Top story: కేంద్ర మంత్రిగా పవన్…. పక్కాప్లాన్ తో జాతీయ రాజకీయాల్లోకి.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అవబోతున్నారా? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ వచ్చే ఏడాది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదెలా సాధ్యం? అసలు అది ఇప్పుడు అవసరమా? అని చాలామందికి అనిపించొచ్చు...
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అవబోతున్నారా? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ వచ్చే ఏడాది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదెలా సాధ్యం? అసలు అది ఇప్పుడు అవసరమా? అని చాలామందికి అనిపించొచ్చు… కానీ బిజెపి అధిష్టానం సూచనతో పవన్ కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.2026లో రాజ్యసభ సభ్యునిగా ఎంపికై, అందుకు ముందు గాని తర్వాత గాని, కేంద్రంలో క్యాబినెట్ మంత్రి పదవి స్వీకరించే ఆలోచనలో ఉన్నారు పవన్. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా లాంఛనంగా చర్చించారు జన సేనాని.
2026 జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వా నీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ లు రాజ్యసభ ఎంపీలుగా రిటైర్ అవుతారు. ఈ నాలుగు స్థానాలు మూడు టిడిపికి, ఒకటి జనసేన కి లేదా బిజెపికి దక్కే అవకాశం ఉంది. 2026 రాజ్యసభ ఎన్నికలకు ముందు గాని, తర్వాత గాని కేంద్ర మంత్రి పదవి తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. రాజ్యసభ ఎంపీగా, క్యాబినెట్ మంత్రిగా ఉండాలని నిర్ణయించుకున్నారాయన. పవన్ ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని, బిజెపికి అనుకూలంగా పవన్ చేత ఎన్నికల ప్రచారం కూడా చేయించాలని ప్రధాని మోడీ బలంగా నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించిన ప్రయోగం సక్సెస్ అయింది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయించే ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. పవన్ సేవల్ని కేంద్రంలో అయితేనే బాగా వినియోగించుకోగలుగుతామని నరేంద్ర మోడీ నమ్ముతున్నారు. ఇదే విషయం మీద పవన్తో చర్చించినప్పుడు కేంద్ర సహాయ మంత్రి పదవి ఆఫర్ చేశారు. కానీ క్యాబినెట్ ర్యాంకు పదవి అయితేనే తాను కేంద్రానికి వస్తానని పవన్ కరాకండిగా చెప్పడంతో దాదాపుగా అదే ఖాయం అయింది.
ఇక రాష్ట్రం విషయానికొస్తే ఏ రకంగా చూసినా ఇక్కడ పవన్ కళ్యాణ్…. కూటమి ప్రభుత్వంలో సెకండ్ గ్రేడ్ స్థాయి నాయకుడు మాత్రమే. పేరుకి డిప్యూటీ సీఎం అయినా ఆ పదవికి రాజ్యాంగ హోదా అంటూ ఏమీ లేదు. ఒక మంత్రిగా బాధ్యతలు ఉంటాయి తప్ప అధికారికంగా డిప్యూటీ సీఎం అనే పదవి ఎక్కడ లేదు. విధాన నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర అంతంత మాత్రమే. అంతేకాదు రాజకీయంగా చూస్తే పవన్ పై రాష్ట్రంలో చాలా ఒత్తిడి ఉంది. కూటమి సర్కార్ని అధికారంలోకి తీసుకువచ్చే సందర్భంలో ఎక్కువమంది జనం పవన్ కళ్యాణ్ ని, ఆయన మాటల్ని విశ్వసించారు. ఓటుని టర్న్ చేయడంలో పవన్ కీలకమైన శక్తిగా వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి ఆయనపై ఒత్తిడి ఎక్కువైంది. డిమాండ్స్ ఎక్కువ అయ్యాయి. నువ్వు అలా చెప్పావు… నువ్వు ఇలా చెప్పావు…. నువ్వు ఆ హామీ ఇచ్చావ్… నువ్వు ఈ హామీ ఇచ్చావ్… ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తావ్? విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ఏం చేస్తావ్? ఇలాంటి రకరకాల ప్రశ్నలతో పార్టీలు, ప్రజలు పవన్ నిలదీస్తున్నారు. నీకోసమే కూటమికి ఓటు వేశాం అనే జనం ఎక్కువయ్యారు. ఈ ఒత్తిడి నుంచి పక్కకు తప్పుకోవాలన్నా పవన్ కున్న ఏకైక మార్గం కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్లిపోవడమే.
