్‌.. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేసినట్లు కనిపించలేదు. ఇది చాలదన్నట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా జగన్‌ సీఎం అయిన తర్వాతే బీజేపీ తీసుకుంది. దాని గురించి వైసీపీ గట్టిగా మాట్లాడింది లేదు. జగన్‌కు 22 మంది ఎంపీల బలమున్నా.. ఏం ఉపయోగమో అర్థంకానీ దుస్థితి. ఇక పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు అటు వైసీపీ, ఇటు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంటాయి. అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క అడుగు వేయలేదు ఈ రెండు ప్రధాన పార్టీలు. అటు ప్రజలు కూడా కేంద్రం చేసిన తప్పులకు వైసీపీనో, టీడీపీనో విమర్శిస్తుంటారు. అలాంటి ప్రజల్లో కొంతమందికి సడన్‌గా బ్రహ్మానందం చేసింది తప్పుగా కనిపించడం నిజంగా విడ్డూరమే!