కాలుష్యంలో టాప్.. ఢిల్లీలో గాలి పీలిస్తే చావే!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 457గా ఉన్న గాలి నాణ్యత సూచీ.. సోమవారం ఉదయానికి 481కు చేరింది. దట్టంగా పొగమంచు అలముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విమానాలకు ట్రావెల్ అడ్వైజరీ.. 9వ తరగతి వరకు పాఠశాలలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్.. జీఆర్ఏపీ-4 నిబంధనలు ప్రకటించారు. 10 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే పాఠశాలల్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఉపయోగించే వాహనాలు తప్ప మిగతా ట్రక్కులు భారీ వాహనాలకు ఢిల్లీలో అనుమతి నిరాకరించారు. ఎల్ఎన్జీ, జీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. హైవేలు, రోడ్లు, ప్లైఓవర్‌లు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పరిస్థితి మెరుగుపడే వరకూ ఇంటి నుంచి పని చేయబోతున్నారు. కేవలం ఢిల్లీలోనే కాదు.. దేశంలోని చాలా నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఢిల్లీ తరువాత స్థానంలో 238 పాయింట్లతో పాట్నా రెండో స్థానంలో ఉంది. 231 పాయింట్లతో కలకత్తా మూడో స్థానంలో ఉంది. లక్నోలో ఎయిర్ క్వాలిటీ 224గా ఉంది. జైపూర్‌లో 182, భోపాల్‌లో 172, హైదరాబాద్‌లో 170, ముంబైలో 154, రామ్‌పూర్‌లో 152, అహ్మదబాద్‌లో 110, బెంగళూరులో 82, చెన్నైలో 82గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితి దాదాపు ఒకే విధంగా ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకూ దారుణంగా పడిపోతోంది. ఈ పరిస్థితిని కంట్రోస్ చేయాలంటూ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నారు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ అధికారులు.