ట్రంప్ చేతికి భారత వ్యతిరేకుల జాబితా అగ్రరాజ్యంలో మొదలైన ఉగ్ర వేట..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది.

గురుపత్వంత్ సింగ్ పన్నూ.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది. కానీ, ఎక్కడో విదేశాలలో దాక్కొని భారత్‌పై కుట్రలు చేస్తూ రెచ్చిపోతున్నాడు. ఈ కేటుగాడికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అన్నివిధాలుగా అండగా నిలుస్తోంది. ఇటీవలే ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలోనే హత్య చేస్తామని బెదిరింపులకు దిగాడు. ఖలిస్తానీ ఉగ్రవాది ఈ రేంజ్‌లో రెచ్చిపోడానికి కారణం అమెరికా చూసీ చూడనట్టు వ్యవహరించడమే. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే జో బైడెన్ ప్రభుత్వం పన్నూకు పరోక్షంగా మద్దతిచ్చింది. ఫలితంగా అమెరికాలో దాక్కొని భారత్‌పై విషం చిమ్మడం మొదలుపెట్టాడు. అయితే, ఈ ఆటలు ఇక సాగవు.. ఎందుకంటే, మోడీ సర్కార్ ఇప్పుడు యాక్షన్ మార్చింది. అమెరికాలో తల దాచుకుని భారత్‌పై చిందులు తొక్కుతున్నవారి తోక తెంచేందుకు సిద్ధమైంది. అందుకు మోడీ అమెరికా పర్యటనే వేదిక కాబోతోంది. ఆ వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
అమెరికా పర్యటనలో మోడీ బిజీ బిజీగా ఉన్నారు. ఇరు దేశాల సంబంధాలను ఈ పర్యటన కీలక మలుపు తిప్పబోతోంది. రక్షణ ఒప్పందాలు మొదలుకొని వాణిజ్య సంబంధాల వరకూ ఎన్నో మార్పులకు ఈ టూర్ కేరాఫ్‌గా నిలవబోతోంది. అలాంటి వాటిలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింత కూడా ఉండబోతోంది. అమెరికాలో నక్కి.. భారత్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాల్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నా జో బైడెన్ వంటి లీడర్లు వాటిని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఎంట్రీతో సీన్ మారింది. దీంతో భారత్ కూడా తన ప్రయత్నాల్లో వేగం పెంచింది. మోడీ అమెరికా పర్యటన ఖరారైన వెంటనే భారత భద్రతా ఏజెన్సీలు ఓ నివేదిక రూపొందించాయి. ప్రస్తుత అమెరికా పర్యటనలో ఆ లిస్టును ట్రంప్ చేతికి అందించి భారత వ్యతిరేకులను అప్పగించాలని కోరడం ఒక్కటే తరువాయి. ఆల్రెడీ ట్రంప్ చేతికి లిస్టు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే విదేశీ గడ్డపై రెచ్చిపోతున్న ఖలిస్తానీల ఆటా ముగుస్తుంది. ఎందుకంటే, భారత భద్రత ఏజెన్సీలు సిద్ధం చేసిన లిస్టులో మెజారిటీ పేర్లు వారివే ఉన్నాయి.
విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా కేంద్ర సంస్థల వద్ద ఇప్పటికే ఉంది. దాని ఆధారంగానే జాబితాను రూపొందించారు. ఆ లిస్టులో గురుపత్వంత్, గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ తదితరుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంయి. సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు ముంబై పోలీసులకు ఇప్పటికే సమాచారం ఉంది. అతడి కదలికలకు సంబంధించిన వివరాలను అమెరికా పోలీసులతో పంచుకున్నారు. దీంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముంబైలో సంచలనం రేపిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ టచ్‌లో ఉన్నాడు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అన్మోల్‌పై దాదాపు 18 కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఇతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
మరోవైపు.. గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది. సల్మాన్ ఖాన్ ఇంటి పైకి కాల్పులు జరిపిన ఘటన లోనూ గోల్డీ బ్రార్ పేరు వినిపించింది. అతడు కూడా అమెరికా లోనే ఉన్నాడు. వీరితోపాటు సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ పన్నూ కూడా అగ్ర దేశంలోనే ఉంటూ భారత్‌లో విధ్వంసం సృష్టిస్తానని పదే పదే బెదిరింపులకు దిగుతున్నాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లని చంపేస్తానని బెదిరించాడు. అంతెందుకు, ట్రంప్ విక్టరీ పార్టీలోనే ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి రెచ్చిపోయాడు. నిజం చెప్పాలంటే అమెరికాలో తల దాచుకున్న ఇండియాస్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థలు సిద్దం చేసిన జాబితాలో కచ్చితంగా అతడి పేరు ఉంటుంది.
వాస్తవానికి.. ఖలిస్తానీవాదం భారత సమస్యే అయినా దాని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ ఉగ్రవాద ముఠాలు ఉన్నాయన్న నిజం బైడెన్ ప్రభుత్వానికి తెలియనిదేంకాదు. అయినా ఇండియా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పిస్తూ మనతో డబుల్ గేమ్ ఆడింది. అందుకే, అమెరికా గడ్డపై అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. డొనాల్డ్ ట్రంప్ దేన్నైనా క్షమిస్తారు కానీ, ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించరు. పైగా తన విక్టరీ పార్టీలోకి చొరబడి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేయడాన్ని ట్రంప్ తేలిగ్గా తీసుకోరు. అందుకే, గురుపత్వంత్ సింగ్ పన్నూతో పాటు ఖలిస్తానీల ఆట కట్టించడానికి ఇదే సరైన సమయం అని మోడీ సర్కార్ భావిస్తోంది. అందుకే అగ్ర రాజ్యం పర్యటనలోనే అసలు లెక్క తేల్చాలని నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి ప్రధాని మోడీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్స్ లిస్టును ట్రంప్ చేతిలో పెడితే అప్పుడు మొదలవుతుంది అసలు సిసలు ఆట. వివరంగా చెప్పాలంటే.. గురుపత్వంత్ సింగ్ ఒక్కడి కథ ముగించగలిగితే ఖలిస్తానీ భూతం ఖేల్ ఖతమైపోయినట్టే. ఎందుకంటే కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఖలిస్తానీలను నడిపిస్తోంది అతడే. అందుకే, ఆ ఒక్కడి కథ ముగించాలని భారత్ ఎప్పుడో డిసైడ్ అయింది. ఇప్పుడు ట్రంప్ సాయంతో అది జరగబోతోంది.