Top story: అమెరికా రైటా… రాంగా…? అసలు మనకు ఆ హక్కుందా…!
అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారతీయుల్ని వెనక్కు పంపుతోంది అమెరికా. కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి మరీ సైనిక విమానాల్లో కుక్కి పంపేస్తోంది.

అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారతీయుల్ని వెనక్కు పంపుతోంది అమెరికా. కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి మరీ సైనిక విమానాల్లో కుక్కి పంపేస్తోంది. భారతీయులను అమెరికా అవమానిస్తోందంటూ కొంతమంది ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని, అమెరికాను దుయ్యబడుతున్నారు. ఇంతకీ అమెరికా చేసింది తప్పేనా…? నిజంగా మనకు ఆ దేశాన్ని విమర్శించే హక్కుందా…?
తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్ని వేటాడి వారిని వారి వారి దేశాలకు తరలిస్తోంది అమెరికా. గతంలో ఎన్నడూ లేనంతగా డిపోర్టేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగా 104మంది ఇండియన్స్‌ను అమృత్‌సర్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టింది. త్వరలో మరో 4వందల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అమెరికా అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విధానంపై పెద్ద చర్చే జరుగుతోంది. కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి తరలించడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. దీనిపై పార్లమెంట్‌లో పెద్ద రచ్చ సాగింది.. అలా కాళ్లు చేతులకు సంకెళ్లు ఎలా వేస్తారని కొందరు ప్రశ్నిస్తారు. కాస్త డిగ్నిటీ చూపాలని ఇంకొందరు వాదిస్తారు.. పూర్ ఇండియన్స్ అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తారు. భారతీయుల్ని అవమానించారంటూ ఇంకొందరు గుండెలు బాదుకుంటున్నారు. కలలు కల్లలు అంటూ ఇంకొందరు కన్నీరు పెట్టినంత పని చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. వాళ్లు మన ఇండియన్స్ కాబట్టి మన యాంగిల్‌లో ఆలోచించకుండా సూటిగా సుత్తిలేకుండా ఎవరైనా సమాధానం చెప్పగలరా.. అక్రమంగా వలస వెళ్లిన వారు తప్పు చేయలేదా…? దేశం విడిచి దొంగతనంగా పారిపోలేదా…? అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదా….? బ్రోకర్లకు డబ్బు కట్టి మరీ అమెరికాలో ఎంట్రీ కావడం నేరం కాదా…? దేశాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టలేదా…? మన దేశంలోకి వస్తున్న బంగ్లాదేశీయుల్ని మనం వెనక్కు పంపమనడం లేదా…? అది తప్పు కానప్పుడు అమెరికా చేసింది తప్పవుతుందా…?
అమెరికా వెనక్కు పంపింది మనవాళ్లను కాబట్టి మనకు వారిపై సానుభూతి ఉంటుంది. పరాయిదేశంలో బతుకును, భవిష్యత్తును వెతుక్కుంటూ క్షణక్షణం చావును పలకరిస్తూ వారు ఆ దేశంలో అడుగుపెట్టారు. కొండలెక్కారు… సముద్రాలు దాటారు. అందుకోసం లక్షలు ఖర్చు పెట్టారు. ఈ ప్రయాణంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి వారి పట్ల పాపం అన్న సానుభూతి మన అందరికీ ఉంటుంది. కానీ అమెరికా వారిని వెనక్కు పంపడాన్ని తప్పు పట్టలేం. ఆ దేశం కోణంలో ఆలోచిస్తే వారంతా దొడ్డిదారిన తమ దేశంలో అడుగుపెట్టిన వారు. అటు నుంచి చూస్తే అది నిజమే కదా… వారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు. అది తప్పే కదా… దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు వారి వల్ల అమెరికా ముందు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా…? అమెరికాకు వెళ్లడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ దొడ్డిదారిన వెళితే ఇలా పట్టుకుని వెనక్కు పంపడాన్ని మనం తప్పుపట్టలేం కదా..?
కాళ్లకు చేతులకు సంకెళ్లు వేయడం సరైనదేనా…? మహిళలు, పిల్లలని కూడా చూడరా…? డిగ్నిటీతో వెనక్కు పంపొచ్చు కదా…?
కాళ్లకు చేతులకు సంకెళ్లు వేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది.
