TS ELECTIONS: తెలంగాణలో ఇక ఎన్నికలే ఎన్నికలు !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. ఇక వరుసగా పంచాయతీ, MPP, ZPTC, మున్సిపల్ ఎన్నికలతో పాటు జనరల్ ఎలక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇక వరుస ఎన్నికలను ఎదుర్కోబోతోంది. పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
TS ELECTIONS : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. ఇక వరుసగా పంచాయతీ, MPP, ZPTC, మున్సిపల్ ఎన్నికలతో పాటు జనరల్ ఎలక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇక వరుస ఎన్నికలను ఎదుర్కోబోతోంది. పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రపోజల్స్ ఆమోదిస్తుందా… పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరకూ వాయిదా వేయిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల కాలం ఫిబ్రవరి 1తో ముగుస్తోంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఐదేళ్ళ పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలి. కొత్త తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కూడా టర్మ్ ఎండ్ అవడానికి మూడు నెలల ముందే ఎలక్షన్స్ పెట్టాలి. అందువల్ల జనవరి లేదా ఫిబ్రవరిలోగా మూడు దశల్లో వీటిని నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ తో సహా అన్ని ప్రతిపాదనలను కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది SEC. మార్చి, ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున… ఈలోగానే పంచాయతీ ఎలక్షన్స్ పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. కానీ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరం కృష్ణ మోహన్ ఇంకా పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. నివేదికకు ఇంకా టైమ్ పట్టే అవకాశాలున్నాయి.
తెలంగాణాలో గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు కొన్ని నెలల్లో మండల, జిల్లా పరిషత్ అంటే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఇవి అయ్యాక మున్సిపల్ ఎన్నికలు జరగాలి. అయితే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బందిని నియమించడం అనేది ఓ పెద్ద కార్యక్రమం. ఈనెల 30లోగా ఈ కసరత్తు పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. త్వరలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలని భావిస్తోంది. మరి ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోద తెలుపుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.