Top story: ట్రంప్ దెబ్బ… బంగారం అబ్బా….! పెరుగుద్దా… పడుద్దా..?

ఎగిరెగిరి పడ్డ బంగారం ట్రంప్ దెబ్బకు బేర్ మంటోంది. రెండ్రోజుల్లో రెండు వేలు తగ్గింది. పసిడి మిడిసిపాడుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బ్రేక్ వేశాయి. మరి ఈ బ్రేకప్ తాత్కాలికమేనా...? లేక మళ్లీ కాలరెగరేస్తుందా...? బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2024 | 03:30 PMLast Updated on: Nov 08, 2024 | 3:30 PM

Trump Victory Affects On Gold Rate

ఎగిరెగిరి పడ్డ బంగారం ట్రంప్ దెబ్బకు బేర్ మంటోంది. రెండ్రోజుల్లో రెండు వేలు తగ్గింది. పసిడి మిడిసిపాడుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బ్రేక్ వేశాయి. మరి ఈ బ్రేకప్ తాత్కాలికమేనా…? లేక మళ్లీ కాలరెగరేస్తుందా…? బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా..?

బంగారం… అబ్బో కొన్ని రోజులుగా అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయింది. కొనాలన్న ఆలోచన వస్తేనే గుండెపోటు వచ్చేలా దూసుకుపోయింది. 10గ్రాముల బంగారం ధర 80వేలు దాటిపోయింది. ఇక నెక్స్ట్ లక్ష దగ్గరే ఆగుతానని శపథాలు కూడా చేసేసింది. జనం కూడా అదే ఫిక్సయిపోయారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో బంగారం దూకుడుకు బ్రేక్ పడింది. రెండ్రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. 10గ్రాముల ధర 2వేలకు పైగా తగ్గింది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ప్రపంచ సమీకరణాలు మారిపోతున్నాయి. రాజకీయ, ఆర్థిక, భౌగోళిక సమస్యలకు సరికొత్త పరిష్కారం దక్కుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు కుదురుకుంటున్నాయి. గత కొంత కాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఏ క్షణమైనా మాంద్యం ముసుర్లు కమ్ముకోవచ్చన్న ఆందోళన నెలకొంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో పాటు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆహార ధాన్యాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కట్టడి కాకపోవడం వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సతమతమైంది. దీంతో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనం బంగారం వైపు మళ్లారు. బంగారం ధరలో ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ ఒకేసారి పడిపోవు. గత కొన్ని దశాబ్దాలుగా సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు మంచి రాబడినే ఇచ్చాయి, స్టాక్స్ వంటివి నష్టపోయాయి కానీ బంగారం మాత్రం ముంచలేదు. పైగా ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్య లోహం పుత్తడి. అందుకే దాని డిమాండ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఏ స్థాయిలో పెరిగిందంటే సామాన్యులు దానివైపు చూడాలంటేనే భయపడే స్థాయిలో దూకుడు ప్రదర్శించింది. ప్రపంచంలో ఏ మూల ఏ మిస్సైల్ పేలినా బంగారం రాకెట్ స్థాయిలో పెరిగిపోయింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర అక్టోబర్ చివర్లో 2801డాలర్లకు చేరింది. ట్రంప్ గెలుస్తారన్న అంచనాలతో అప్పట్నుంచి కాస్త తగ్గింది. ఔన్సు బంగారం దాదాపు 130డాలర్లు తగ్గిపోయింది.

2023 అక్టోబర్ 30న హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 62వేల 630. ఈ ఏడాది అక్టోబర్ 30న పసిడి ధర రూ.84 వేల 128 రూపాయలు. అంటే ఏడాదిలో ఏకంగా 22వేల రూపాయలు పెరిగింది. అలాగే 22క్యారెట్ల బంగారం గతేడాది అక్టోబర్ 30న 57వేల 410 రూపాయలు. ఈ ఏడాది అది 77వేల 118 రూపాయలు. ఇది కూడా 20వేల రూపాయల వరకు పెరిగిపోయింది. ఈ స్థాయి రిటర్న్స్ ఏ ఇతర పెట్టుబడి సాధనమూ ఇవ్వలేదు. దీనిబట్టే బంగారానికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ గెలుపు ఆపరేషన్ లాంటిదని ప్రపంచం భావించింది. తాను గెలిస్తే యుద్ధాలు ఆగిపోయేలా చేస్తానని ట్రంప్ ప్రచారంలో హామీ ఇచ్చారు. అమెరికా మాంద్యం బారిన పడకుండా చూస్తానని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు పనిచేశాయి. ఇప్పుడు ట్రంప్ గెలవడంతో ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటుందని అంతా భావించారు. వెంటనే డాలర్ కూడా నాలుగేళ్ల స్థాయికి చేరింది. అది మరింత బలపడనుంది. ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుందని మదుపరులు భావించడంతో వారు మెల్లగా బంగారం నుంచి డాలర్, ఇతర పెట్టుబడి సాధనాలవైపు మళ్లారు. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గిపోయింది. అందుకే ధర తగ్గుతోంది. మరికొన్ని రోజుల పాటు బంగారం ఇదే స్థాయిలో ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాస్త ఒడిదుడుకులు ఉంటాయని అయితే భారీ స్థాయిలో కరెక్షన్ ఉండదన్నది వారి అంచనా. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గిస్తే కాస్త పెరిగే అవకాశాలున్నా అది కూడా భారీగా ఉండే అవకాశాల్లేవు. ఎందుకంటే ట్రంప్ విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచేవిగా ఉంటాయి. గతంలో అలాగే జరిగింది. అలాంటి సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై పునరాలోచనలో పడొచ్చు. వడ్డీరేట్లు తగ్గకపోతే మదుపరులు బంగారం కంటే బాండ్లవైపు చూస్తారు. ఇది కూడా పసిడి ధరను నియంత్రిస్తుంది. ట్రంప్ పగ్గాలు చేపట్టి తన ఆర్థిక విధానాలు బయట పెట్టే వరకు మదుపరులు వెయిట్ అండ్ సీ పాలసీతోనే ఉంటారు. అంటే అప్పటివరకు పుత్తడికి పగ్గాలు పడ్డట్టే.

ట్రంప్ గెలిచినంత మాత్రాన పూర్తిగా బంగారం ధర పడిపోతుందనో లేక అక్కడే ఉంటుందనో చెప్పలేం. ట్రంప్ తన విధానాలు ప్రకటించేవరకు మాత్రం కాస్త కంట్రోల్ లో ఉంటుంది అంతే. మనం బంగారం దిగుమతి చేసుకోవాలంటే డాలర్ల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు డాలర్ బలపడితే మన రూపాయి విలువ కాస్త తగ్గుతుంది. ఫలితంగా ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చూసినా మన దగ్గర బంగారం ధర భారీగా తగ్గదు. కొందరు నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ప్రస్తుతానికి మాత్రమే కాస్త శాంతిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికం నుంచే బంగారం మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే వచ్చే ఏడాది చివరకు 10గ్రాముల బంగారం 90వేలు లేదా అంతకంటే ఎక్కువకు చేరొచ్చన్నది నిపుణుల అంచనా. కాబట్టి మదుపరులు తక్కువలో బంగారం తీసుకుంటే మంచిదే. ఇంకా తగ్గితే మరికొంత తీసుకోవచ్చు. కానీ బంగారం భవిష్యత్తుకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు.