కిమ్‌తో దోస్తీకి సిద్ధమైన ట్రంప్.. ఇద్దరూ కలిస్తే ఇక విధ్వంసమే..!
కిమ్ జోంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్.. ఈ ఇద్దరిలో ఒకరు ఆధునిక డిక్టేటర్, నార్త్ కొరియా అధినేత.. మరొకరు టెంపర్‌కు కేరాఫ్ అడ్రస్, అగ్రరాజ్యాధిపతి. పైగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే స్థాయి శత్రుత్వం ఉంటుంది..
కిమ్ జోంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్.. ఈ ఇద్దరిలో ఒకరు ఆధునిక డిక్టేటర్, నార్త్ కొరియా అధినేత.. మరొకరు టెంపర్‌కు కేరాఫ్ అడ్రస్, అగ్రరాజ్యాధిపతి. పైగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే స్థాయి శత్రుత్వం ఉంటుంది.. దాదాపు ఆరేళ్ల క్రితం ఇద్దరి మధ్య యుద్ధం ఒక్కటే బ్యాలెన్స్ అనే పరిస్థితులు కనిపించాయి. అమెరికాపై అణుదాడి చేస్తానని కిమ్, దేనికైనా రెఢీ అని డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ యుద్ధం వరకూ వెళ్లారు. కట్‌చేస్తే.. రెండోసారి పవర్‌లోకి వచ్చిన ట్రంప్, కిమ్ చాలా స్మార్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేనా, త్వరలోనే నార్త్ కొరియా అధినేతతో భేటీ అవుతాననీ ప్రకటించారు. దీంతో ఈ ట్విస్ట్ ఏంటో అర్ధంకాక తల పట్టుకోవడం ప్రపంచం వంతవుతోంది. మిత్రదేశాలను సైతం తన టెంపర్ తో భయపెడుతున్న ట్రంప్.. కిమ్ విషయంలో ఇంత పాజిటివ్‌గా ఉండటం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇంతకూ, కిమ్ విషయంలో ట్రంప్ పాజిటివ్ రియాక్షన్‌కు రీజనేంటి? ఈ ఇద్దరు సమావేశమైతే దేని గురించి చర్చిస్తారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
“అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం.. అణ్వాయుధ దళాలూ సిద్ధమే”.. సరిగ్గా మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్ పీక్స్‌కు చేరుకున్న వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపాయి. అంతేనా, అణు వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. అక్కడితోనూ ఆగలేదు.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమెరికా నాటి విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ సౌత్ కొరియా, జపాన్‌లో పర్యటించిన సమయంలో మరో డెడ్లీ మిస్సైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. దీంతో అగ్రరాజ్యం కొత్త పాలక వర్గానికీ కిమ్ ఏదో గట్టి సందేశమే ఇస్తున్నారనే చర్చ అంతర్జాతీయంగా జరిగింది. నిజమే కిమ్ అమెరికాలో ఎవరు పవర్‌లోకి వచ్చినా డోంట్ కేర్ అని చెప్పేందుకే పదే పదే క్షిపణి పరీక్షలు నిర్వహించా రు. అవసరమైతే అమెరికాతోనూ యుద్ధం చేస్తామనే సంకేతాలు ఇచ్చారు.
ఇక ట్రంప్ విషయానికొద్దాం.. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ చర్యలు ఊహాతీతంగా సాగుతున్నాయి. వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేదు, మిత్రుడా, శత్రువా అన్న పట్టింపూ లేదు.. మనసులో ఏది రైట్ అనిపిస్తే అదిచేస్తూ ముందుకెళుతున్నారు. అలాంటిది పనికట్టుకుని అమెరికాతో యుద్ధానికి సిద్ధం అన్న కిమ్‌తో ఇంకెంత కఠినంగా వ్యవహరించాలి? అందుకే ట్రంప్ సీన్‌లోకి వచ్చిన తర్వాత కిమ్‌కు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావించారు. కానీ, అందరూ అనుకున్నది చేస్తే అది ట్రంప్ ఎలా అవుతారు? కిమ్ విషయంలోనూ అదే జరిగింది. ఉత్తర కొరియా అధినేతను బద్ధ శత్రువుగా చూస్తారనుకున్న వేళ ‘కిమ్ చాలా స్మార్ట్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేనా కిమ్‌తో సమావేశమవుతాననీ ప్రకటించి ప్రపంచాన్ని షేక్ చేసేశారు. దీంతో 2018కి ముందు కిమ్ అంతుచూస్తానని హెచ్చరించిన ఆ డొనాల్డ్ ట్రంపేనా ఈ మాట చెబుతోంది అని ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఐతే, ఈ ఇద్దరు లీడర్లు భేటీ కావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో రెండు సార్లు సమావేశమయ్యారు.
2016లో పవర్‌లోకి వచ్చిన తర్వాత ట్రంప్, కిమ్ రింగులో ఉన్న బాక్సర్లలా వ్యవహరించేవారు. దాదాపు రెండేళ్లపాటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్.. అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ మధ్య మాటల యుద్ధం ఎక్కడ రియల్ వార్‌గా మారుతుందో అని ప్రపంచం ఆందోళన చెందింది. చివరికి డైలాగ్ వార్‌కు ముగింపు పలుకుతూ తొలిసారిగా ట్రంప్-కిమ్ మధ్య 2018లో సింగ్‌పూర్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. తర్వాత 2019లో వియత్నాంలో మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు విఫలమైనా కిమ్ విషయంలో ట్రంప్ మనసు మారింది మాత్రం ఆ భేటీలోనే. ఆ తర్వాత ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం కిమ్ విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి కిమ్ చాలా స్మార్ట్ అంటున్నారు.
నిజానికి.. బైడెన్ అధికారంలో ఉన్నంత కాలం అమెరికా, నార్త్ కొరియా మధ్య దూరం బాగా పెరిగింది. ఇటీవల అగ్రరాజ్యం విషయంలో కిమ్ వైఖరి మరింత కఠినంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి వ్యక్తిగత దౌత్యాలు నడపకూడదని ఆయన నిర్ణయించారు. అందుకు కారణంఉభయ కొరియాల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు తీవ్రం కావడమే. గతేడాది వరుసగా ప్యోంగ్యాంగ్ క్షిపణి పరీక్షలు చేయడం, చెత్త బెలూన్లు పంపడం వంటి కవ్వింపు చర్యలతో సియోల్‌తో సంబంధాలు పూర్తిగా దిగజారాయి. సౌత్ కొరియాకు అమెరికా అండగా నిలవడం కిమ్‌కు అస్సలు నచ్చడం లేదు. ఇలాంటి టైం లో తర్వలో కలుస్తా అన్న ట్రంప్ ప్రకటనపై కిమ్ ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ ట్రంప్‌తో భేటీకి కిమ్ ఓకే చెప్తే మాత్రం సౌత్ కొరియాలో వణుకు మొదలవ్వడం ఖాయం. ఎందుకంటే కిమ్, ట్రంప్ మధ్య దోస్తీ మొదలైతే సియోల్‌కు మొదటికే మోసం వస్తుంది. అసలే ట్రంప్ ఏ దేశానికి సైనిక సాయం చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కిమ్, ట్రంప్ మధ్య స్నేహం చిగురిస్తే సౌత్ కొరియాను గాలికొదిలేసే ప్రమాదం లేకపోలేదు. మరి ఈ ఇద్దరు లీడర్లు చివరికి ఎలాంటి ట్విస్టులు ఇస్తారో చూడాలి.https://www.youtube.com/feed/you