Top story: ఇండియన్ అమెరికన్స్‌కు గ్రేట్ న్యూస్
నిజమేనా... ఇది నిజంగా నిజమేనా...? ట్రంప్ నోట ఇలాంటి మాటా....? వీసాలంటే విరుచుకుపడే ప్రెసిడెంట్‌కు ఒక్కసారిగా మనపై ఇంత దయ కలిగిందెందుకో మరి...!
నిజమేనా… ఇది నిజంగా నిజమేనా…? ట్రంప్ నోట ఇలాంటి మాటా….? వీసాలంటే విరుచుకుపడే ప్రెసిడెంట్‌కు ఒక్కసారిగా మనపై ఇంత దయ కలిగిందెందుకో మరి…! H1B వీసాలు నాకు ఓకే అంటూ ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేశారు ట్రంప్. అయితే దీనికి మరో ట్విస్ట్ ఇచ్చారు ఎలాన్ మస్క్. ఇంతకీ కొత్త వీసా ప్రోగ్రామ్ ఇండియన్స్‌కు లాభమా.. నష్టమా…?
ఇండియన్స్ పాలిట కల్పతరువు లాంటి H1B వీసాల అంశం మరోసారి అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీసాలు వద్దని రిపబ్లికన్లలో కొందరు వాదిస్తుంటే… ఇవ్వాల్సిందేనని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ వీసాలు నాకు ఓకే అంటూ ట్విస్ట్ ఇచ్చారు…
అమెరికాలో H1B వీసాలపై ఓ రేంజ్‌లో రచ్చ నడుస్తోంది. అయితే ఈ వార్ అధికార డెమొక్రటిక్, త్వరలో అధికారంలోకి రాబోతున్న రిపబ్లికన్ పార్టీల మధ్య కాదు… ట్రంప్ పార్టీ రిపబ్లికన్ల మధ్యే ఇప్పుడు చిచ్చు రగిలింది. సంప్రదాయ రిపబ్లికన్లు ఇప్పుడు ఈ వీసాలకు నో అంటున్నారు. అసలు H1B వీసాలు ఇవ్వొద్దని కొందరు, ఇచ్చినా కఠిన ఆంక్షలు పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడాల్సిందేనని ట్రంప్ ముందు తమ డిమాండ్లు ఉంచారు. వీసాలపై ఆంక్షలు కాస్త సులభతరం చేయాలని వాదించే వెంచర్ కాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ సీనియర్ అడ్వైజర్‌గా నియమించారు ట్రంప్. ఆయన్ను నియమించడం ట్రంప్ అనుచరుల్లో చాలామందికి నచ్చలేదు. ఈ సమయంలోనే ట్రంప్ న్యూ ఫ్రెండ్ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇండియన్స్‌లో కొత్త ఆశలే రేపాయి. అమెరికాలో తాను ఇంతటి వాడిని కావడానికి ఈ వీసాలే కారణమన్నారు మస్క్. అసలు మస్క్ అమెరికాకు వచ్చింది ఆ వీసాపైనే… మస్క్ మాటలకు ట్రంప్ నుంచి మద్దతు లభించింది. ఆయన మాట్లాడారంటే ఈ వీసాలకు వ్యతిరేకంగానే అని అందరూ అనుకుంటారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా H1B వీసాలను సమర్ధించారు ట్రంప్. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి తానెప్పుడూ అనుకూలమని తేల్చిచెప్పారు. ఆ వీసాలపై నమ్మకముందని అదో గొప్ప కార్యక్రమమని వ్యాఖ్యానించారు ట్రంప్. అమెరికా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉండాలంటే ఈ కార్యక్రమం కొనసాగాల్సిందేనన్నది ఆయన మాట.
ట్రంప్ మొదట్నుంచి H1B వీసాలకు వ్యతిరేకం. గతంలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీసాలు దొరకడం చాలా కష్టమయ్యేది. నానా చావు చావాల్సి వచ్చేది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ట్రంప్ గురించి తెలిసిన కొందరు మాత్రం ఇందులో అంత సంతోష పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆయన కేవలం H1B వీసాలకు అనుకూలం అని మాత్రమే అన్నారంటున్నారు. దానర్థం భారీగా వీసాలు ఇస్తానని చెప్పడం కాదన్నది వారి వాదన. అమెరికా ఎప్పుడూ ట్యాలెంట్ ఉన్న వారిని ఆహ్వానిస్తుంది. అలాగని అందరూ రావడానికి మాత్రం కుదరదన్నది ట్రంప్ మాట. ఇప్పుడు కూడా ఆ వీసా ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేస్తూనే అందులో మార్పులు తీసుకురావాలన్నది ఆయన ఆలోచన.
తాజాగా జరుగుతున్న రచ్చపై ట్రంప్ కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్న మస్క్ మరోసారి స్పందించారు. H1B వీసా ప్రోగ్రామ్ పూర్తిగా లోపాలపుట్టగా మారిందని భారీ సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విధానంలో మార్పులు తెస్తామన్నారు. మినిమమ్ శాలరీని పెంచబోతున్నామని దీంతో పాటు H1B వీసాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా రెట్టింపు చేసే ఆలోచన ఉందని చావు కబురు చల్లగా చెప్పారు. ఎందుకంటే మినిమమ్ శాలరీని పెంచితే అమెరికన్ కంపెనీలు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. వీసాలకు ఎక్కువ మొత్తం పెట్టాలి. దీనికంటే అమెరికన్లనే తీసుకుంటే బెటరని భావిస్తాయి. ఇది మనవారిని ఇబ్బంది పెట్టేదే. ఎక్కువ మొత్తంలో డాలర్లు సంపాదించే ఇండియన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మనవాళ్లలో మెజారిటీ తక్కువ మొత్తమే సంపాదిస్తున్నారు. అలాంటి వారందరి మెడపై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. అమెరికా ఏటా 65వేల H1B వీసాలను ఇష్యూ చేస్తుంది. దీనికి అదనంగా అమెరికా యూనివర్శిటీల్లో డిగ్రీ చేసిన 20వేల మందికి కూడా వీసాలు దక్కుతున్నాయి. గతేడాది వరకు దాదాపు 7లక్షలమంది H1B వీసాదారులున్నారు. ట్రంప్ అధికారంలోకి రాగానే వీరిలో ఎందరి వీసాలు ఉంటాయో ఊడతాయోనన్న టెన్షన్ ఉంది. ఇలాంటి సమయంలో వీసాలపై ఒక్కొక్కరూ ఒక్కో రకమైన కామెంట్ చేస్తూ ఇండియన్స్ ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు. కాసేపు ఆశలు రేపడం, ఆ వెంటనే వాటిని చిదిమేయడంతో గందరగోళం నెలకొంది. జనవరి 20వరకూ ఇదే టెన్షన్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి మరి.