Top story: గౌతమ్ అదానీకే వణుకు పుట్టించిన హిండెన్‌బర్గ్‌, సంస్థను నడిపించేందుకు దారుల్లేవంటూ మూసివేత

ప్రపంచ కుబేరులను వణికించాడు. వరుస కథనాలతో వ్యాపారవేత్తలకు వణుకు పుట్టించాడు. ఇండియాకు చెందిన అదానీకి కంటి మీద కునుకులేకుండా చేశాడు. దెబ్బకు షేర్లధరలు పడిపోవడంతో అత్యంత సంపన్నుడి ఆస్తులు కరిగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2025 | 02:53 PMLast Updated on: Jan 17, 2025 | 2:53 PM

Top Story Hindenburg Which Caused A Stir Even For Gautam Adani Was Closed Down As He Was Unfit To Run The Company

ప్రపంచ కుబేరులను వణికించాడు. వరుస కథనాలతో వ్యాపారవేత్తలకు వణుకు పుట్టించాడు. ఇండియాకు చెందిన అదానీకి కంటి మీద కునుకులేకుండా చేశాడు. దెబ్బకు షేర్లధరలు పడిపోవడంతో అత్యంత సంపన్నుడి ఆస్తులు కరిగిపోయాయి. ధనవంతులనే భయపెట్టిన రీసెర్చ్‌ సంస్థ…ఇపుడు మూతపడుతోంది. ఏడు సంవత్సరాలకే సంస్థ మూత పడుతోంది. నడిపించలేక మూత పడుతోందా ? లేదంటే ఎవరి ఒత్తిళ్లు అయినా ఉన్నాయా ?

గౌతమ్ అదానీ…ఊపిరి పీల్చుకో. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ పరిశోధనల వేట ముగించేసింది. సంచలన నివేదికతో గౌతమ్ అదానీ గ్రూపునకు హిండెన్‌బర్గ్ సంస్థ…కంటి మీద కునుకులేకుండా చేసింది. ప్రపంచంలో ఎన్నో సంస్థలను ముప్పుతిప్పులు పెట్టిన హిండెన్‌బర్గ్‌…తమ కార్యకలాపాలను ముగిస్తున్నట్టు ప్రకటించి…సంచలనం సృష్టించింది. దీంతో షేర్ మార్కెట్ రంగంలోని పెట్టుబడిదారులను షాకయ్యారు. హిండెన్‌బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు…దాని వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. సంస్థను కొనసాగించే దారులు మూసుకుపోవడంతో…పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ మూసివేతకు ఎలాంటి ఒత్తిళ్లు…వేధింపులు లేవని వంటి ఇంకే కారణాలు లేవని స్పష్టం చేశారు. గతంలో తనను తాను నిరూపించుకోవాలని…పేరు సంపాదించాలని అనుకునేవాడినని…హిండెన్ బర్గ్ తన జీవితంలో ఒక భాగమని వెల్లడించాడు నాధన్ అండర్సన్. తన జీవితానికి సరిపడా చేసిన సాహసం…ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పని చేసి…సక్సెస్‌ అయ్యాయని చెప్పాడు.

న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన హిండెన్‌బర్గ్ కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించేది. ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్లో పెట్టుబడులు పెడుతుంది. 2017లో నాథన్ అండర్సన్ ప్రారంభించిన ఈ సంస్థ మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో కుంభకోణానికి పాల్పడిందని నివేదిక రిలీజ్ చేసి సంచలనం రేపింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ ఉక్కిరిబిక్కిరి అయింది. లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దీంతో హిండెన్ బర్గ్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. తాజాగా హిండెన్‌బర్గ్ మూసివేతపై కుటుంబం, స్నేహితులు, సంస్థ ఉద్యోగులతో…ఏడాదిగా సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు నాథన్ అండర్సన్ చెప్పుకొచ్చాడు. అనంతరం హిండెన్ బర్గ్ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు, దీనిపై తాము ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు అన్నీ అయిపోయాయని తెలిపారు. అయితే హిండెన్ బర్గ్ మూసివేతపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ తరహాలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసింది. స్వతంత్ర పరిశోధనల ముసుగులో విదేశీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక అస్థిరతను సృష్టించేందుకు బైడెన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇలాంటి సంస్ధలకు మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి.

తాను ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్లు తెలిపాడు. తనను నిర్వచించే ప్రధాన విషయంగా కాదని వెల్లడించాడు. చివరిగా అండరన్స్ పోంజీ స్కీమ్‌లపై చిట్కాలను రెగ్యులేటర్‌లకు అందించిన తర్వాత తన సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే రాబోయే కాలంలో హిండన్ బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు. 2017లో ప్రారంభమైన ఈ సంస్థ ఏడేళ్లలో తన సొంత పతనాన్ని లిఖించుకుంది. భారత్ కేంద్రంగా మొదలై దేశ దేశాలకు విస్తరించిన అదానీ గ్రూప్ పై అమెరికా అండతో కక్షగట్టింది. అధ్యయనం పేరుతో అడ్డగోలు రిపోర్టులు ఇచ్చి కోట్లాది మంది పెట్టుబడిదారుల సంపదను ఆవిరి చేసిన హిండెన్ బర్గ్ చివరికి మూతపడుతోంది.