అట్లుంటది ట్రంప్ తోని, ముసలోడే కానీ మామూలోడు కాదు
అమెరికా అధ్యక్ష ఫలితాల ఉత్కంఠ వీడిపోయింది. హోరాహోరీ హోరు జరుగుతుందని అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ట్రంప్ ఘన విజయంతో వైట్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ ట్రంప్ కు ఇంత విజయం ఎలా సాధ్యమైంది...? హారిస్ ఎక్కడ దెబ్బతిన్నారు....? హారిస్ ను బైడెనే ఓడించారా...?
అమెరికా అధ్యక్ష ఫలితాల ఉత్కంఠ వీడిపోయింది. హోరాహోరీ హోరు జరుగుతుందని అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ట్రంప్ ఘన విజయంతో వైట్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ ట్రంప్ కు ఇంత విజయం ఎలా సాధ్యమైంది…? హారిస్ ఎక్కడ దెబ్బతిన్నారు….? హారిస్ ను బైడెనే ఓడించారా…?
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడం మొదలైప్పుడు అందరిలో ఉన్న టెన్షన్ కొద్దిసేపటికే తగ్గిపోయింది. వార్ ఒన్ సైడైపోయింది. అంతా ట్రంప్ హవానే… అమెరికా మ్యాప్ మొత్తం ఎరుపెక్కిపోయింది. మధ్యలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ బ్లూ కలర్ చిన్నబోయింది. స్వింగ్ స్టేట్స్ ను కూడా తన ఖాతాలోనే వేసుకుని స్వింగ్ కింగ్ అని నిరూపించుకున్నారు ట్రంప్.
ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ కొట్టాలో తెలిసిన నాయకుడు ట్రంప్. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసినా మొండితనంతో పోరాడి తనదైన వ్యూహాలతో ముందుకెళ్లి మిస్టర్ ప్రెసిడెంట్ అనిపించుకున్నారు. వీడెవడ్రా అన్నవాళ్లతోనే వీడు మొనగాడురా అనిపించుకున్నారు. బైడెన్ తప్పుకుని హారిస్ రేసులోకి దిగాక ట్రంప్ కున్న విజయావకాశాలు చాలా తక్కువ. సర్వేలన్నీ ట్రంప్ కు ఓటమి తప్పదని తేల్చేశాయి. తొలి డిబేట్ లో కమలా ముందు ట్రంప్ తేలిపోయారు. కానీ ఇలాంటి వాటికి భయపడితే తాను ట్రంప్ ఎందుకు అవుతారు…! తన పని తాను చేసుకుపోయారు. అమెరికన్ల మనస్థత్వం బాగా తెలిసిన ట్రంప్… వారిని తనవైపు తిప్పుకోవడానికి సైకలాజికల్ గేమ్ ఆడారు.
అమెరికా అగ్రరాజ్యమే కావచ్చు. కానీ వారికి భయం ఎక్కువ. ప్రాణభయం ఎక్కువ. దాన్నే అస్త్రంగా వాడారు. డెమోక్రాట్లకు అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్కడక్కడ అమెరికన్లపై వలసదారులు చేసిన దాడులను బాగా హైలెట్ చేశారు. దాంతో తమ ఉనికికి ముప్పు ఏర్పడుతుందేమోనని జనం భయపడ్డారు. వలసదారుల కారణంగా చిన్న చిన్న ఉద్యోగాలన్నీ వారికే వెళ్లిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇది దిగువ మధ్య తరగతికి బాగా కనెక్ట్ అయ్యింది. వలసదారులను రానిచ్చి అమెరికా సంపదనంతా వారికి దోచిపెడుతున్నారన్నది బాగా ఇంజక్ట్ చేయగలిగారు.
ఇక ట్రంప్ వాడిన మరో అస్త్రం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, ధరల పెరుగుదల. బైడెన్ హయాంలో ధరలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీన్నే ట్రంప్ బాగా ప్రచారం చేశారు. అంతేకాకుండా మరోసారి డెమోక్రాట్లకు అధికారం ఇస్తే 1920ల నాటి ఆర్ధిక మాంద్యం పరిస్థితులు మరోసారి వస్తాయని భయపెట్టారు. ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయన్న బెంగతో ఉన్న అమెరికన్లను ఇది మరింత భయపెట్టింది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు వేతనాలకు సంబంధించి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కొంతమేర ప్రజలు ట్రంప్ పై విశ్వాసం చూపారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చాలామంది అమెరికన్లు నమ్మారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం బాగా జనంలోకి వెళ్లింది. మస్క్ వంటి వారిని తనవైపు తిప్పుకోవడంలోనూ ట్రంప్ సక్సెస్ అయ్యారు. కమలా హారిస్ కు చాలామంది సెలబ్రిటీలు మద్దతు తెలిపినా ఉపయోగం లేకపోయింది.
