ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో విద్యాశాఖ రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా విద్యాశాఖను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా విద్యాశాఖను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశాడు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఆయన గురువారం విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. “విద్యాశాఖ ద్వారా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ శాఖ అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించాలని మేము నిర్ణయించుకున్నాము. అతి త్వరలోనే దీనిని అమలు చేస్తాము” అని ట్రంప్ చెప్పారు. అయితే విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ తీసుకున్న ఈ చర్యను డెమోక్రట్లు తీవ్రంగా విమర్శించారు. ఇది అత్యంత విధ్వంసకరమైన నిర్ణయమని విమర్శించారు. విద్యాశాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ తెలిపారు. అదే సమయంలో ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే విద్యాశాఖలోని సిబ్బందిని సగానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే లిండా మెక్‌మాన్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. “ట్రంప్ నాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖను మూసివేయడానికి మేము కాంగ్రెస్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించిన వారిపై వేటు వేయడమే” అని ఆమె ఇటీవల పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు ముందుకొచ్చారు.