భారత్‌పై దయ చూపించానన్న ట్రంప్.. కౌంటర్ స్ట్రాటజీతో షాకిచ్చిన ఇండియా

ఇండియా గ్రేట్ కంట్రీ అంటాడు, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అనీ చెబుతాడు.. టారిఫ్స్ విషయంలో చైనా, కెనడాను హ్యాండిల్ చేసినట్టు భారత్‌ను చేయం అని కూడా ప్రకటించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2025 | 11:55 AMLast Updated on: Apr 03, 2025 | 11:55 AM

Trump Said He Showed Kindness To India India Shocked With Counter Strategy

ఇండియా గ్రేట్ కంట్రీ అంటాడు, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అనీ చెబుతాడు.. టారిఫ్స్ విషయంలో చైనా, కెనడాను హ్యాండిల్ చేసినట్టు భారత్‌ను చేయం అని కూడా ప్రకటించాడు. కట్‌చేస్తే.. లిబరేషన్ డే రోజు భారత్‌పై భారీ సుంకాలు విధించి తాను పక్కా బిజినెస్ పర్సన్ అని నిరూపించుకున్నాడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ.. 26శాతం టారిఫ్స్ సంధించి జాదూ నెంబర్ వన్ అనిపించుకున్నాడు ట్రంప్. కానీ, ఇక్కడితో అంతా అయిపోయినట్టుకాదు.. ఇల్లు అలకగానే పండగా కాదు అమెరికా షేక్ కావడం ఖాయం. ఇంతకూ, ట్రంప్ విధించిన 26శాతం పన్నులు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపించబోతు న్నాయి? ట్రంప్ టారిఫ్స్‌ను తిప్పికొట్టడానికి మోడీ సర్కార్ దగ్గరున్న ఆ రెండు ఆప్షన్లేంటి? టాప్ స్టోరీలో చూద్దాం..

2025 ఏప్రిల్ 2ను అమెరికా లిబరేషన్ డేగా పిలుస్తూ.. అన్ని దిగుమతులపై 10శాతం బేస్‌లైన్ సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. భారత్‌పై 26శాతం, చైనాపై 34శాతం డిస్కౌంటెడ్ రెసిప్రొకల్ టారిఫ్స్ విధించారు. ఈ సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వస్తాయి, దేశాల వారీగా అధిక సుంకాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయి. తన నిర్ణయాన్ని ట్రంప్ అగ్రరాజ్యం ఆర్థిక స్వాతంత్ర్య ప్రకటనగా అభివర్ణించారు. భారత్ గురించి మాట్లాడుతూ, గతంలో ఇండియాను “టారిఫ్ కింగ్” అని పిలిచినా, ఈసారి భారత్‌పై 26శాతం సుంకాలు విధిస్తూ “కాస్త దయ చూపామని చెప్పారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై విధించే టారిఫ్స్‌కు సగం మాత్రమే వసూలు చేస్తున్నామని అన్నారు. ఈ సుంకాలు భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఔషధాలు, ఆటోమొబైల్స్, జ్యువెలరీ వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషఇస్తున్నారు. సిటీ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ సుంకాల వల్ల భారత్ సంవత్సరానికి ఏడు బిలియన్ డాలర్ల నష్టాన్ని చూడవచ్చని అంచనా.

