Top story: పెద్ద పులి కడుపున పిల్లి పుట్టిందా…? ఉద్ధవ్ పై శివ సైనికులు ఫైర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు...ఓటర్లు ఎందుకు షాకిచ్చారు ? హిందుత్వ అజెండా విషయంలో...బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి ? బద్ద వ్యతిరేకి అయినా కాంగ్రెస్‌తో కలవడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోయారా ? సీఎం పదవే శివసేనను పతనం అయ్యేలా చేసిందా ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు…ఓటర్లు ఎందుకు షాకిచ్చారు ? హిందుత్వ అజెండా విషయంలో…బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి ? బద్ద వ్యతిరేకి అయినా కాంగ్రెస్‌తో కలవడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోయారా ? సీఎం పదవే శివసేనను పతనం అయ్యేలా చేసిందా ? ఇప్పట్లో ఉద్దవ్ థాకరే శివసేన కోలుకోవడం అంత ఈజీ కాదా ? బాల్ థాకరే సిద్దాంతాలను గాలికి వదిలేసిందా ?
బాల్‌థాకరే…హిందుత్వానికి కేరాఫ్ అడ్రస్. మహారాష్ట్రలో టార్చ్‌బేరర్. కనుసైగతో మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. దేశ రాజకీయాల్లోనూ చక్రంతిప్పారు. మహామహులనే తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. హిందుత్వ అజెండాతోనే శివసేనను స్థాపించారు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. జీవితాంతం హస్తం పార్టీతో కలిసి పని చేయలేదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్బాల్లో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. అది కూడా బయటి నుంచే మాత్రమే. వేదికలు పంచుకోలేదు…ప్రభుత్వంలోనూ భాగం కాలేదు. హిందుత్వమే ప్రాణంగా బతికారు బాల్ థాకరే. ఆయన మృతితో పదవుల కోసం నేతలు కొట్లాడుకున్నారు. శివసేన రెండు ముక్కలైపోయింది. అఖరికి సింబల్ కూడా పరాధీనం అయిపోయింది. బాల్ థాకరే ఆత్మ కూడా క్షోభించే విధంగా ఉద్దవ్ థాకరే వ్యవహరించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఉద్దవ్ థాకరే వర్గానికి ఊహించని షాక్ తగిలింది. శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉద్దవ్ థాకరే పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. గతానికి భిన్నంగా దారుణమైన ఫలితాలు ఆ పార్టీని షేక్ చేశాయి. దశాబ్దాలుగా శివసేన.. బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఈ రెండు పార్టీల సిద్దాంతం ఒకటే కావడంతో చాలా ఏళ్ల పాటు వారి బంధం కొనసాగింది. కాషాయ పార్టీతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మంత్రి పదవులతో పాటు అనేక పదవులను పంచుకుంది. ఈ బంధం కలకాలం కలిసి ఉంటుందని…ఎన్నటికీ విడిపోదని శివసైనికులు భావించారు. అయితే శివసైనికులు, కార్యకర్తలు ఒకటి అనుకుంటే…ఉద్దవ్ థాకరే మరోకటి తలచారు. శివసేనను బాల్ థాకరే ఏ సిద్దాంతాలతో స్థాపించారో…వాటికి మంగళం పాడేశారు. సీఎం పదవి కోసం బద్ధశత్రువుగా భావించే కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీల సాయంతో ఉద్దవ్ థాకరే సీఎం అయ్యారు. బాల్ థాకరే జీవితాంతం హస్తం పార్టీకి ఎంత దూరంగా ఉన్నాడో…ఉద్దవ్ థాకరే అంత దగ్గరయ్యాడు. 2019 నవంబరు 28 నుంచి 2022 జూన్ 29 వరకు సీఎంగా వ్యవహరించారు. రెండు సంవత్సరాల 214 రోజుల పాటు సీఎం కుర్చీలో కూర్చున్నారు.
శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్‌నాథ్ షిండే 2022లో ఉద్దవ్‌కు ఝలక్ ఇచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. బాల్‌థాకరే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్దవ్ థాకరే ఉన్నందునే…బయటకు వచ్చినట్లు కుండబద్దలు కొట్టారు. కేంద్రంలోని కాషాయ పార్టీ ప్రభుత్వ సాయంతో…అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అలా రెండేళ్లకు పైగా షిండే నేతృత్వంలో ఎన్డీయే సర్కారు నడిచింది. తర్వాత ఉద్దవ్ థాకరే…కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. శివసేనకు పట్టున్న ప్రాంతాల్లో కూడా ఉద్దవ్ థాకరే శివసేన పట్టు నిలుపుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో 20 సీట్లకే పరిమితం అయింది. ఆ పార్టీకి సాంప్రదాయబద్దంగా అండగా ఉంటున్న హిందూ ఓటర్లు కూడా…ఆ పార్టీని ఈడ్చి కొట్టారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడాన్ని హిందుత్వ వాదులు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకిలా చేశావని ఉద్దవ్‌ను పార్టీ నేతలు ప్రశ్నించలేదు. ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ప్రతాపం చూపించారు. యూబీటీ సేన…కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. మళ్లీ కొలుకుంటుందా ? శివసేనకు పునరుజ్జీవం సాధ్యమేనా ? అనేలా గుణపాఠం చెప్పారు.
2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 186 సీట్లు వచ్చాయి. బీజేపీకి 122, శివసేనకు…63 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో శివసేన బలం.. దారుణంగా పడిపోయింది. గత ఎన్నికల్లో 56 సీట్లు వస్తే…ఈ సారి ఆ సంఖ్య 20కి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడంతో…శివసేన యుబీటీ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. గెలిచిన 20 ఎమ్మెల్యేలు…పార్టీలోనే ఉంటారా ? పక్క పార్టీ తాయీలాలకు లొంగిపోవడం పెద్ద విసయం కాదంటున్నారు. అసలే దారుణమైన ఫలితాల రావడంతో…ఆ పార్టీ జనంలోకి వెళ్తుందా ? పార్టీకి పునర్ వైభవం వస్తుందా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.