Appi Reddy: కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత..
టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత అప్పిరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.
Appi Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న వారు పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎంతటి నేతలైనా దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ దక్కుతుందనే కండిషన్ పెట్టింది పార్టీ. 119 అసెంబ్లీ స్థానాలకు వందల్లో అప్లికేషన్లు వచ్చాయి. రోజురోజుకూ పోటీచేయడానికి ఆశావాహులు, సిట్టింగులు, మాజీలు, కీలక నేతలు ఎక్కువ అవుతుండటంతో అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది.
ఐతే ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత అప్పిరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడే అప్పిరెడ్డి. ఐతే ఉత్తమ్ దంపతులు అప్లై చేసుకున్న రెండు స్థానాల్లోనూ అప్పిరెడ్డి దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఉత్తమ్ అనుచరుడు అయ్యుండి రెండు స్థానాలకు అప్లికేషన్స్ వేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. టాలీవుడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలుగులో జార్జిరెడ్డి, అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు.. లేటెస్ట్‌గా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన హుజూర్‌నగర్, కోదాడ నుంచి అప్లికేషన్స్ వేశారు. అయితే ఈ రెండు స్థానాల నుంచే ఎందుకనే దానిపై కూడా వివరించారు. ఉత్తమ్ దంపతులు పోటీ నుంచి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పిరెడ్డి అంటున్నారు.
మరి ఉత్తమ్ దంపతులు నిజంగా పోటీ నుంచి తప్పుకుంటారా.. అప్పిరెడ్డికి అవకాశం వస్తుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి. కోదాడ నుంచి 2014, 2018లో ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేశారు. 2014లో పద్మావతి గెలవగా.. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి పోటీచేయగా.. 2009, 2014, 2018లో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయానికి హుజూర్‌నగర్ నుంచి రాజీనామా చేసి.. నల్గొండ ఎంపీగా బరిలోకి దిగి అక్కడ కూడా ఘన విజయం సాధించారు. అయితే ఉపఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పోటీచేయగా.. 43వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఓటమి చెందారు. ఒకవేళ ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని.. తనకు అవకాశం వస్తుందని బహుశా అప్పిరెడ్డి ఆశిస్తున్నారేమోనని టాక్ నడుస్తోంది.