చైనాపై 34శాతం సుంకాలు విధిస్తూ, దాని ఆర్థిక విస్తరణను అడ్డుకోవడంతో పాటు, అమెరికా కార్మికులను రక్షించడమే లక్ష్యమని ట్రంప్ చెప్పారు. అదనంగా, చైనా ద్వారా చౌకగా దిగుమతి అయ్యే వస్తువులను నియంత్రించేందుకు “డీ మినిమిస్ లూప్‌హోల్”ను మూసివేసే ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యంలో అలజడి సృష్టించింది. యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24శాతం, యూకేపై 10శాతం టారిఫ్స్ విధించారు. మరోవైపు.. ట్రంప్ టారిఫ్స్‌పై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి.. ట్రంప్‌ సుంకాలు మన దేశంపై ఎంత ప్రభావం ఉండవచ్చు అనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. 26శాతం సుంకాలను తాము ఎదురుదెబ్బగా భావించడం లేదని పేర్కొన్నారు. అమెరికా పన్నులను తగ్గించుకోడానికి ట్రంప్ విధించిన టారిఫ్ రూల్స్‌లోనే కీలక నిబంధన ఉంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్‌ యంత్రాంగం పరిశీలిస్తారు. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే తప్ప.. ఎదురుదెబ్బ కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు.. భారత్‌కు ఈ సుంకాల వల్ల నష్టం కలుగుతుందా అనే ప్రశ్నపై నిపుణులు రెండు వైపులా వాదిస్తున్నారు. ఒకవైపు, భారత ఎగుమతులు అమెరికా మార్కెట్‌లో ఖరీదైనవిగా మారి డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు, చైనాపై అధిక సుంకాల వల్ల భారత్ టెక్స్‌టైల్స్, తయారీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాము విధించిన సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు తీసుకోవద్దని అమెరికా ఖజాన శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. అంటే ఏంటి అర్థం. ట్రంప్ ఎన్ని సుంకాలైనా వేసేయవచ్చు గానీ.. భారత్ లాంటి దేశాలు తిరిగి సుంకాలు పెంచకూడదు. ట్రంప్ నిర్ణయాన్ని సూపర్ అని మెచ్చుకోవాలి. ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్నలొస్తున్నాయి. అయితే, అమెరికా ఖజాన శాఖ అధికారి ఊరికే ఈ వార్నింగ్ ఇవ్వలేదు. గతంలో ట్రంప్ టారిఫ్స్ దారుణంగా బెడిసికొట్టాయి కాబట్టే. మరీ ముఖ్యంగా ట్రంప్ ప్రతీకార పన్ను నిర్ణయాన్ని ఇండియా ఊహించని విధంగా తిప్పికొట్టింది.

టారిఫ్స్ విషయంలో ట్రంప్ యాక్షన్ మొదలైంది ఇప్పుడు కాదు. తన ఫస్ట్ టర్మ్‌లోనే ప్రతీకార పన్నుతో ప్రపంచాన్ని పరేషాన్ చేశాడు. భారత ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను రద్దు చేసింది ట్రంపే. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్‌ హోదాతో ఇతర దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్నివస్తువులు ఎగుమతి చేయొచ్చు. కానీ భారత్ అధిక సుంకాలు విధించి అమెరికా మార్కెట్లకు తగిన యాక్సెస్ ఇవ్వడంలేదని ఆరోపిస్తూ జీఎస్‌పీ హోదాను రద్దు చేశారు ట్రంప్. దీనికి బదులుగా భారత్ కొన్ని రకాల వస్తువులపై సుంకాలను పెంచింది. భారత్ చర్యతో ట్రంప్‌కు అమెరికాలో బలమైన మద్దతు దారులైన గ్రామీణులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ చట్టసభలకు చెందిన ప్రతినిధులే తప్పుపట్టారు. ఇండియాకు జీఎస్‌పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానేగాక, ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని 44మంది అమెరికన్ చట్ట సభ్యులు వివరించారు. జీఎస్‌పీ హోదా రద్దుతో అధిక సుంకాలు వేసినప్పటికీ రెండు నెలల్లో ఇండియా నుంచి 40శాతం దిగుమతులు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతేగాక, ఇవన్నీ గతంలో GSP అర్హత కలిగిన వస్తువులేనని వాపోయారు. ఈ పరిణామం అప్పట్లో ట్రంప్‌ను తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ అనుభవంతోనే అమెరికా ఖజాన శాఖ అధికారి ట్రంప్ టారిఫ్స్‌పై ప్రతీకారానికి దిగొద్దు అని బెదిరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ విషయంలో భారత్ దగ్గరున్న రెండో ఆప్షన్ కూడా ఇదే. మరి మొదటి ఆప్షన్ ఏంటి అంటారా.. ట్రంప్ పాలకవర్గంతో చర్చలు. అవి వర్క్‌ఔట్ కాకపోతే.. 2019 నాటి స్ట్రాటజీకి మళ్లీ పదునుపెట్టకతప్పదు.