Top story: కో అంటే కోట్లు, బీజేపీకి రూ.2,244కోట్ల డొనేషన్లు, బీఆర్ఎస్ కు రూ.580 కోట్లు

కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పట్లానే నెంబర్ వన్ గా బీజేపీ నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 06:21 PMLast Updated on: Dec 27, 2024 | 6:21 PM

Top Story కో అంటే కోట్లు బీజేపీకి

కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పట్లానే నెంబర్ వన్ గా బీజేపీ నిలిచింది. ఇక సెకండ్ ప్లేస్ మాత్రం మన కేసీఆర్ సార్ దే… అదేంటో కానీ జాతీయపార్టీ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కే డొనేషన్లు ఎక్కువ వచ్చాయి. పాపం బీఎస్పీ, బీజేడీలకు అసలు విరాళాలే రాలేదట… నమ్ముదామంటారా…?

రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం కామనే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలకే అందులో మేజర్ వాటా దక్కుతుంది. 20వేలకు మించి వచ్చిన డొనేషన్ల వివరాలను పార్టీలు ఎన్నికల సంఘానికి తెలపాలి. ఆ లిస్ట్ ను ఎలక్షన్ కమిషన్ తన వెబ్ సైట్ లో ఉంచింది. దాని ప్రకారం ఈ ఏడాది అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీ బీజేపీనే. అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ రావడంలో వింతా లేదు విచిత్రమూ లేదు. అయితే ఈ ఏడాది డొనేషన్లు భారీగా పెరగడం మాత్రం విశేషమే. ఈ ఏడాది బీజేపీకి ఏకంగా 2,244కోట్ల డొనేషన్లు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కమలానికి డొనేషన్ల కాసులు మూడింతలు ఎక్కువగా వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఎవరున్నారంటే సాధారణంగా కాంగ్రెస్ అని అందరూ చెబుతారు. కానీ విచిత్రంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ దేశంలో అత్యధిక విరాళాలు పొందిన రెండో పార్టీగా నిలిచింది. ఆ పార్టీకి 580కోట్ల డొనేషన్లు అందాయి. కాకపోతే అంతకుముందు ఏడాదితో పోల్చితే వంద కోట్ల వరకు విరాళాల్లో తగ్గుదల కనిపించింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాల్లో సగం కూడా రాలేదు. గతేడాది ఆ పార్టీకి వచ్చిన డొనేషన్లు 289 కోట్లు. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ బీజేపీకి 3కోట్లు డొనేషన్ ఇచ్చినట్లు ఈసీఐ వెబ్ సైట్ లో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎక్కువ విరాళాలు ఇచ్చిందెవన్నది ఆరా తీస్తే ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ముందుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ప్రకారం బీజేపీకి ఈ ట్రస్ట్ నుంచి 723 కోట్లు, కాంగ్రెస్ కు 156 కోట్లు ఫండ్ రూపంలో అందింది. అంటే బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో ప్రూడెంట్ ఫండ్ వాటానే దాదాపు మూడోవంతు. ఇక కాంగ్రెస్ విరాళాల్లో అయితే దాదాపు 60శాతం ఈ ఒక్క ట్రస్ట్ సమకూర్చింది. జాతీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడంతో అది సరిపెట్టుకోలేదు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కు కూడా 85కోట్లు ఇచ్చేసింది ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఇక అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా 62.5కోట్లు చెల్లించింది. అయితే ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. అప్పటి ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కూడా ప్రూడెంట్ ఎందుకైనా మంచిదని ఓ 33కోట్ల ఫండ్ ఇచ్చేసింది. ఎందుకైనా మంచిదని వైసీపీకి ఇచ్చినదాంట్లో సగం వరకు టీడీపీకి చెల్లించి సేఫ్ సైడ్ నిలబడింది. మొత్తంగా టీడీపీకి 100కోట్లు డొనేషన్ రూపంలో అందాయి. ఆప్ విరాళాలు 2022-23లో 37కోట్లుంటే ఈసారి అది 11కోట్ల 10లక్షలకు తగ్గిపోయింది. ఇక సీపీఎంకు ఈ ఏడాది 7కోట్ల 60లక్షల రూపాయల విరాళాలు అందాయి. అయితే పార్టీలకు వచ్చిన ఈ విరాళాలన్నీ నగదు రూపంలో వచ్చినవే. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినవి ఈ లెక్కల్లో కలపలేదు. వాటిని కూడా కలుపుకుంటే పార్టీల ఖజానాలకు ఇంకెంత వచ్చిపడిందో తెలుస్తుంది. అదేం విచిత్రమో కానీ బీఎస్పీ, ఒడిశాలోని బీజేడీలకు 20వేలకు పైబడి అసలు విరాళాలే రాలేదట. నవీన్ పట్నాయక్ మొన్నటివరకు ఒడిశాను ఏలారు. కానీ పాపం పైసలు మాత్రం రాలేదని మనల్ని నమ్మమంటున్నారు.

ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఇన్ని విరాళాలు ఎలా ఇచ్చింది అంటే దాని వెనక వేరే లెక్కుంది. కంపెనీలు ఓ రింగుగా ఏర్పడి ఈ ట్రస్టుకు నిధులు బదిలీ చేస్తే అది పార్టీలకు ఇస్తుందన్నమాట. మేఘా ఇంజనీరింగ్, సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆర్సిలర్ మిట్టల్, ఎయిర్ టెల్ వంటి సంస్థలు ఈ ట్రస్ట్ కు నిధులు సమకూర్చాయి.

అధికారంలో ఉన్న పార్టీల ఖజానా ఎప్పుడూ కాసుల మోతతో కళకళలాడుతూనే ఉంటుంది. వద్దంటే విరాళాలు వచ్చిపడుతుంటాయి. అవసరాలు అలాంటివి మరి. పెద్దపెద్ద కంపెనీలు పార్టీలతో సఖ్యతగా ఉండాలని కోరుకుంటాయి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలకు సాధ్యమైనన్ని డొనేషన్లు వెదజల్లి వాటి గుడ్ లుక్స్ లో ఉంటాయి. అలాగని ప్రతిపక్షాలను నెగ్లెక్ట్ చేయవు. భవిష్యత్తులు ఓడలు బళ్లు కావచ్చు… బళ్లు ఓడలు కావచ్చు… కాబట్టి ముందు జాగ్రత్తగా వాటికి కూడా ఎంతో కొంత చెల్లించేస్తుంటాయి. సాధారణంగా అధికారపార్టీతో పని కావాలంటే నాయకులకు ఆమ్యామ్యాలు మామూలే. దాంతో పాటు పార్టీకి విరాళాల రూపంలో ఎంతో కొంత ఇవ్వాల్సిందే. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఆ పార్టీకి ఫండ్స్ ఫ్లో బాగానే ఉంది. మరో నాలుగేళ్లు ఆ పార్టీకి తిరుగేలేదు. ఆ తర్వాత రెడ్డెవరో రాజెవరో…! 2019తో పోల్చితే బీజేపీకి విరాళాలు దాదాపు మూడురెట్లు పెరిగాయి. అప్పుడు వందల కోట్లలో ఉండే డొనేషన్లు ఇప్పుడు వేలకోట్లలోకి చేరిపోయాయి.

విరాళాల రూపంలో వచ్చిన డబ్బును పార్టీలు ఏం చేస్తాయన్నది ఇంట్రస్టింగ్ అంశం. పార్టీలు ఆ డబ్బులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీకి కూడా ఆ డబ్బులు వాడాల్సిన అవసరం ఉండదు. ఇతర వ్యవహారాలతోనే ఖర్చులు నడిచిపోతుంటాయి. పోనీ ఎన్నికల సమయంలో వాడతారా అదీ లేదు. కేవలం కొద్ది మొత్తంలోనే వీటిని ఖర్చు చేస్తారు. ఎందుకంటే వాటికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల జేబులోంచే ఆ ఖర్చులు వెళ్లిపోతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ డబ్బులు వాడాల్సిన అవసరం ఉండదు. వీటిపై వచ్చే వడ్డీ కూడా ఏటా కోట్లలోనే ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు మాత్రం నిధుల కటకట తప్పేలా లేదు.