అక్రమంగా తమ దేశంలో అడుగు పెట్టిన వారిని ఇలా వెనక్కు పంపడం అమెరికా చట్టం. బ్రెజిల్, కొలంబియా, మెక్కికో సహా పలు దేశాలకు చెందిన వారిని కూడా ఇలాగే అమెరికా ఇలాగే తరలించింది. వాళ్ల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసింది. దీనిపై ఆయా దేశాలు నిరసన కూడా తెలిపాయి. కానీ వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. అక్రమంగా మన ఇంట్లోకి చొరబడ్డ వారిని మనం ఎలా బయటకు పంపుతామో అలాగే అమెరికా చేసింది. దొరికింది అమెరికాలో… ఎలాంటి పత్రాలు లేవు. అలాంటప్పుడు వారిని ఎలా తరలించాలి…? అమెరికా విమానాల్లో తరలిస్తున్నారు కాబట్టి వారి చట్టాలను పాటించాల్సిందే. కాదంటే మన విమానాలు పంపి మనవారిని మనం వెనక్కు తెచ్చుకోవాలి. ఆ పని మనం చేయలేదు. కాబట్టి వారిని విమర్శించే హక్కు మనకు లేదు. వెనక్కు తీసుకొస్తున్న వారికి తిండి పెట్టకుండా మాడ్చలేదు. వాష్‌రూమ్‌కు వెళ్లకుండా ఆపలేదు… సంకెళ్లు వేయకుండానే ఉన్నారనుకుందాం…మరి వారిలో ఎవరైనా క్రిమినల్స్ ఉండి విమానంలో ఏమైనా గడబిడ చేస్తే అప్పుడు ఎవరు సమాధానం చెబుతారు… ? అమెరికా సైనికులపై దాడి చేసి ఆయుధాలు లాక్కుంటే ఏం జరుగుతుంది…? కాబట్టి వారికి సంకెళ్లు వేయడంలో తప్పులేదన్నది అమెరికా చట్టం. దాన్ని మనం గౌరవించాల్సిందే. లేకపోతే అమెరికా నుంచి మనకు తిప్పలు తప్పవు. ఇలాంటి అక్రమార్కుల కారణంగా దేశమంతా ఎందుకు ఇబ్బంది పడాలి..?
అసోం మీదుగా బంగ్లాదేశ్ నుంచి చాలామంది మన దేశంలో అడుగుపెట్టారు. అలాంటి వారందరినీ క్యాంపులకు తరలిస్తున్నాం. వారిని వారి దేశాలకు పంపాలని డిమాండ్ గట్టిగానే ఉంది. సైఫ్ అలీఖాన్ పై దాడిచేసింది ఓ బంగ్లాదేశీ అని తెలిసి తెగ తిట్టుకున్నాం. రోహింగ్యాలు మన దేశంలోకి అడుగుపెడితే వారిని తరిమివేయాలని గగ్గోలు పెట్టాం. వారు దేశభద్రతకు ఇబ్బంది అన్నది మన వాదన. అమెరికా గోల కూడా అదే కదా. మనది తప్పు కానప్పుడు అమెరికాది తప్పు ఎలా అవుతుంది…?
అమెరికాలో మనవాళ్లు లక్షల్లో ఉన్నారు. చాలామంది సరైన పద్దతిలో వీసా తీసుకుని ఆ దేశంలో అడుగుపెడుతున్నారు. ఏటా లక్షలమంది విద్యార్థులు చదువుకోసం వెళుతున్నారు. 99శాతం మంది పద్దతిగా వెళితే మిగిలిన వారు దొడ్డిదారిని నమ్ముకుంటున్నారు. అలాంటివారు ఒక్కశాతమే. కానీ ఆ ఒక్కశాతం మంది వల్ల మిగిలిన 99శాతానికి ఎంత ఇబ్బందో ఎవరూ ఆలోచించరా…? అన్ని పత్రాలు ఉన్న మిగిలిన వారిని అమెరికా అధికారులు అనుమానంగా చూడరా…? సరే మన విద్యార్థులు ఎంతోమంది అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైమ్ చేసుకుంటున్నారు. అలా చేయకూడదన్నది చట్టం. కానీ తమ ఖర్చులు తాము సంపాదించుకుంటూ ఇక్కడ తమ తల్లిదండ్రులపై భారం పడకుండా వారు నానాతంటాలు పడుతున్నారు. మరిప్పుడు ఇలాంటి అక్రమార్కుల వల్ల అలాంటి విద్యార్థులకు ఎంత ఇబ్బందో ఎవరూ ఆలోచించరా. డిపోర్టేషన్ భయంతో ఎంతోమంది విద్యార్థులు తమ అపార్ట్‌మెంట్ దాటి భయటకు రావడం లేదు. మరి వారి ఇబ్బందికి కారణమెవరు…? అక్రమార్కులే కదా…! ఇప్పుడు చెప్పండి అమెరికా మనవాళ్లను బలవంతంగా తరలించడం తప్పా…? తరలించిన విధానం తప్పా…? కాస్త మెదడుతో ఆలోచిస్తే రెండిటికీ సమాధానం నో అనే వస్తుంది.