ట్రంప్ ఎఫెక్ట్… మనోళ్లు ఇక ఇంటికే….ఎక్కువ మంది తెలుగోళ్లే

డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారంలోకి రాకముందే డేంజర్ వేవ్స్ మొదలయ్యాయి. ఎంతమందిని బలవతంగా వెనక్కు పంపించేస్తారన్న లెక్కలు బయటకు వచ్చేస్తున్నాయి. అందులో ఎక్కువగా ఇండియన్లు అందులోనూ తెలుగోళ్లే ఎక్కువగా ఉండటం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2024 | 01:10 PMLast Updated on: Dec 17, 2024 | 1:10 PM

Trump Effect On Telugu People In America

డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారంలోకి రాకముందే డేంజర్ వేవ్స్ మొదలయ్యాయి. ఎంతమందిని బలవతంగా వెనక్కు పంపించేస్తారన్న లెక్కలు బయటకు వచ్చేస్తున్నాయి. అందులో ఎక్కువగా ఇండియన్లు అందులోనూ తెలుగోళ్లే ఎక్కువగా ఉండటం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఆశల స్వర్గంలో అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లినవాళ్లు ఇప్పుడు బలవంతంగా స్వదేశానికి వచ్చే పరిస్థితి… ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18వేల మంది ఇండియన్స్ ను దేశం నుంచి వెళ్లగొట్టబోతున్నారు ట్రంప్.

మీవాళ్లు ఎవరైనా అమెరికాలో ఉన్నారా…? ఉంటే వారి దగ్గర సరైన పత్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోమనండి. ఏ మాత్రం తేడా ఉన్నా తట్టాబుట్టా సర్దుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఎక్కనంటే కుదరదు. అక్కడ ట్రంప్ కొరడా పట్టుకు కూర్చున్నారు. మనవాళ్లని తన్ని తగలేసేలా ఉన్నాడు. అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇల్లీగల్ గా ఉంటున్న వారిని వెనక్కు పంపేందుకు రెడీ అయిపోయింది ట్రంప్ యంత్రాంగం. మొదటి జాబితా కింద 18వేల మంది ఇండియన్స్ ను డిపోర్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువమంది గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ కు చెందినవారేనని తెలుస్తోంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్్మెంట్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం ఈ ఏడాది నవంబర్ వరకు 17వేల 940మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు తేల్చారు. వీరంతా లీగల్ స్టేటస్ కోసం వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది వీరి కేసులు విచారణకు రానున్నాయి. ఈలోపే వీరిని అమెరికా నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు ట్రంప్. గత మూడేళ్లలో 90వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. వీరు కాకుండా ఇంకా ఎంతోమంది నిఘా కళ్లుగప్పి అమెరికాలోకి ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు వారందరి భవిష్యత్తూ ప్రశ్నార్థకమే. ఇలా పట్టుబడ్డ వారిలో ఎక్కువమంది గుజరాత్, పంజాబ్ ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మనవాళ్లలో చాలామంది తమవారితో పాటు అమెరికా వెళ్లి సరైన పత్రాలు లేకపోయినా అక్కడే ఉండిపోయారు. మరికొంతమంది కెనడా మీదుగా అమెరికాలో అడుగుపెట్టారు. ఇంకొందరు మాఫియా సహకారంతో అగ్రరాజ్యం చేరారు. వీరిలో చాలామంది తమను లీగలైజ్ చేయాలని అప్పీల్ చేసుకున్నారు. వారిలో కొందరిని అమెరికా కరుణిస్తే చాలామందిని పక్కనపెట్టింది. త్వరలో మరికొందరి విజ్ఞప్తుల పరిశీలన జరగనుంది. కానీ ట్రంప్ దూకుడు చూస్తుంటే అక్కడి వరకు వచ్చేలా లేదు.

