Top story: ట్రంప్ గెలుపుతో ఇండియన్ టెక్ కంపెనీల్లో ఆందోళన, H-1B వీసా నిబంధనలను మరింత కఠినం చేస్తారా ?

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికతో...ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవా ? ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే...వీసా నిబంధనల్లో కఠినమైన నిబంధనలు తీసుకొస్తారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2024 | 09:05 PMLast Updated on: Nov 18, 2024 | 9:05 PM

Top Story With Trumps Victory Indian Tech Companies Are Worried Will H 1b Visa Rules Be Tightened

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికతో…ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవా ? ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే…వీసా నిబంధనల్లో కఠినమైన నిబంధనలు తీసుకొస్తారా ? ముఖ్యంగా భారత్ ఐటీ దిగ్గజ కంపెనీలు…కఠిన పరిస్థితులు ఎదుర్కొక తప్పదా ? H-1B వీసాలపై ఆధారపడే IT కంపెనీలకు…భవిష్యత్ గడ్డుకాలమేనా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సూపర్ విక్టరీ కొట్టారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్…ఈ సారి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విదేశీయుల కారణంగా…ఒరిజినల్ అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ప్రచారంలో పదే పదే చెప్పారు. ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు…ప్రతిభావంతులను H-1B వీసాలపై అమెరికాకు పంపి…పని చేయించుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ టాలెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కారణంగా ఇండియా నుంచి వేల మంది ఐటీ నిపుణులు అమెరికా వెళ్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ తిరిగి రావడంతో ఐటీ కంపెనీలతో పాటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

H-1B వీసాలపై ఆధారపడే IT కంపెనీలకు…మరింత కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్‌ 2.O ప్రభావం ఎలా ఉంటుంది ? భారతీయులకు అనుకూలంగా వ్యవహరించకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. అమెరికాలో విద్యనభ్యసిస్తే…చదువు అయిపోగానే గ్రీన్‌ కార్డు ఇస్తామని ట్రంప్‌ గతంలో హామీ ఇచ్చారు ?దీంతో ఇప్పుడు అమలు చేస్తాడా ? లేదా ? అన్న చర్చ మొదలైంది. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్…అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ప్రధాన కారణమైంది. విదేశాంగ విధానంపై స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ భారతీయ టెక్ కంపెనీలకు గడ్డుకాలం తప్పదన్న ప్రచారం సాగుతోంది.

ఐటీ, సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి.. హెచ్1బీ వీసాలు ఇస్తారు. ప్రతీ సంవత్సరం మూడు లక్షలకు పైగా భారతీయులు.. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇందులో 11 శాతం మందికి మాత్రమే వీసాలు వస్తున్నాయి. హెచ్‌1బీ వీసా కోసం ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. పోటీ ఈ స్థాయిలో ఉండటంతో లాటరీ పద్ధతిలో హెచ్​1బీ వీసాలు మంజూరు చేస్తున్నారు. యూఎస్​లో జాబ్​ చేసే అదృష్టం అందరికీ అంత ఈజీగా రాదు. ఆ దేశంలో వర్క్ చేయాలంటే…అమెరికా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీసానే.. H1బీ వీసా అంటారు. ఈ వీసా వస్తేనే.. ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ అమెరికా వీసా ఇవ్వదు. ఆశావహులు మాత్రం లక్షల్లో ఉంటారు.

మరోవైపు ఇండియన్ టెకీలు…హెచ్‌1బీ వీసా ఇమ్మిగ్రేషన్‌ గురించి గూగుల్ లో పరిశోధిస్తున్నట్లు సమాచారం. గూగుల్‌ ట్రెండ్స్‌…ఓ నివేదికలో వెల్లడించింది. అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని, ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను కఠినతరం చేస్తానన్న ట్రంప్ కామెంట్స్ ఇందుకు కారణం. హెచ్‌1బీ వీసా గురించి సెర్చ్‌ చేస్తున్న ప్రాంతాల్లో మొదటి స్థానంలో తెలంగాణ , చండీగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక, తమిళనాడు వరుస స్థానాల్లో ఉన్నాయి. అటు ఇదే సమయంలో అమెరికాకు చెందిన కొందరు…ట్రంప్‌ పాలనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. దేశాన్ని వీడి ఎలా వెళ్లాలి ? అనే అంశంపై గూగుల్ లో వెతుకుతున్నారు. ట్రంప్‌ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కు…నిషేధిస్తారంటూ ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. దీంతో కెనడా, స్కాట్లాండ్‌తో సహా ఇతర దేశాల్లో పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు సమాచారం.