అంతేకాదు పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనూ, జాతీయస్థాయిలోనూ వచ్చిన పాపులారిటీని ఈసారి ఎన్నికలకి బాగా వాడుకోవాలని చూస్తుంది బిజెపి. అతనిని కేవలం ఏపీకి పరిమితం చేసి ఉపయోగం లేదని, మిగిలిన రాష్ట్రాల్లోనూ పవన్ గ్లామర్ ని వాడుకోవాలని… పవన్ ద్వారా హిందుత్వ, సనాతనధర్మ ప్రచారం చేయడం ద్వారా కామన్ అజెండా పై ఓట్లు దండుకోవచ్చు అన్నది బిజెపి వ్యూహం. ఏ రకంగా చూసిన పవన్ కేంద్రానికి వెళ్ళిపోవడం అటు బిజెపికి ఇటు పవన్ కి మేలు జరుగుతుంది.2026 రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికై కేంద్రంలో క్యాబినెట్ మంత్రి హోదాలో కూర్చుంటాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలు వస్తే తెలుగు రాష్ట్రాల తో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ బిజెపికి ప్రచారం చేస్తాడు.2029 లో ఎన్నికలు వచ్చినా ఇబ్బందు ఉండదు. బిజెపి కోసమే అప్పుడు కూడా పవన్ ప్రచారం చేయాల్సి వస్తుంది. పవన్ చిన్న అన్నయ్య నాగబాబు ఎలాగూ ఎమ్మెల్సీగా, ఏపీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటారు. కనుక పవన్ స్థానం ఇక్కడ భర్తీ అవుతుంది. రాష్ట్రంలో జనసేన వ్యవహారాలు నాగబాబు ఎలాగూ చూసుకుంటారు. కనుక పవన్ కేంద్రానికి వెళ్లిపోవడం సులువు అవుతుంది. ఇప్పుడు బిజెపితో ఉన్న బలమైన బంధం, మోడీ పవర్ ఇవన్నీ కలుపుకొని తనకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందని…. కేంద్రానికి వెళ్తే అక్కడ రాణించడానికి అవకాశం ఉంటుందని పవన్ నమ్ముతున్నారు. అంతేకాదు… ఇప్పట్లో అయితే కాంగ్రెస్ గాని, ఇండియా కూటమి గాని కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు ఏవి కనిపించడం లేదు. ఎలా చూసినా బిజెపి దాని మిత్రపక్షాలే మరికొన్నాళ్లు అధికారంలో ఉంటాయి. అందువలన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తాను కేంద్రంలో బిజెపితో కలిసి నడిస్తే ఎక్కువకాలం పవర్ లో ఉండొచ్చని పవర్ స్టార్ అనుకుంటున్నారు.
అయితే ఇదే జోరులో జనసేన ను బిజెపిలో విలీనం చేసినా ఆశ్చర్యం లేదు. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ పై ఉన్న భయంకరమైన వ్యతిరేకత, పవన్ గ్లామర్ కలసి ఒక సూపర్ వేవ్ లో జనసేన కి 21 సీట్లు, కూటమి మొత్తానికి 164 సీట్లు వచ్చాయి తప్ప ఇదే వచ్చే ఎన్నికలకు ఆ ఉధృతి ఉండకపోవచ్చు. అంతేకాదు జనసేనకు ఇప్పటికీ సంస్థగతంగా బలం లేదు. గట్టిగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోనూ సరైన క్యాడర్ కూడా లేదు. ఇవన్నీ ఆలోచించి జనసేన ను బిజెపిలో కలిపి, ఏపీకి బిజెపి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బిజెపి అధిష్టానం లో ఉంది. ఇదే విషయంపై పవన్తో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పవన్ ఎలాగూ పాత విధానాలన్నీ వదిలేసి సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు కనుక ఏపీ బీజేపీలో జనసేన ను కలిపేసి, పార్టీ బాధ్యతలు పవన్ కి అప్పగిస్తే బిజెపికి ఆ రాష్ట్రంలో జవసత్వాలు వస్తాయని బిజెపి అధిష్టానం భావిస్తోంది. ఇదే కోణంలో ఆలోచిస్తే 2026 లో పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి, జనసేన బిజెపిలో విలీనం…. రెండు పక్కాగా జరిగేట్లు ఉన్నాయి.