Top Story; యుద్ధం ప్రకటించిన తాలిబన్లు ధ్వంసం కాబోతున్న పాకిస్తాన్?

తెహ్రీక్-ఇ-తాలిబన్.. పాకిస్తాన్ పాలుపోసి పెంచిన కాలనాగులు. ఇప్పుడు వాళ్లే పాకిస్తాన్‌ను కసితీరా కాటేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టుపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2024 | 12:11 PMLast Updated on: Dec 24, 2024 | 12:11 PM

Top Story Is Pakistan About To Be Destroyed By The Taliban Who Declared War

తెహ్రీక్-ఇ-తాలిబన్.. పాకిస్తాన్ పాలుపోసి పెంచిన కాలనాగులు. ఇప్పుడు వాళ్లే పాకిస్తాన్‌ను కసితీరా కాటేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టుపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు. నిజానికి.. ఆఫ్ఘాన్‌లో తిష్టవేసిన సోవియట్లను తరిమేసేందుకు తామే వారిని తయారు చేశాం అని అప్పట్లో గర్వంగా చెప్పుకున్నారు పాక్ పాలకులు. అంతేకాదు, ఇక తాలిబన్లు ఇండియాపై దృష్టిపెడతాయని బెదిరింపులకూ దిగారు. కానీ, ఇప్పుడు ఎవరైతే తన ప్రత్యర్ధిపై దృష్టిపెడతారని భావించారో వారే ఇస్లామాబాద్ పాలిట కాల యముళ్లుగా మారారు. ఐతే, మూడేళ్ల క్రితం వరకూ పాక్ చెప్పినట్టే ఆడిన తాలిబన్లు ఇప్పుడు ఎందుకు ఎదురుతిరుగుతున్నారు? తాలిబన్లు, పాక్ పాలకుల మధ్య ఎక్కడ చెడింది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

మాకీన్.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఉండే ప్రాంతం. అక్కడ పాకిస్తాన్‌కు చెందిన ఒక ఆర్మీ ఔట్‌పోస్ట్ ఉంటుంది. ఆ ఔట్‌పోస్టు లక్ష్యం పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశంలోకి తాలిబన్లు చొరబడకుండా చూసుకోవడం. కానీ, ఆ విషయంలో పాక్ ఆర్మీ ఫెయిల్ అయింది. ఈ నెల 21న అర్ధరాత్రి 30మంది తాలిబన్లు ఆర్మీ ఔట్‌పోస్టుపై మెరుపుదాడి చేశారు. మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. 16 మంది పాకిస్తానీ సైనికులను చంపేసి, వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు, కీలక పత్రాలను తగలబెట్టేశారు. పాక్ ఆర్మీపై తాలిబన్ల దాడి ఇదే తొలిసారి కాదు.. ఇదే ఆఖరిసారీ కాదు. కానీ, ఒకప్పుడు స్నేహగీతం పాడుకున్న పాక్, తాలిబన్ల మధ్య ఎందుకీ పరిస్థితులు వచ్చాయన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలోనే ఉంది.

తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్.. సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పాలంటే టీటీపీ. పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలో ఈ సంస్థ కూడా ఓ భాగం. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ సంస్థ గురించి పాక్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, వారి అంచనాలు తిరగబడ్డాయి. ఎవరయితే తమ శత్రువు అంతుచూస్తారని సంబరపడిపోయారు ఇప్పుడు వాళ్లే శత్రువులయ్యారు. పొరుగు దేశాల్లో రక్తపాతం సృష్టిస్తారనుకుంటే పాకిస్తాన్‌నే రక్తసిక్తం చేస్తున్నారు. దీనంత టికీ కారణం.. తాము మద్దతిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్లతో ఈ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ చేతులు కలపడమే. టీటీపీని 2007లో స్థాపించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘాన్‌ నుంచి అమెరికా, నాటో సేనలు వెళ్లిపోయాక బలపడింది. టీటీపీ అధినేత నూర్‌ వలీ మెహసూద్‌ ఆఫ్ఘాన్‌‌లోనే తిష్ఠవేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు. ఆఫ్ఘాన్‌లో అధికారం దక్కించుకొనే వరకు అక్కడి తాలిబన్లు పాకిస్తాన్‌ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకొన్నాక.. నాటి పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. ఆ తర్వాతే తాలిబన్లు వ్యూహం మార్చారు. .

2వేల 600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్‌ లైన్‌ వద్ద పాక్‌తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘాన్ తాలిబన్లు దృష్టిపెట్టారు. ఈ సరిహద్దులో కంచె వేద్దామన్న పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొట్టారు.నిజానికి.. టీటీపీ లక్ష్యం పాకిస్తాన్‌ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నదే. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టారో.. అప్పుడే టీటీపీకి వెయ్యేనుగుల బలం వచ్చింది. అక్కడ మొదలు పాకిస్తాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా వెళ్లిపోయాక.. పాక్‌లో ఉగ్రదాడులు 50శాతం పెరిగాయి. వీటిల్లో చాలా వరకు టీటీపీ చేసినవే. సింపుల్‌గా చెప్పాలంటే ఇకప్పుడు ఆత్మాహుతి దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిన పాకిస్తాన్.. ఇప్పుడు అవే దాడులతో అల్లాడిపోతోంది. అసలే ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌కు ఉత్తర పాకిస్తాన్‌లో టీటీపీ రూపంలో సమాంతర ప్రభుత్వంతో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ పరిస్థితులతోనే ఈ ఏడాది ప్రారంభంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత టీటీపీని ఉద్దేశించి పాక్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయమిస్తే ఆఫ్ఘాన్‌లోకి చొచ్చుకొచ్చి మరీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటనతో ఆఫ్ఘాన్ తాలిబన్‌ పాలకులు మండిపడ్డారు. 1971లో భారత్‌ చేతిలో ఎదురైన అవమానం ఈ సారి తమ చేతిలో ఎదురవు తుందని పాకిస్తాన్‌ను హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ పరువు పోయినంతపనైంది. ఇది జరిగి ఆరు నెలలైనా కాకముందే అక్టోబర్ 31 వరకూ డెడ్‌లైన్ విధించి పాకిస్తాన్‌లో ఉన్న లక్షలాది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనిపైనా తాలిబన్లు మండిపడ్డారు. ఆ తర్వాత ఏకంగా ఆఫ్ఘనిస్తాన్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించి మరో సాహసం చేశారు. ఓవరాల్‌గా పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటి లక్ష్యం టీటీపీని ఆఫ్ఘాన్ సర్కార్ కంట్రోల్ చేస్తుందన్న ఆశతోనే. కానీ, ఈ నిర్ణయాలు ఆఫ్ఘనిస్తాన్ సర్కార్‌పై ఒత్తిడి కంటే ఆగ్రహాన్నే పెంచుతున్నాయి. ఫలితంగా.. ఏ క్షణమైనా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకిస్తాన్‌పై దండెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్ధిక సంక్షోభంతో నిండా మునిగిన పాకిస్తాన్ కథ ముగిసినట్టే.