డిపోర్టేషన్ కు ఇండియా సహకరించడం లేదని అమెరికా అధికారులు అంటున్నారు. భారత్ ను నాన్ కోఆపరేటివ్ జాబితాలో చేర్చారు. సరిగా స్పందించడం లేదని, డిపోర్టింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తోందని భారత్ పై ఆరోపణలు చేస్తున్నారు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అఫిషియల్స్. అక్కడ పట్టుబడ్డ భారతీయులతో సమావేశం కావడం, వారు ఎక్కడివారో తేల్చడం, వారిని తిరిగి స్వదేశానికి తిరిగి తీసుకురావడం వంటివి మన వాళ్లు సరిగా చేయడం లేదన్నది అమెరికా ఆరోపణ. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరినీ ఓ చోట చేరుస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అందరినీ మూకుమ్మడిగా విమానాల్లో ఇండియాకు తరలించాలన్నది ప్లాన్.

అసలు అమెరికాలో ఎంతమంది విదేశీయులు సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారన్న లెక్కలు తీస్తున్నారు. దాని ప్రకారం మనవాళ్లు దాదాపు 18వేల మంది ఉంటే చైనావాళ్లు దాదాపు 38వేల మంది ఉన్నారు. అంటే మనకంటే రెట్టింపు అన్నమాట. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న 208 దేశాల లిస్టు తీస్తే అందులో మనది 13వ స్థానం. మనల్ని, చైనాను పక్కన పెడితే టాప్-15లోని మిగిలిన 13 దేశాలు అమెరికాతో సరిహద్దులు ఉన్నవే. మొత్తంగా చూస్తే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారి వివరాలు ఇప్పటివరకు వెల్లడైనది దాదాపు 15లక్షలట. ఇందులో అమెరికా పక్కనే ఉండే హోండరస్ వాసులే రెండున్నర లక్షలకంటే ఎక్కువ. అయితే ఇంకా తనిఖీలు జరిపితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్నది అంచనా… ఇదంతా కూడా సరైన పత్రాలు లేకుండా ఉన్నవారి సంగతి. ఇది కాకుండా డెమొక్రాట్ల పాలన సమయంలో చాలామంది అమెరికా చేరుకున్నారు. వారిలో చాలామంది ఏదో రూపంలో పత్రాలు పొంది అమెరికాలో ఉండిపోయారు. తర్వాత తర్వాత వారిని కూడా ఏరివేయాలన్నది ట్రంప్ ఆలోచన.

ట్రంప్ దెబ్బకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మాత్రమే కాదు చదువుకోసం వెళ్లిన వారికి కూడా ముప్పు తప్పేలా లేదు. మనవారిలో చాలామంది అక్కడ చదువుకుని దొడ్డిదారిన ఏదో ఓ ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగురాళ్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వారందరికీ డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. చదువు పూర్తైన తర్వాత కొద్దికాలం మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉంది. ఈలోపు అక్కడే ఉండాలంటే H1B వీసా పొందాల్సి ఉంటుంది. కానీ చాలామందికి అదిలేదు. ఆ లాటరీలో తమకు అదృష్టం దక్కకపోదా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారంతా వెనక్కు రావాల్సి ఉంటుంది. ట్రంప్ అధికారంలోకి రాగానే తమపై కొరడా పెడతారని అమెరికా సంస్థలకు తెలుసు. అందుకే అక్రమంగా తమ దగ్గర పనిచేస్తున్న వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ జీతం, ఎక్కువ పని చేసేది మనవాళ్లే. కాబట్టి బాగానే వాడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీరిని ఉద్యోగంలో ఉంచుకుంటే అది తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిపోతున్నారు. వీరిని కూడా లెక్కెస్తే లక్షల్లోనే స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ మనవాళ్లందరికీ సూటుబూటులో ఉన్న యమధర్మరాజులా కనిపిస్తున్నాడు. చెప్పినా వినడు… బతిమాలినా పట్టించుకోడు.. తాను చేయాలనుకున్నదే చేస్తాడు.