ఇక విదేశాంగ విధానానికి సంబంధించి కూడా ట్రంప్ పక్కా లెక్కతో ముందుకెళ్లారు. తాను అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదన్నారు. లక్షల కోట్ల అమెరికన్ సంపద ఉక్రెయిన్ కు ధారబోసినా ఉపయోగం లేకుండా పోయిందని ప్రచారం చేశారు. తాను అధికారంలో ఉంటే మధ్యప్రాశ్చ్యంలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి కాదని అమెరికన్లను ఒప్పించగలిగారు. బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానం దారుణంగా ఉందని జనం కూడా నమ్మారు.
ట్రంప్ కున్న అతి పెద్ద మంచి గుణం, దుర్గుణం మొండితనం. దేనికైనా తగ్గని తత్వం ఆయన్ను అమెరికన్లు హీరోలా భావించేలా చేసింది. అదే సమయంలో కమలా హారిస్ అంత ధృడమైన వ్యక్తి కాదని వారు నమ్మారు. ఇక హత్యాయత్నం జరిగిన సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు కూడా అమెరికన్లను ఆకట్టుకుంది. ఫైట్ ఫైట్ అంటూ దేనికైనా తగ్గేదేలేదన్నట్లు ట్రంప్ మాట్లాడిన మాటలు జనంలోకి వెళ్లిపోయాయి.
ఇక హారిస్ ఓటమికి కారణం ట్రంప్ కన్నా ఎక్కువగా బైడెనే అని చెప్పుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా బైడెన్ తన పార్టీని ఓటమి అంచుకు నడిపారు. ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాతే బైడెన్ పార్టీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు. వృద్ధాప్యం మీదపడ్డా, పక్కనున్న వారినే గుర్తుపట్టలేనంత ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నా సీటు వదలడానికి ఇష్టపడలేదు. తర్వాత హారిస్ ను బరిలో నిలిపినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆమెకు దొరికింది కేవలం వందరోజులే. ట్రంప్ రెండేళ్ల నుంచి కష్టపడుతుంటే హారిస్ కు దొరికింది మూడున్నర నెలలు.
బైడెన్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలు కూడా హారిస్ ను ఓడించాయి. ప్రజల్లో దానిపై వ్యతిరేకత ఉంది. దీంతో తాను బైడెన్ వంటి దాన్ని కాదని చెప్పడానికి హారిస్ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. కానీ ఉపయోగం లేకపోయింది. అబార్షన్ విషయంలో ఆమె మహిళలకు అండగా నిలిచారు. వృద్ధులు కూడా ఆమెవైపు నిలబడ్డారు. కానీ యువతను మాత్రం ఆమె ఆకట్టుకోలేకపోయారు. ట్రంప్ మాస్ ప్రసంగాలతో జనంలోకి వెళితే హారిస్ కాస్త పద్దతిగా వ్యవహరించారు. దీంతో ఆమె ఏం చెబుతున్నారో పూర్తిగా మాస్ కు చేరలేదు. మధ్యతరగతిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా ధరల పెరుగుదల దాన్ని అడ్డుకుంది. ఇక హారిస్ చేసిన మరో తప్పు తనను తాను ఆఫ్రో అమెరికన్ గా పదే పదే చెప్పుకోవడం. దీంతో ఆసియన్లు కొంతమేర భారతీయులు కూడా ట్రంప్ వైపు మొగ్గు చూపారు. తనను తాను ఆమె అమెరికన్ గా చెప్పుకుంటే బాగుండేది. భారతీయుల్లో చాలామంది ట్రంప్ వస్తే తమకు ఇబ్బంది అని తెలిసినా ప్రపంచం కుదుటపడాలంటే ట్రంప్ వంటి వారే కరెక్ట్ అని భావించారు. ఇది కూడా కలసి వచ్చింది. యుద్ధాలు, విదేశాంగ విధానం విషయంలో జనం ప్రశ్నలకు హారిస్ సమాధానం చెప్పలేకపోయారు.
ఇక అమెరికన్లు ఓ మహిళను తమ అధ్యక్షురాలిగా అంగీకరించలేకపోయారు. అమెరికన్లు మహిళలకు ఓటు హక్కు కల్పించడం వెనక చాలా పోరాటమే జరిగింది. అలాంటి తమను ఓ మహిళ పాలించడం ఏంటని కొందరు భావించడం కూడా ఆమె అవకాశాలను కొంతమేర ప్రభావితం చేసింది. బైడెన్ ను గెలిపించిన అవే స్వింగ్ స్టేట్స్ హారిస్ ను ఓడించాయి. అయితే హారిస్ అంత వీక్ పర్సన్ కాదు… ఇలాంటి ఓటములు ఆమెను ఓడించలేవనే చెప్పాలి. ఆమె గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు.