Top story: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌…రమేశ్ బిధూరి ఎంపీలు, సీఎంలపై నోటికొచ్చినట్లు వాగడమే

ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఇష్టమొచ్చినట్లు వాగడం ఆయన నైజం. ఆయనేం మాములు వ్యక్తి కాదు...రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని ఢీకొట్టబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 03:12 PMLast Updated on: Jan 09, 2025 | 3:12 PM

Top Story Carafe Address For Controversies Ramesh Bidhuri Sounds Like Hes Talking About Mps And Cms

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం…ఓటర్లను ఆకట్టుకునేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థులను ఎంత కించపరిస్తే…అంత మైలేజ్ వస్తుందనేలా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరాయన ? వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదా ?

రమేశ్‌ బిధూరి…బీజేపీ మాజీ ఎంపీ. రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. పార్లమెంట్‌ సమావేశాలైనా…ఎన్నికల ప్రచారంలో అయినా…ఆయన రూటే సపరేటు. ప్రత్యర్థులను కించపరచడమే ఆయన లక్ష్యం. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతకైనా దిగజారు. వాళ్లు వీళ్లు అని తేడా ఉండదు. నోరుంది…మాట్లాడేయటమే. అది తప్పా ? రైటా ? అన్నది తర్వాత సంగతి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆయన నైజం. పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. నిత్యం ప్రత్యర్థులను దూషిస్తూ…వార్తల్లో నిలుస్తారు.

రమేశ్ బిధూరి…ప్రస్తుతం ఢిల్లీలోని కాల్కాజీ అసెంబ్లీ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఢిల్లీ సీఎం అతిశి బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. నరం లేని నాలుక…ఎలా తిరిగితే అలా మాట్లాడేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా…కాల్కాజీలో ప్రచారం నిర్వహించిన ఆయన ముఖ్యమంత్రి అతిశీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిశీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. సీఎం ఆతిశీ…తండ్రినే మార్చేశారంటూ బిధూరి కామెంట్లు చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉంటే…ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రమేశ్ బిధూరి కామెంట్లకు నొచ్చుకున్న అతిశీ కన్నీటి పర్యంతమయ్యారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన రమేశ్ బిధూరి…కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని అవమానించేలా కామెంట్లు చేశారు. తాము ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత…కాల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా తయారు చేస్తామంటూ దుమారం రేపాడు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు…రమేశ్ బిధూరికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. హైదరాబాద్ లో అయితే…కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఢిల్లీలో రమేశ్ బిధూరి వివాదాస్పద కామెంట్లు చేస్తే…హైదరాబాద్ లో రెండు పార్టీల నేతలు కొట్టుకున్నారు. పైగా ప్రియాంకా గాంధీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు బిధూరి. ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా అలనాటి హీరోయిన్‌, ఎంపీ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అంటున్నాడు. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ చేసింది తప్పయితే…తనది తప్పేనని చెప్పుకొస్తున్నాడు.

గతంలో పార్లమెంట్ సమావేశాల్లో అయితే…రమేశ్ బిధూరి మరింత రెచ్చిపోయాడు. బీఎస్పీ ఎంపీ డానీష్ అలీని ఉగ్రవాదితో పొల్చాడు. అంతటితో ఈ బీజేపీ నేత…ఏయ్‌ ఉగ్రవాది.. ముల్లా ఉగ్రవాది, సున్తీ చేయించుకున్నవాడు అంటూ రెచ్చిపోయాడు. డానిష్‌ అలీపై రమేశ్‌ బిధూరి చేసిన కాంట్రవర్సీ కామెంట్లు దుమారం రేపాయి. పార్లమెంట్ రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ నిరాకరించింది. అయినప్పటికీ బిధూరి మాత్రం తన వ్యవహారశైలిని మాత్రం మార్చుకోలేదు.