ట్రంప్ రష్యా సీక్రెట్ ఏజెంటా…!

ఓ వ్యక్తి పక్కదేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడి పౌరుడిగా మారిపోతాడు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి కీలక పొజిషన్‌కు చేరుకుంటాడు. తన స్వదేశం తరుపున గూఢచర్యం చేస్తాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 12:15 PMLast Updated on: Mar 06, 2025 | 12:15 PM

Trump Is A Secret Agent Of Russia

ఓ వ్యక్తి పక్కదేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడి పౌరుడిగా మారిపోతాడు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి కీలక పొజిషన్‌కు చేరుకుంటాడు. తన స్వదేశం తరుపున గూఢచర్యం చేస్తాడు. ఇది సినిమాల్లో కనిపించే సీన్. కానీ కాస్త అటూ ఇటుగా అలాంటి సీనే అమెరికాలో రిపీట్ అయ్యిందన్నది ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఒకప్పటి రష్యా సీక్రెట్ ఏజెంట్ అంటూ సెన్సేషనల్‌ స్టోరీ బయటకొచ్చింది. రాజకీయాల్లోకి రాకముందు ట్రంప్ రష్యా ఏజెంట్‌గా పనిచేశారన్నది దాని సారాంశం. ఓ మాజీ సోవియట్ అధికారి పెట్టిన పోస్టును ఆధారంగా చూపుతూ కథనాలు వస్తున్నాయి.

సోవియట్ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన అల్నూర్‌ ముస్సాయేవ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ బిజినెస్‌మెన్‌గా ఉన్న సమయంలో అంటే 1980ల్లో ఆయన్ను రష్యా ఏజెంట్‌గా నియమించుకున్నట్లు చెప్పారు. అప్పట్లో ట్రంప్‌కు కోడ్‌ నేమ్‌ క్నస్నోవ్ అట. అమెరికాకు సంబంధించిన కీలక సమాచారన్ని ట్రంప్ రష్యాకు చేరవేశారని అంటున్నారు. ఇప్పుడు దాన్ని గుప్పిట్లో పెట్టుకుని ట్రంప్‌ను పుతిన్ ఆడిస్తున్నట్లు మంచి మసాలా స్టోరీ నడుస్తోంది.

ట్రంప్ రష్యా సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేశారో లేదో తెలియదు కానీ అది నిజమనేలా పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు రష్యాకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పట్లో ట్రంప్ గెలిచి హిల్లరీ ఓడిపోవడానికి రష్యానే కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ట్రంప్‌ను గెలిపించడానికి పుతిన్ కుట్ర చేశారని కూడా చెబుతారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ పూర్తిగా రష్యాకు సరెండర్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచమంతా ఉక్రెయిన్‌కు మద్దతిస్తుంటే ట్రంప్ దాన్ని రోడ్డున పడేశారు. రష్యా దురాక్రమణను సపోర్ట్ చేసేలా వ్యవహరిస్తున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ జెలెన్‌స్కీపై ఒత్తిడి తెస్తున్నారు కానీ పుతిన్ జోలికి వెళ్లడం లేదు. యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ బాగానే ఉన్నాడు కానీ నష్టపోయిన ఉక్రెయిన్‌ను ట్రంప్ చావగొడుతున్నారు. అంతెందుకు గతవారం ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా తన మిత్రదేశాలు బలపరిచిన తీర్మానాన్ని కూడా అమెరికా తోసిపుచ్చడం చాలామందికి షాక్ ఇచ్చింది.

1960-90 మధ్య అప్పటి USSR- అమెరికా మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఆ సమయలో ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశారు. సీక్రెట్ ఏజెంట్లను నియమించుకుని రహస్య సమాచారాన్ని కొట్టేసేవారు. అలాగే శత్రుదేశంలోని వ్యాపారవేత్తలను తమవైపు తిప్పుకుని వారి ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకునేవారు. అలాగే ట్రంప్‌ను కూడా రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న ట్రంప్‌ అప్పట్లో మాస్కోలో ఓ హోటల్ పెట్టడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ పర్యటించారు. ఆ ట్రిప్‌ను కూడా రష్యానే స్పాన్సర్ చేసిందని ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఏజెంట్‌గా ఉన్న సమయంలో ట్రంప్ ఆర్థికంగా లాభపడినట్లు తెలుస్తోంది. అందులో తప్పులేదు కానీ ఆయన్ను లోబరుచుకోవడానికి రష్యా అమ్మాయిలను ఎరవేసి ఉండొచ్చంటున్నారు. ఆ గుట్టు మొత్తం రష్యాకు తెలుసని, పక్కా ఆధారాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.

అందుకే ట్రంప్ రష్యాకు జీ హుజూర్ అంటున్నారని లేటెస్ట్ స్టోరీలు చెబుతున్నాయి. మాములుగానే ట్రంప్ విలాసపురుషుడు. వయసులో ఉన్నప్పుడు చాలామందితోనే తిరిగాడు. దానికి సంబంధించిన ఓ కేసు కూడా నడుస్తోంది. ట్రంప్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. మొదటిసారి అధికారం చేపట్టే సమయంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి సెన్సెషన్ అయ్యింది. ట్రంప్‌కు సంబంధించిన సెన్సెటివ్ ఇన్ఫర్‌మేషన్ రష్యా దగ్గర ఉందని ఆ రిపోర్ట్‌లో ఉంది. ఓ సెక్స్ వర్కర్‌తో ట్రంప్ నడిపిన రాసలీలల వీడియోగా చెప్పే గోల్డెన్ షవర్ టేప్ రష్యా దగ్గర ఉన్నట్లు ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బయటపెట్టాడు. అలాగే 2021లో కూడా మాజీ KGB ఏజెంట్ ఒకరు ట్రంప్ తమ పేరోల్‌లో ఉండేవారని చెప్పాడు. అలాగే ట్రంప్‌కు అప్పట్లో రష్యా కుబేరులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సాయం చేశారని ట్రంప్… ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటన్నారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి.

నిజంగా ట్రంప్ రష్యా ఏజెంట్‌గా పనిచేశారా అంటే దానికి స్పష్టమైన సాక్ష్యాలు లేవు. అన్నీ అనుమానాలే కానీ ఆధారాలు ఏమీ లేవు. పోనీ ఆయన అలా పనిచేస్తే అమెరికా నిఘా సంస్థలు పట్టుకోలేదా అన్నది ఓ ప్రశ్న. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫ్‌బీఐ పూర్తిగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశీలించే ఉంటుంది. అలాంటప్పుడు రష్యన్ లింకులు బయటపడకుండా ఉంటాయా అన్నది మరో ప్రశ్న. అవి బయటకు రాకుండా ట్రంప్ జాగ్రత్త పడి ఉంటారన్నది మరో వాదన. మొత్తానికి ట్రంప్ చుట్టూ ఓ జేమ్స్ బాండ్ స్టోరీ నడుస్తోంది. మరి నిజాలు ఎప్పటికి బయటకు వస్తాయో చూడాలి…!